కడెం, మే 24 : ఓ రైతు వద్ద రూ.7 వేలు లంచం తీసుకుంటూ ఓ సర్వేయర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లా కడెం మండలంలో శనివారం చోటు చేసుకుంది. ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని గంగాపూర్ గ్రామానికి చెందిన రైతు గుగ్లవత్ ప్రభాకర్ తన తండ్రి మరణానంతరం ఐదెకరాల పట్టా మార్పిడిలో భాగంగా కొలతల ప్రొసీడింగ్ కోసం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు.
దీని కోసం కడెం మండల సర్వేయర్ ఉమాజీని కలువగా ఎకరానికి రూ.5 వేల చొప్పున రూ.25 వేల వరకు డిమాండ్ చేసి, చివరకు రూ.20 వేలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అందులో నుంచి రూ.12 వేలను గత నెల 28న ఇవ్వగా, మరో రూ.8 వేల కోసం నిత్యం వేధిస్తున్నాడు. దీంతో బాధితుడు ప్రభాకర్ ఏసీబీని ఆశ్రయించాడు. శనివారం రూ.7 వేలను సర్వేయర్‌కు ఇస్తుండగా పట్టుకున్నట్లు తెలిపాడు. నిందితుడు సర్వేయర్‌ని అదుపులోకి తీసుకుని తహసీల్దార్ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.