అభం శుభం తెలియని ఆ ఆరేళ్ల బాలుడికి పెద్దకష్టమే వచ్చింది. బ్రెయిన్ ట్యూమర్‌తో హాస్పిటల్లో చేరగా, వైద్యమందించే స్థోమత లేని అతడి తల్లిదండ్రులు దాతల కోసం ఎదురుచూస్తున్నారు. తోచిన సాయమందించి తమ బాబును బతికించాలని చేతులెత్తి వేడుకుంటున్నారు.
దండేపల్లి, మార్చి 3 : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లక్ష్మీకాంతాపూర్ గ్రామానికి చెందిన ఈర్ల సతీశ్-మౌనిక దంపతులకు ఇద్దరు కుమారులు. బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లారు. సతీశ్ అక్కడే ఓ ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం చేసుకుంటుండగా, భార్య గృహిణిగా పిల్లలను చూసుకుంటుంది. గతేడాది దసరా పండుగకు స్వగ్రామానికి రాగా, రెండో కుమారుడు అభిజిత్ (6) ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యాడు. ఆపై హైదరాబాద్‌కు వెళ్లి గాంధీ దవాఖానలో చూపించారు. సిటీ స్కాన్ చేసి పరీక్షలు నిర్వహించగా బ్రెయిన్ ట్యూమర్‌గా డాక్టర్లు నిర్ధారించారు. దీంతో ఒక్కసారిగా వారి జీవితాల్లో చీకట్లు కమ్ముకున్నాయి.
నవంబర్ 3న గాంధీ హాస్పిటల్లో చిన్న ఆపరేషన్ చేశారు. అనంతరం ఉస్మానియాకు రెఫర్ చేయగా, అక్కడ మరోసారి సర్జరీ చేసి బ్రెయిన్ ట్యూమర్‌గా గుర్తించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికే బాలుడి వైద్యానికి రూ.లక్ష వరకు ఖర్చు కాగా, పూర్తి స్థాయిలో కోలుకోవాలంటే మరో రూ.10 లక్షలు అవసరమని డాక్టర్లు చెప్పడంతో ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. దాతలెవ్వరైనా ముందుకు వచ్చి వైద్యానికి భరోసా ఇవ్వాలని బాలుడి తల్లిదండ్రులు ప్రాధేయపడుతున్నారు. ఫోన్ పే-గూగుల్ పే : 8008264439(ఈర్ల సతీష్), ఎస్బీఐ అకౌంట్ నంబర్ : 20155788028(ఐఎఫ్ఎస్సీ కోడ్ : ఎస్బీఐఎన్0012967)లకు సాయం పంపాలని వేడుకుంటున్నారు.