కుమ్రం భీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ)/దహెగాం, నవంబర్ 20 : రైతుల మేలు కోసం ఓ సింగరేణి ఉద్యోగి 20 గుంటలు దానమివ్వగా, ఆ స్థలం కబ్జాకోరల్లో చిక్కుకున్నది. కొంత భాగంలో పీఏసీఎస్ కార్యాలయం, బ్యాంకు నిర్మాణం చేపట్టగా, ఇక మిగతా ఖాళీ స్థలంపై కన్నేసిన కొందరు ఇప్పటికే ఆరు గుంటల దాకా స్వాహా చేయడం విమర్శలకు తావిస్తున్నది.
కన్నేసి కబ్జా..
ఆసిఫాబాద్ జిల్లా దహెగాంలో పీఏసీఎస్ కార్యాలయం, బ్యాంకు నిర్మా ణం కోసం దాసరి విఠల్ అనే సింగరేణి ఉద్యోగి తనకు వారసత్వంగా వచ్చిన సర్వే నంబర్ 247లోని 20 గుంటలు దానమిచ్చాడు. ఇందులోని కొంత భాగంలో పీఏసీఎస్ కార్యాలయంతో పాటు బ్యాంకు నిర్మా ణం చేపట్టారు. ఆ సమయంలో స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించలేదు. దీంతో ఈ విలువైన భూమిపై కొందరు కన్నేశారు. క్రమ క్రమంగా ఆరు గుంటల వరకు కబ్జా చేశారు. అప్పుడు ఈ స్థలానికి పెద్దగా విలువ లేదు. కానీ, ఇప్పుడు గుంటకు రూ. 5 నుంచి రూ. 6 లక్షల దాకా పలుకుతున్నది. కబ్జాదారులకు కొందరు రాజకీయ నాయకులు, సీఏసీఎస్ పాలకవర్గం సభ్యులు అండదండలున్నట్లు తెలుస్తున్నది. గతంలో పీఏసీఎస్ సీఈవో బక్కయ్య ఈ కబ్జాపై స్థానిక ఎమ్మార్వోకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. లక్షలాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ స్థలం కబ్జాకు గురవుతుండగా, పట్టించుకునే నాథుడు లేకపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
పీఏసీఎస్ స్థలాన్ని కాపాడాలి
దహెగాం మండల కేంద్రంలో కబ్జాకు గురవుతున్న పీఏసీఎస్ స్థలాన్ని విడిపించాలి. 40 ఏండ్లకు ముందు దాసరి విఠల్ అనే సింగరేణి ఉద్యోగి పీఏసీఎస్ సంఘానికి 20 గుంటలు దానమిచ్చాడు. చుట్టూ ప్రహరీ నిర్మించకపోవడంతో కబ్జా అవుతున్నది. లక్షలు విలువచేసే ఈ స్థలం స్వాహా అవుతున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా స్పందించి పీఏసీఎస్ స్థలాన్ని కాపాడాలి.
– నారాయణ, సింగిల్ విండో చైర్మన్, దహెగాం
పీఏసీఎస్ స్థలానికి రక్షణ లేదు
పీఏసీఎస్ స్థలం ఇప్పటికే చాలా వరకు కబ్జా అయింది. దీనిపై గతంలో అధికారులకు ఫిర్యాదు చేశాను. ఇప్పటి వరకూ ఎలాంటి స్పందన లేదు. అధికారులు వచ్చి సర్వే చేశారుగానీ కబ్జా నుంచి స్థలాన్ని విడిపించలేకపోయారు. రైతులకు ఉపయోగపడే పీఏసీఎస్ స్థలాన్ని కాపాడాలి.
– బక్కన్న, సీఈవో, పీఏసీఎస్ దహెగాం
నోటీసులు జారీ చేస్తాం
దహెగాంలోని పీఏసీఎస్‌కు సంబంధించిన స్థలాన్ని కొంత మంది కబ్జా చేస్తున్న విషయం నా దృష్టికి వచ్చింది. కబ్జాదారుల నుంచి స్థలాన్ని కాపాడేందుకు కావాల్సిన చర్యలు చేపడుతాం. కబ్జాదారులకు నోటీసులు జారీ చేస్తాం. వారి నుంచి స్పందన రాకపోతే కేసులు నమోదు చేసైనా సరే స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటాం.
– మోహన్, డీసీవో