ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎటు చూసినా జలసవ్వడులే వినిపిస్తున్నాయి. నడివేసవిలోనూ వాగులు, వంకలు గలగలా పారుతుండగా.. చెరువులు మత్తడి దుంకుతున్నాయి. దశాబ్దాలుగా బీడువారిన భూముల్లో బంగారు పంటలు పండుతున్నాయి. వరుణుడి కరుణతో అధిక వర్షాలు కురియగా.. బొట్టు బొట్టునూ ఒడిసిపట్టిన ఫలితంగా భూగర్భ జలాలు ఉబికి వస్తున్నాయి. బోర్ల నుంచి నీటిధారలు వాటంతట అవే పైకి వస్తున్నాయి. పూడిక, శిథిలావస్థకు చేరిన చెరువులు మిషన్ కాకతీయతో జలకళను సంతరించుకున్నాయి. ఏండ్ల నీటిగోస తీరగా.. బావుల్లో నీరు చేతికందుతున్నది. కాగా.. కనుచూపు మేర పచ్చదనమే దర్శనమిస్తుండగా.. ధాన్యపు దిగుబడులు దండిగా వస్తున్నాయి. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని ప్రాజెక్టులు, కాలువలు, చెరువులు, చెక్‌డ్యాంలకు నిధులు మంజూరు చేసి పూర్తి చేయించడంతో జిల్లా ముఖచిత్రమే మారిపోయింది. కర్షకుల కష్టాలు, కన్నీళ్లను దూరం చేసిందని చెప్పవచ్చు. తొమ్మిదేండ్లలో జిల్లా సస్యశ్యామలంగా మారగా, అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సాగునీటి రంగంపై ‘నమస్తే’ స్పెషల్ స్టోరీ.
– ఆదిలాబాద్, జూన్ 6(నమస్తే తెలంగాణ)
ఆదిలాబాద్, జూన్ 6(నమస్తే తెలంగాణ): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సాగు నీటి ప్రాజెక్టులకు రాష్ట్ర సర్కారు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నది. యేడాదికి రెండు పంటలు సాగు చేసుకోవడానికి అవసరమైన ప్రాజెక్టులు, కాలువలు నిర్మిస్తున్నది. ఇందుకోసం నిధులు మంజూరు చేస్తున్నది. ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మండలం సాత్నాల ప్రాజెక్టు ద్వారా 24 వేలు, తాంసి మండలంలోని మత్తడి ప్రాజెక్టు ద్వారా 8,500 ఎకరాలకు సాగునీరు అందుతోంది. వీటితోపాటు 392 చెరువుల ద్వారా 71,992 ఎకరాల ఆయకట్టుకు నీరు సరఫరా అవుతోం ది. మహారాష్ట్ర సరిహద్దులో గల జైనథ్ మండలం చనాక వద్ద రూ.1,596 కోట్లతో చనాక-కొరాట ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. దీనిద్వా రా ఆదిలాబాద్, భీంపూర్, జైనథ్, బేల మండలాల పరిధిలోని 51 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు తుదిదశలో ఉండగా.. త్వరలో ట్రయల్ రన్ నిర్వహించడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. బరాజ్, పంప్‌హౌస్, ప్రధాన కాలువ పనులు పూర్తయ్యాయి. భీంపూర్ మండలంలోని పిప్పల్‌కోటి వద్ద రూ.281 కోట్లతో నిర్మిస్తున్న ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి.
నేడు సాగునీటి దినోత్సవం
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాగు నీటి దినోత్సవం జరుపనున్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో సభలు నిర్వహిస్తారు. సాగునీటి రంగంలో సాధించిన ప్రగతిని వివరిస్తారు.
మంచిర్యాల జిల్లాలో..
మంచిర్యాల నియోజకవర్గంలోని కడెం ఆయకట్టు కింద, గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా 10 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.80.50 కోట్లతో నిర్మించనున్న పర్ధాన్‌పల్లి ఎత్తిపోతల పథకానికి ఈనెల 9న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చెన్నూర్ నియోజకవర్గ పరిధిలోని ఒక లక్ష ఎకరాలకు 10 టీఎంసీల సాగు నీరు అందించేందుకు రూ.1,658 కోట్లకు పరిపాలన అనుమతులు కూడా మంజూరయ్యాయి. దీనిని కూడా సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని వార్ధా నదిపై నిర్మించనున్న ప్రాజెక్టు ద్వారా 55 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మిషన్ కాకతీయ ద్వారా రూ.96 కోట్లతో 563 చెరువులకు మరమ్మతులు చేపట్టారు. దీంతో 35 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. రూ.9.30 కోట్లతో చెక్‌డ్యామ్‌లు నిర్మించారు.
నిర్మల్ జిల్లాలో..
జిల్లాలోని ఖానాపూర్ నియోజకవర్గంలో రూ.520 కోట్లతో సదర్మాట్ బరాజ్‌ను నిర్మించగా, కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 27,28 పనులు పూర్తయ్యాయి. ఇందుకు ప్రభుత్వం రూ.1,144 కోట్లు వెచ్చించింది. మిషన్ కాకతీయ పథకంలో భాగంగా రూ. 16 కోట్లతో 410 చెరువులకు మరమ్మతులు చేపట్టారు. దీంతో 7,480 ఎకరాల ఆయకట్టు అదనంగా సాగులోకి వచ్చింది. రూ.49 కోట్లతో 21 చెక్‌డ్యామ్‌లు నిర్మించగా 4,990 ఎకరాలకు సాగునీరు అందుతోంది.
మిషన్ కాకతీయ ఫలాలు
ఆదిలాబాద్ జిల్లాలోని మిషన్ కాకతీయ పథకంలో భాగంగా 103 చెరువుల మరమ్మతుల కోసం రూ.6,2.13 కోట్లు వెచ్చించగా.. అదనంగా 21,807 ఎకరాల ఆయకట్టు పెరిగింది. జిల్లాలో రెండో విడుతలో 72 చెరువులను పునరుద్ధరించడంతోపాటు ఆదిలాబాద్ సమీపంలోని ఖానాపూర్ చెరువును మినీ ట్యాంక్ బండ్‌గా మార్చడం కోసం రూ.4.87 కోట్లు, ఉట్నూర్ గోపయ్య చెరువుని మినీట్యాంక్ బండ్‌గా మార్చడానికి రూ.3.71 కోట్లు మంజూరయ్యాయి. మూడో విడుతలో 22 చెరువుల మరమ్మతులకు రూ.27.30 కోట్లు కేటాయించారు. నాలుగో విడుతలో 22 చెరువుల పునరుద్ధరణకు రూ.86.80 కోట్లు మంజూరుయ్యాయి. వీటితోపాటు జిల్లాలో రూ.126.48 కోట్లతో 47 చెక్‌డ్యాంలు నిర్మించారు. వీటి ద్వారా 8,819 ఎకరాలకు సాగునీరు సరఫరా అవుతోంది.
రెండు,మూడు పంటలు తీస్తున్నం..
మా తాత, మా తండ్రి ఎవుసం చేసేటప్పుడు వానకాలం పంట మాత్రమే తీస్తుండే. మిగతా రోజుల్లో మా గ్రామంల చెట్ల కింద ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటుండే. ఇగ, ఎవుసం నా చేతికి, మా కొడుకుల చేతికొచ్చినంక రెండు, ఒక్కోసారి మూడు పంటలు కూడా పండిస్తున్నం. కారణమేమంటే సీఎం కేసీఆర్ సార్ తీసుకుంటున్న రైతు సంక్షేమ చర్యలే. పెన్‌గంగ నుంచి 80 పైపులేసి మరీ నీళ్లందిస్తున్నడు. సీఎం సార్ మళ్లీ రావాలె..
– గడ్డం భూమారెడ్డి, రైతు, గుబ్‌డి, భీంపూర్ మండలం
నీళ్లు ఫుల్‌గా ఉంటున్నయి
సోన్, జూన్ 6 : మా ఊరి పక్కన స్వర్ణ వాగు ఉంది. నాకు వాగు పక్కన రెండు ఎకరాల భూమి ఉంది. ఎండాకాలం వస్తే చాలు అది ఎండిపోయేది. పంట ఎట్ల చేతికొస్తదోనని మస్తు రంది పడేటోళ్లం. ఇగ తెలంగాణ వచ్చినంక మా బాధలన్నీ పోతున్నయ్. సీఎం కేసీఆర్ అన్ని విధాలా ఆదుకుంటున్నడు. మొన్న సీఎం కేసీఆర్, మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మంచిగా ఆలోచించి స్వర్ణవాగుపై చెక్‌డ్యాంలు నిర్మించిన్రు. ఇప్పుడు నీళ్లు ఫుల్‌గా ఉంటున్నయి. రంది లేకుండా రెండు పంటలు పండిస్తున్నం. సీఎం కేసీఆర్‌కు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం..
– భీంరావు, రైతు, సాకెర, సోన్ మండలం
గొప్ప నాయకుడు కేసీఆర్
సోన్, జూన్ 6 : నాకు మా ఊరి చెరువు కింద ఎకరం భూమి ఉంది. సర్కారోళ్లు మిషన్ కాకతీయ కింద దానిని మం చిగ చేసిన్రు. ఎండాకాలం లో కూడా పుష్కలంగా నీళ్లుంటున్నయి. గా నీళ్లతో యేటా రెండు పంటలు పండిస్తున్న. రైతుల కోసం మంచి పథకాలు తీసుకొచ్చి కష్టాలను అర్థం చేసుకున్న గొప్ప నాయకుడు కేసీఆర్ సార్.
– సూది రమణయ్య, రైతు, నీలాయిపేట్, నిర్మల్ మండలం
పుష్కలంగా నీళ్లిస్తుండు
కోటపల్లి, జూన్ 6 : తెలంగాణ రాకముందు రైతుల బాధలను పట్టించుకున్నోళ్లు లేకుండే. కరెంట్ ఉంటే నీళ్లు.. నీళ్లుంటే కరెంట్ ఉండేటిది కాదు. మస్తు తిప్పల పడేటోళ్లం. ఇప్పుడు ఇగ ఏ రందీ లేదు. సీఎం కేసీఆరే రైతులను అన్నితీర్ల ఆదుకుంటున్నడు. మిషన్ కాకతీయ కింద చెరువులను మంచిగ చేసి పుష్కలంగా నీళ్లిస్తుండు. ఉచితంగా 24 గంటల కరెంటిస్తున్నడు. గిసొంటి సీఎం ఉన్నంత కాలం మాలాంటి రైతుల బతుకులు మంచిగుంటయ్.
– మేడ తిరుపతి రెడ్డి, నక్కలపల్లి