బజార్ హత్నూర్ : పదవ తరగతి పూర్తి చేసుకుని 26 సంవత్సరాలు గడిచిన తర్వాత పుర్వ విద్యార్థులంతా ఒక దగ్గర కలుసుకోవడం ఆనందంగా ఉందని బజార్ హత్నూర్ ఉన్నత పాఠశాలలో చదివిన 1998-1999 బ్యాచ్ పూర్వ విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక తిరుమల ఫంక్షన్ హాల్లో పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విద్యాబుద్ధులు నేర్పిన ప్రధానోపాధ్యాయులు చట్ల గజ్జరాం, టి నారాయణ, రాజేశ్వర్, రమేష్, మురళి అనే ఉపాధ్యాయులను శాలువలతో సత్కరించి అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
విద్యార్థులు, ఉపాధ్యాయులు తరగతి గదిలో జరిగిన స్మృతులను గుర్తు చేసుకొని ఉద్విగ్నతకు లోనయ్యారు. తరగతి గదిలో ఉపాధ్యాయులు విద్యార్థుల మంచి కోసమే పనిచేస్తారని ఒకప్పటి విద్యార్థులకు నేటి విద్యార్థులకు ఉన్న వ్యత్యాసాన్ని ఉపాధ్యాయులు తెలియజేశారు. టెక్నాలజీ వ్యవస్థ పెరగడంతో కొంతమంది విద్యార్థులు చెడు వైపు ప్రయాణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటుచేసిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మేకల వెంకన్న, పర్స భోజన్న, కృష్ణ, రమేష్, అమర్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.