చెన్నూర్, సెప్టెంబర్ 23 : చెన్నూర్ పట్టణం నడిబొడ్డున ఉన్న కుమ్మరికుంట శిఖం భూమి నిర్ధారణ కోసం యం త్రాంగం సోమవారం సర్వే ప్రారంభించింది. చెరువు శిఖం సర్వే నంబర్ 971లో 16.24ఎకరాలు ఉండాల్సి ఉండగా, కొన్నేళ్లుగా ఆక్రమణకు గురికావడంతో విస్తీర్ణం తగ్గుతూ వచ్చింది. ఈ చెరువు శిఖం నుంచే పలు గ్రామాలకు వెళ్లేందుకు కొన్నేళ్లక్రితం ప్రధాన రహదారి ఏర్పాటు చేయగా, దానిని ఆనుకొని అనేక నిర్మాణాలు చేపట్టడంతో శిఖం కుదించుకపోయింది. ప్రస్తుతం నాలుగైదు ఎకరాలకే శిఖం భూమి పరమితమైంది.
ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు కుమ్మరికుంట శిఖం భూమిని గుర్తించేందుకు డిప్యూటీ తహసీల్దార్ సనత్‌కుమార్, సర్వేయర్ అశోక్‌కుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రంజిత్, నీటిపారుదలశాఖ డీఈ వేణుగోపాల్, ఏఈఈ బీ తిరుపతి సంయుక్తంగా సోమవారం సర్వేను ప్రారంభించారు. ఈ మేరకు పట్టాదారులు డ్యాకుమెంట్లతో హాజరుకావాలంటూ ఈ నెల 20న రెవెన్యూ అధికారులు పలువురికి నోటీసులు జారీ చేశారు.
మొదట సర్వే నంబర్ 971లో 16.24ఎకరాల శిఖం భూమిని గుర్తించి హద్దులు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం నీటి పారుదలశాఖ అధికారులు చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను నిర్ధారించి హద్దులు నిర్ణయించనున్నారు. ఈ సర్వే పక్రియ పూర్తి కావడానికి మూడు రోజులు పడుతుందని, ఆ నివేదికను కలెక్టర్‌కు అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు.
కొన్నేళ్లుగా ఆక్రమణ
చెరువు శిఖంపై కొందరికి పట్టా భూములుండగా, కొన్నేళ్ల క్రితం ఇంటి స్థలాలుగా చేసి విక్రయించారు. అయితే అప్పట్లో శిఖం, ఎఫ్టీఎల్, బఫర్జోన్లాంటి విషయాలను ఇటు అధికారులు.. అటు కొనుగోలుదారులుకాని పట్టించుకోలేదు. అప్పట్లో ఈ స్థలాల్లో ఇంటి నిర్మాణాలకు అనుమతులు కూడా ఇచ్చారు. ఇలా శిఖంతో పాటు ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో వందల సంఖ్యలో బహుళ అంతస్తులు ఏర్పడ్డాయి. చెరువును ఆనుకొని ఉన్న ప్రధాన రహదారికి ఓ వైపు వాణిజ్య సముదాయలతో పాటు నివాస గృహాల నిర్మాణాలు జరిగాయి.
భయాందోళనలో నిర్మాణదారులు
ప్రస్తుతం కుమ్మరికుంట చెరువు శిఖం, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ హద్దులను నిర్ధారించేందుకు అధికారులు సర్వే చేస్తుండగా, అందులో నిర్మాణాలు చేపట్టిన వారంతా భయాందోళనలకు గురవుతున్నారు. ఈ హద్దులు ఎక్కడి వరకు వస్తాయో? తమ ఇండ్లు వాటి పరిధిలో ఉన్నాయేమోనని ఆందోళన చెందుతున్నారు. కాగా, సర్వే విష యం తెలుసుకొని పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చా రు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
సంయుక్తంగా సర్వే
చెన్నూర్, సెప్టెంబర్ 23 : పట్టణంలోని కుమ్మరికుంట చెరువును సంబంధిత శాఖల అధికారులతో సంయుక్తంగా సర్వే నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. వానకాలంలో చెరువు నిండి సమీపంలోని వార్డుల్లోకి వరద రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో నీటి పారుదలశాఖ, రెవెన్యూశాఖల సమన్వయంతో సర్వే నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. బఫర్ జోన్, ఎఫ్టీఎల్ జోన్ పరిధిపై విచారణ చేపట్టి ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు.