కుభీర్, ఏప్రిల్ 6 : ప్రభుత్వం రబీలో మక్క, శనగ, జొన్న సాగు చేయాలని సూచించడంతో నిర్మల్ జిల్లావ్యాప్తంగా రైతులు అధికంగా మొక్కజొన్న వేశారు. దిగుబడులు అధికంగా వస్తాయని సాగు చేసిన వారికి నిరాశే ఎదురవుతున్నది. కనీసం గిట్టుబాటు ధర కూడా దక్కే అవకాశం లేదు. కనీసం అమ్ముకోలేని పరిస్థితి నెలకొన్నది. ప్రభుత్వ మద్దతు ధర రూ.2400 కాగా.. ప్రస్తుత బయట మార్కెట్లో రూ.1600, రూ.1700లకే కొనుగోలు చేస్తుండడంతో క్వింటాలుకు రూ.700ల వరకు రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వం మక్కల కొనుగోలు కేంద్రాలు సకాలంలో ఏర్పాటు చేయకపోవడం వల్ల ఈ దుస్థితి దాపురించిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కుభీర్తోపాటు కుంటాల, తానూర్ వంటి మండలాల్లో సుమారు ఐదు వేల ఎకరాల్లో మొక్కజొన్న కోతలు ప్రారంభమయ్యాయి. పంట చేతికొచ్చి అమ్ముకునేందుకు వ్యాపారుల వద్దకు పరుగులు తీస్తున్నా ఫలితం ఉండడం లేదు.
ఆశాజనకంగా దిగుబడి.. తాజా వర్షాలతో నేలకొరిగిన పంట..
నిర్మల్ జిల్లాలో 1,11,567 ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. ఒక్క కుభీర్ మండలంలోనే 15,405 ఎకరాల్లో 5,951 మంది రైతులు సాగు చేశారు. గతేడాది కంటే ఆరు వేల ఎకరాల్లో ఎక్కువ సాగు చేయడం గమనార్హం. ప్రస్తుతం ఎకరాకు 25 నుంచి 30, 35 క్వింటాళ్ల దిగుబడి వస్తున్నది. గతంలో కంటే పంట ఆశాజనకంగా ఉన్నప్పటికీ ఇటీవల కురిసిన అకాలవర్షాలతో పంట నేలకొరిగింది. దీంతో 20 శాతం దిగుబడులు తగ్గినట్లు రైతులు పేర్కొంటున్నారు. దీనికితోడు ధర మాత్రం అమాంతం పడిపోవడంతో రైతులు దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
ప్రభుత్వం మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తేనే రైతుకు మద్దతు ధర దక్కి కొంత మేర ఊపిరి పీల్చుకొనే అవకాశం ఉం ది. కాగా.. రైతులు ఎకరాకు రూ.25 వేలు నష్ట పోతున్నారు. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా కోట్లలో నష్టపోవాల్సి వస్తున్నది. మరో పది రోజుల్లో పంట ఎక్కువగా రైతుల చేతికి అందుతుంది. అప్పుడు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే ధర మరింత దిగజారే ప్రమా దం ఉంది. ఈ విషయమై మార్క్‌ఫెడ్ డీఎం మహేశ్‌కుమార్‌ను అడుగగా.. జిల్లా వ్యాప్తంగా మక్కల కొనుగోలు కేంద్రాల ఏ ర్పాటుపై ప్రభుత్వానికి నివేదికలను పంపామని, అక్కడి నుంచి ప్రకటన వచ్చిన వెంటనే కొనుగోలు చేస్తామని తెలిపారు.

కేసీఆర్ హయాంలోనే మద్దతు ధర దక్కింది..
పంట చేతికి రాక ముందే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌దే. ఆయన హయాంలో రైతులకు మద్దతు ధర దక్కింది. కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి పంటలు సగం అమ్ముకున్న తర్వాత కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. లేని కొర్రీలు పెట్టి కేవలం 25 శాతం పంటలే కొనుగోలు చేస్తున్నారు. సోయా, కందులు, శనగలు పండించిన రైతుల కంటే దళారులకే ఎక్కువ లాభం చేకూరుతున్నది.
– బంజ రమేశ్, మక్క రైతు, మాలేగాంవ్, కుభీర్(మం)