మంచిర్యాలటౌన్, సెప్టెంబర్ 5 : మంచిర్యాల-అంతర్గాంల మధ్యనే గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మించాలని, ఈ బ్రిడ్జి నిర్మిస్తేనే ప్రజలకు ఉపయోగంగా ఉంటుందని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. గురువారం మంచిర్యాలలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
2018 లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ బ్రిడ్జి మంజూరు చేసి నిధులు విడుదల చేశారని, టెండరు ప్రక్రియతో పాటు సాయిల్టెస్టింగ్ పనులు కూడా పూర్తయ్యాయన్నారు. ఇరువైపులా గోదావరి నదివరకు రోడ్ల నిర్మాణం సై తం పూర్తయి ఉన్నాయని, ఎక్కువ మొత్తంలో భూసేకరణ కూడా అవసరం లేదని, రూ. 164 కోట్లతో ఈ వంతెన పూర్తవుతుందని పేర్కొన్నారు.
కానీ స్థానిక ఎమ్మెల్యే మాత్రం ఈ వంతెన స్థలాన్ని మార్చాలని ప్రయత్నిస్తున్నారని, ముల్కల గ్రామం మీదుగా గోదావరిపై అవతలకు ఉన్న ముర్మూర్ గ్రామం వైపు నిర్మించాలని చూస్తున్నారని, దీంతో వంతెన వ్యయం దాదాపు రూ. 450 కోట్లు అవుతుందని, వందలాది ఎకరాల స్థలాన్ని సేకరించాల్సి వస్తుందన్నారు. ఇంతచేసినా కేవలం ఐదు కిలోమీటర్ల దూరం మాత్రమే తగ్గుతుందన్నారు.
కేవలం తన మాట చెల్లుబాటు కావాలనే ఉద్దేశంతో ప్రజలకు అంతగా ఉపయోగంకాని చోట బ్రిడ్జి నిర్మించాలని చూస్తున్నారని పేర్కొన్నారు. మంచిర్యాల-అంతర్గాంల మ ధ్య బ్రిడ్జి నిర్మిస్తే పెద్దపల్లి జిల్లా కేంద్రానికి 18 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని, దీంతో వా హనదారులకు చాలా సమయం ఆదా అవుతుందని, ఇంధన భారం కూడా తగ్గుతుందని చెప్పుకొచ్చారు. దీనిని మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపెల్లి జిల్లా ప్రజలు నూటికి నూరు శాతం కోరుకుంటున్నారని, కావాలంటే ఈ బ్రిడ్జి నిర్మాణం విషయంలో ప్రజలనుంచి అభిప్రాయం కూడా తీసుకోవాలని కోరారు.
స్థా నిక ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావుకు ముందునుంచి మంచిర్యాల వాసులంటే ఇష్టం లేదని, గతంలో మంచిర్యాల కాకుండా బెల్లంపల్లిని జిల్లా చేయాలని వ్యాఖ్యానించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్‌కుమార్, మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం, మంచిర్యాల మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అంకం నరేశ్, నాయకులు తోట తిరుపతి, శ్రీపతి వాసు, సాగి వెంకటేశ్వర్రావు, గట్టయ్య, సుధీర్, సుంకరి రమేశ్, పడాల రవీందర్, తాజుద్దీన్, దగ్గుల మధు, కాటంరాజు, హాజీపూర్ మండల అధ్యక్షులు మొగిలి శ్రీనివాస్, మందపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.