ఆదిలాబాద్, సెప్టెంబర్ 25(నమస్తే తెలంగాణ) : ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు గంజాయిని సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను ఆదిలాబాద్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వివరాలను ఎస్పీ గౌష్ ఆలం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గంజాయి రవాణా అవుతుందనే సమాచారం మేరకు మహారాష్ట్ర సరిహద్దున గల ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని లక్ష్మీపూర్ చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు.
ఉత్తరాఖండ్‌కు చెందిన ఐచర్(యూకే 08 సీబీ 5318) వాహనం మహారాష్ట్రకు వెళ్తుండగా పట్టుకున్నారు. వాహన డ్రైవర్‌ను విచారించగా ఉత్తరఖండ్‌లోని హరిద్వార్‌కు చెందిన అన్షు జైన్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన పండిత్‌జీ, సోను అన్సారీలు మూడేండ్లుగా గంజాయి వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. వాహనంలో 292 ప్యాకెట్లలోని రూ.2.25 కోట్ల విలువ చేసే 900 కిలోల గంజాయి ఉన్నట్లు తెలిపారు. గంజాయి రవాణాలో ఒడిశా రాష్ట్ర మల్కన్‌గిరికి చెందిన ఆశీష్, ఉత్తరప్రదేశ్‌లోని కనంపూర్ మీరుట్ చెందిన పండిత్ జీ, ఐచర్ డ్రైవర్ వసీం అన్సారీ, క్లీనర్ అర్మాన్, అన్షుజైన్లతోపాటు మహారాష్ట్ర బుల్దానకు చెందిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.