ఆసిఫాబాద్‌టౌన్/మంచిర్యాల టౌన్, ఆగస్టు 15 : ఊరూరా త్రివర్ణ సంబురాలు అంబరాన్నంటాయి. 79వ స్వాతంత్య్ర దినోత్సవంలో భాగంగా శుక్రవారం ఉదయం జయజయ నినాదాల నడుమ మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, మంచిర్యాల జిల్లా నస్పూర్‌లోని కలెక్టరేట్లో ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌రావు ముఖ్య అతిథులుగా హాజరై జాతీయ జెండాలను ఎగురవేశారు. ఆయాచోట్ల ప్రదర్శించిన శకటాలు, స్టాళ్లు ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం ప్రభుత్వ ఆస్తులు పంపిణీ చేశారు.
ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఆసిఫాబాద్‌లో ఎమ్మెల్యే కోవ లక్ష్మి, జిల్లా అదనపు కలెక్టర్లు దీపక్ తివారీ, డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధాశుక్లా, ఎస్పీ కాంతిలాల్ పాటిల్, జిల్లా అటవీ శాఖ అధికారి నీరజ్ కుమార్, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, ఎఫ్‌డీవో సుశాంత్ సుఖదేవ్, కాగజ్‌నగర్‌లో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మంచిర్యాలలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు, మాజీ విప్ బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు, బెల్లంపల్లిలో ఎమ్మెల్యే గడ్డం వినోద్, రామగుండంలో సీపీ అంబర్కిశోర్ ఝా తదితరులు పాల్గొని.. జెండాలను ఎగురవేశారు.
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్
పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ పేర్కొ న్నారు. మంచిర్యాలలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవాల్లో ఆయన మాట్లాడుతూ పేదలకు సన్నబియ్యం ఇవ్వడమే కాకుండా రేషన్ కార్డులు అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో రూ. 20 వేల కోట్లు రుణమాఫీకి కేటాయించామని తెలిపారు. జిల్లాలో 51,523 మంది రైతులు లబ్ధిపొందారని పేర్కొన్నారు. జిల్లాలో 1,33,306 మంది రైతుల ఖాతాల్లో రూ. 251 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేసినట్లు తెలిపారు. జిల్లాకు 7398 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని చెప్పారు.
అభివృద్ధికి పెద్దపీట.. ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌రావు
రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదని ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌రావు అన్నారు. మంచిర్యాల కలెక్టరేట్లో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైమాట్లాడారు. అర్హులందరికీ రేషన్ కార్డులు మంజూరు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 7178 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి చివరి గింజవరకూ ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. సన్నాలకు రూ. 500 బోనస్ ఇస్తున్నామని, కొనుగోలు చేసిన ధాన్యానికి 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని తెలిపారు. పేదలకు 200 యూనిట్ల కరెంటును ఉచితంగా అందిస్తున్నామని, స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఈ ఏడాది మార్చి 17న శాసనసభలో ఆమోదించడం జరిగిందన్నారు.
స్వాతంత్య్ర పోరాటాల స్ఫూర్తితోనే తెలంగాణ కల సాకారం.. మంచిర్యాల బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్
సీసీసీ నస్పూర్, ఆగస్టు 15 : దేశ స్వాతంత్య్రం కోసం చేపట్టిన పోరాటాల స్ఫూర్తితోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొట్లాడి స్వరాష్ట్ర కలను సాకారం చేశారని బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ స్పష్టం చేశారు. శుక్రవారం నస్పూర్‌లోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావుతో కలిసి జాతీయ జెండా ఆవిష్కరించారు.
అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్టాన్ని ప్రగతి పథంలో నడిపించి దేశానికే రోడ్మోడల్గా తీర్చిదిద్దిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆరేనని కొనియాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతున్నా చేసిందేమీ లేదని, హామీలు అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. రైతులు కరెంట్ కోతలతో ఇబ్బందులు పడుతున్నారని, యూరియా కోసం అష్టకష్టాలు పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. అనంతరం దివాకర్‌రావు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.