మువ్వన్నెలు మురిశాయి. ఊరూరా.. వాడవాడలా త్రివర్ణ శోభితమై రెపరెపలాడాయి. 78వ స్వాతంత్య్ర దినోవత్సవ వేడుకలు గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సంబురంగా జరిగాయి. హనుమకొండ జిల్లా పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో జరిగిన వేడుకల్లో మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. వరంగల్ జిల్లా స్వాతంత్య్ర వేడుకలు ఖిలావరంగల్ ఖుష్‌మహల్ మైదానంలో నిర్వహించగా, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ములుగు జిల్లా తంగేడు మైదానంలో మంత్రి సీతక్క, మహబూబాబాద్ జిల్లా ఎన్టీఆర్ స్టేడియంలో ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రాంచంద్రూనాయక్, జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకంచ మినీస్టేడియం పరేడ్ గ్రౌండ్స్‌లో ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేదర్ క్రీడా మైదానంలో రాష్ట్ర అటవీ అభివృద్ధి శాఖ చైర్మన్ పొదెం వీరయ్య జాతీయ జెండాలను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆయా జిల్లాల అభివృద్ధి నివేదికలను చదివి వినిపించడంతోపాటు స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. ఉత్తమ సేవలు అందించిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. అలాగే ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను ముఖ్యఅతిథులు పరిశీలించారు. ఇక దేశభక్తిని, జాతీయ సమైక్యతను చాటేలా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.