ఇచ్చోడ, నవంబర్ 22 ః ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థులు ఆర్థిక సమస్యతో విద్యాభ్యాసాన్ని మధ్యలోనే నిలిపివేయకుండా విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ సాలర్షిప్(ఎన్ఎంఎంఎస్) అందిస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులను అర్హులుగా గుర్తించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అర్హత పొందిన విద్యార్థులకు తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ పూర్తయ్యే వరకు నాలుగేండ్లపాటు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఉపకార వేతనం విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.
ఆదిలాబాద్లో 748 దరఖాస్తులు, మూడు కేంద్రాలు
ఆదిలాబాద్ జిల్లాలో 2025-26 విద్యా సంవత్సరానికి ఎన్ఎంఎంఎస్ పరీక్ష రాసేందుకు ఆదిలాబాద్ 748 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని గర్ల్స్ హైస్కూల్, బాలక్ మందీర్ పాఠశాల, గవర్నమెంట్ హైస్కూల్-2లో కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే నిర్మల్ జిల్లాలో 1043 దరఖాస్తులు రాగా ఐదు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఖానాపూర్ జడ్పీఎస్ఎస్, నిర్మల్ పాఠశాల, కస్బా పాఠశాల, భైంసాలో ప్రభుత్వ పాఠశాల, భైంసా ఆశ్రమ పాఠశాలలో కేంద్రాలు ఏర్పాటు చేశారు. నేడు(ఆదివారం) పరీక్ష నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 నిమిషాల వరకు పరీక్ష ఉంటుంది. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. కేంద్రాల వైద్య శిబిరం, నీటి వసతి ఏర్పాటు చేస్తున్నాం. విద్యార్థులు 30 నిమిషాల ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. సమయం దాటితే అనుమతించరు.
ఎన్ఎంఎంఎస్కు అర్హత
ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఎన్ఎంఎంఎస్ పరీక్షకు అర్హులుగా గుర్తించారు. విద్యార్థులు ఏడో తరగతిలో 55 శాతం మారులు సాధించి ఉండాలని, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 50 శాతం సాధించాలనే నిబంధనలు ఉన్నాయి. ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్, ఎయిడెడ్ పాఠశాలలతోపాటు హాస్టల్ వసతి లేని ఆదర్శ పాఠశాలల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
రోజు ప్రత్యేక తరగతులు
ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకున్నా. మాకు రోజు సాయంత్రం తెలుగు ఉపాధ్యాయుడు సత్యనారాయణ సార్ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. మలాంటి పేద విద్యార్థులకు ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ ఉపయోగపడుతుంది. నాతోపాటు మరి కొంత మంది విద్యార్థులు రోజు పరీక్షల కోసం సన్నద్ధం అవుతున్నారు. ఇలాంటి స్కాలర్షిప్లపై అధికారులు అవగాహన కల్పిస్తే బాగుంటుంది.
– జి.సాయిరాం, ఎనిమిదో తరగతి, సిరికొండ హైస్కూల్
ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం..
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉపకార వేతనాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నది. పరీక్షకు ప్రణాళికతో చదివితే అర్హత సాధించవచ్చు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయులు తెలుగు పండిత్ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆయా సబ్జెక్టుల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తూ మెలకువలు నేర్పిస్తున్నారు. ఎకువ మంది విద్యార్థులు అర్హత సాధించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.
– పి.సునీల్, ఎంఈవో, సిరికొండ