‘ఓటు హక్కు కోసం ఓటరుగా నమోదవుదాం.. ఓటరు లిస్టు చెక్ చేసుకోండి.. మీ ఓటును సంరక్షించుకోండి.. మీ ఓటు మాయమైతే భవిత గల్లంతే.. మీ ఓటే మీ భవిష్యత్.. ఓటు ఒక వజ్రాయుధం.. నమోదు చేసుకొని చూడు తెలుస్తుంది నీ బలం..’ అంటూ బీఎల్వోలు ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఓటరు నమోదుపై ఎన్నికల సంఘం దృష్టిసారించింది. ప్రధానంగా పద్దెనిమిదేండ్లు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయించాలని సంకల్పించింది. ఇందులో భాగంగా ఓటు ప్రాధాన్యతను తెలుపుతూ ప్రచారం నిర్వహిస్తున్నది. యువత, కళాశాల విద్యార్థులను కొత్తగా ఓటు హక్కు నమోదు చేయించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. ‘ఐ ఓట్ ఫర్ షూట్’ అంటూ అవగాహన కార్యక్రమాలను భారీ ఎత్తున చేస్తున్నది. వీటితోపాటు మార్పులు, చేర్పులు, తొలగింపు అభ్యంతరాలను కూడా స్వీకరించింది. కాగా.. వీటన్నింటిని పరిశీలించి అక్టోబర్ 4వ తేదీన తుది జాబితా ను ప్రదర్శించడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు.
సారంగాపూర్, సెప్టెంబర్ 24 : ఈ ఏడాది చివరిలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితా తయారీకి కసరత్తు చేస్తున్నది. సవరించిన షెడ్యూల్ ప్రకారం బీఎల్వోలు ఇంటింటి ప్రచారం నిర్వహించి 18 యేండ్లు నిండిన వారిని ఓటరుగా నమోదు చేయించడానికి దరఖాస్తులు స్వీకరించారు. వీటిని పరిశీలిస్తే యువత కొత్తగా ఓటు నమోదుకు ఆసక్తి చూపినట్లు తెలుస్తున్నది. వీటితోపాటు మార్పులు, చేర్పులు, తొలగింపు అభ్యంతరాలను స్వీకరించారు. వీటిని ఈ నెల 28 వరకు ఇంటింటి ప్రచారంలో భాగంగా పరిశీలించి తప్పులు లేకుండా తుది ఓటరు జాబితాను తయారు చేయడానికి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు కసరత్తు చేస్తున్నారు.
రాజ్యాంగం కల్పించిన వజ్రాయుధం ఓటు హక్కు. దాన్ని వినియోగించుకోవడంలో యువత వెనుకబడి పోతుందనే అభిప్రాయాలున్నాయి. దీంతో ఎన్నికల సంఘం ఈ దఫా యువత, కళాశాల విద్యార్థులకు కొత్తగా ఓటుహక్కు నమోదు చేయించేందుకు గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. ‘ఐ ఓట్ ఫర్ షూట్’ అంటూ అవగాహన కార్యక్రమాలు పెద్దఎత్తున చేపట్టింది. ఓటరు సవరణలో భాగంగా ఆగస్టు 23, 24వ తేదీల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. మరో అవకాశంలో సెప్టెంబర్ 3, 4వ తేదీల్లో ప్రత్యేక నమోదు చేపట్టింది. దాంతోపాటు ఈ నెల 19 వరకు కొత్త ఓటరు నమోదు, మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించడంతో మండలంలో భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి.
నిర్మల్ జిల్లాలోని నిర్మల్, ఖానాపూర్, ముథోల్ నియోజకవర్గాల్లో కొత్త ఓటరు నమోదు కోసం (ఫారం-6) 30,180 దరఖాస్తులు వచ్చాయి. ఓటు తొలగింపునకు (ఫారం-7)కు 9,243, మార్పులు, చేర్పులకు (ఫారం-8)కు 15,377 మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఎన్నికల సంఘం ఉత్తర్వుల ప్రకారం స్పెషల్ సమ్మరీ రివిజన్ (ఎస్ఎస్ఆర్)-2023 ప్రకారం ఆగస్టు 2న ముసాయిదా జాబితాను విడుదల చేయాలి. కొత్తగా ఓటర్ల నమోదుతోపాటు తప్పులు సరిచేయడం, చనిపోయిన వారి పేర్లను తొలగించడానికి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. వీటన్నింటిని పరిశీలించడానికి సమయం అవసరం కావడంతో షెడ్యూల్ను సవరించారు. మొదట ప్రకటించిన విధంగా కాకుండా మారిన షెడ్యూల్ ప్రకారం ముసాయిదా జాబితాను ఆగస్టు 21న విడుదల చేశారు. ప్రకటించిన జాబితాపై అభ్యంతరాలను స్వీకరించడానికి ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 19 వరకు గడువు విధించారు. వచ్చిన అభ్యంతరాలను సెప్టెంబర్ 28 వరకు పరిశీలించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇంకా అభ్యంతరాలుంటే వాటిని కూడా పరిశీలించి తుది జాబితాకు మెరుగులు దిద్దడానికి అక్టోబర్ 1 వరకు అవకాశమిచ్చారు. అనంతరం సవరించిన ఓటర్ల తుది జాబితాను అక్టోబర్ 4న ప్రకటించనున్నట్లు ఎన్నికల అధికారులు చెబుతున్నారు.
ఇప్పటికే ఓటర్ల జాబితా సవరణకు బీఎల్వోలు ఇంటింటి ప్రచారంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో సవరణ జాబితా తయారీ గుడువు పెంచడంతో వారికి మరికొంత సమయం దొరికింది. దీంతో ఎన్నికల సందర్భంగా ఓటరు జాబితాపై అభ్యంతరాలు తలెత్తకూడదనే ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ సవరణ షెడ్యూల్లో మార్పులు చేసిందని ఎన్నికల విభాగం అధికారులు అభిప్రాయపడుతున్నారు.
కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకునే ప్రక్రియ ఈ నెల 19తో ముగిసింది. సారంగాపూర్ మండలంలో ఫారం-6కు 1,636, ఫారం-7కు 138, ఫారం-8కు 554 చొప్పున దరఖాస్తులు వచ్చాయి. వీటి పరిశీలన కార్యక్రమం ఈ నెల 28 వరకు కొనసాగుతోంది. తదనంతరం ఫైనల్ ఓటర్ లిస్టు అక్టోబర్ 4న ఎన్నికల సంఘం విడుదల చేస్తుంది.