మందమర్రి, అక్టోబర్ 13 : బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ను అమలు చేయాల్సిందేనని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని సింగరేణి పాఠశాల, మార్కెట్ చౌరస్తాలోగల కోల్‌బెల్ట్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. బీసీ రిజర్వేషన్ అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుమారు గంట పాటు ఆందోళన కొనసాగగా, ఇరువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.
సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కొండిళ్ల శ్రీనివాస్, యూత్ పట్టణ అధ్యక్షుడు ముడారపు శేఖర్ మాట్లాడుతూ ఉత్పత్తి ఉత్పాదక కులాలుగా ఉన్న బీసీలను ఎన్నో ఏళ్లుగా అణచివేస్తూ, హక్కులను కాలరాస్తున్న అగ్రవర్ణాల కుట్రలు ఇక సాగవన్నారు. రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల సమయంలో హామీలిస్తూ ఏండ్ల తరబడి బీసీలను మోసం చేస్తూనే ఉన్నారని, అగ్రవర్ణ కుట్రలకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి మద్దతు ఇవ్వాలని వారు కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్యా, ఉద్యోగ, చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించినప్పుడే బీసీ రాజ్యాధికారం సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తడిగొప్పుల రవిరాజా, మద్ది వేణుగోపాల్, మహరాజుల సంపత్, ఎండీ ఖలీం, శంకర్, సత్యనారాయణ, యోగానందరావు, నెల్లి వీరయ్య, రమేశ్, బల్ల శంకర్, సదయ్య, జక్కుల రాజం, అరకటి రవీందర్, శ్రావణ్‌కుమార్, చీర్ల రాజు, ఎండీ వసీం, పున్నం, నవీన్ పాల్గొన్నారు.
జన్నారంలో ధర్నా..
జన్నారం, అక్టోబర్ 13 : జన్నారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ సమీపంలోగల ప్రధాన రోడ్డుపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం కన్వీనర్ కోడూరి చంద్రయ్య ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసే వరకూ పోరాడుతామన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కో కన్వీనర్ కడర్ల నర్సయ్య, మంచిర్యాల జిల్లా కన్వీనర్ ఆడేపు లక్ష్మీనారాయణ, మండల అధ్యక్షుడు అశోక్, మామిడి విజయ్, నందగోపాల్, రవి, రాజయ్య, రామన్న, రాజేశ్, శ్రీనివాస్, గంగాధర్, సాయి, సత్తయ్య పాల్గొన్నారు.