కుంటాల, జనవరి 3 : కుంటాల మండలంలోని పలు గ్రామాల్లో పంటచేల నుంచి పత్తి దొంగిలించిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐ సుమాంజలి మంగళవారం వివరాలు వెల్లడించారు. అంబకంటి గ్రామానికి చెందిన నారాయణ, సాయి, కుభీర్ మండలం మర్లగొండకు చెందిన మానేశ్ ముఠాగా ఏర్పడ్డారు. పంట చేలలో సేకరించిన పత్తి మూటలను రాత్రి దొంగిలించి, ఆటోలో తరలించి భైంసాలో విక్రయిస్తూ జల్సాలు చేస్తున్నారు.
అంధకూర్, కుంటాలతో పాటు ఇతర గ్రామాల్లో బాధిత రైతుల ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. ఈ మేరకు వారిని పట్టుకోగా, నేరాన్ని ఒప్పుకున్నారు. బైంసాలో దొంగిలించిన పత్తిని ఎక్కడెక్కడ విక్రయించారన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. రూ.35,600 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.