ఆదివారం 17 జనవరి 2021
Adilabad - Nov 29, 2020 , 00:39:54

పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి

పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి

  • ఆదిలాబాద్‌ అదనపు కలెక్టర్‌ డేవిడ్‌
  • ప్రత్యేకాధికారులతో సమావేశం

ఎదులాపురం : పల్లె ప్రగతి, మరుగుదొడ్లు, ఉపాధి హామీ పనులను మండల ప్రత్యేకాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదిలాబాద్‌ అదనపు కలెక్టర్‌ ఎం డేవిడ్‌ సూచించారు. స్థానిక టీటీడీసీలో శనివారం మండల ప్రత్యేక అధికారులతో పల్లె ప్రగతి, మరుగుదొడ్లు, ఉపాధి పనులు, పారిశుద్ధ్యం, కొవిడ్‌-19పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయా గ్రా మాల్లో చేపట్టిన పనులను క్షుణ్ణంగా పరిశీలించి, నివేదికలను సమర్పించాలన్నారు. జిల్లాలో ఇంకా మిగిలిన 18 రైతు వేదికల నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. జిల్లాలో 465 సెగ్రిగేషన్‌ షెడ్లను పరిశీలించి, వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 2,243 మంది రైతులకు కల్లాలు మంజూరయ్యాయన్నారు. సుమారు 600కు పైగా పూర్తయ్యాయని తెలిపారు. అలాగే 1,176 పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు ప్రతిపాదించగా, ఇప్పటి వరకు 1165 వనాల గ్రౌండింగ్‌ పూర్తయిందని వెల్లడించారు. వచ్చే ఏడాదికి నర్సరీల్లో కావాల్సిన మొక్కలను పెం చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూ చించారు.

జిల్లాలో స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కింద 69,992 మరుగుదొడ్లు మంజూరవగా, 67,689 పూర్తిచేసినట్లు వెల్లడించారు. ఉపాధి హామీ కింద కూలీలందరికీ పని కల్పించాలన్నారు.  గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించాలని, కొవిడ్‌-19 దృష్ట్యా గ్రామాల్లో తీసుకుంటున్న చర్యలపై పరిశీలించాలని సూచించారు. సమావేశంలో జడ్పీ సీఈవో కిషన్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రాథోడ్‌ రాజేశ్వర్‌, పంచాయతీ రాజ్‌ ఈఈ మహావీర్‌, మండల ప్రత్యేక అధికారి ఉన్నారు.

వివాహ నమోదు చట్టంపై అవగాహన..

స్థానిక టీడీడీసీలో మహిళా శిశు సంక్షేమ, పంచాయతీ శాఖల ఆధ్వర్యంలో వివాహ నమోదు చట్టం 2002పై కార్యదర్శులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ మాట్లాడుతూ.. బాల్య వివాహాలు జరుగకుండా ఆపాలని సూచించారు. 1994లో వివాహ చట్టాన్ని తీసుకువచ్చినట్లు, తదనంతరం 2002లో సవరణలు చేసినట్లు చెప్పారు. భార్యాభర్తలు.. అన్ని వివరాలతో పంచాయతీ కార్యదర్శుల వద్ద వివాహ నమోదు చేసుకోవాలని సూచించారు. గ్రామాల్లో జరిగే వివాహాలను తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. అనంతరం జడ్పీ సీఈవో కిషన్‌, జిల్లా సంక్షేమ శాఖ అధికారి మిల్కా మాట్లాడారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌, ఉద్యానవన అధికారి శ్రీనివాస్‌ రెడ్డి, జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేంద్రప్రసాద్‌, సీడీపీవోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.