సోమవారం 06 ఏప్రిల్ 2020
Adilabad - Mar 20, 2020 , 02:54:25

బల్దియాలో ‘కో-ఆప్షన్‌' సందడి

బల్దియాలో ‘కో-ఆప్షన్‌' సందడి

  • కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నికకు జీవో జారీ చేసిన ప్రభుత్వం
  • మున్సిపాలిటీకి నలుగురు సభ్యులు
  • ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు తప్పని సరి 

మున్సిపాలిటీ పాలకవర్గాల పదవీ బాధ్యతల స్వీకరణ పూర్తయ్యింది. దీంతో బల్దియాలో కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నికకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. నూతన మున్సిపాలిటీ చట్టం ప్రకారం చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక అనంతరం కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒక్కో బల్దియా పరిధిలో నలుగురు కో-ఆప్షన్‌ సభ్యులు ఉంటారు. వీరిలో ఇద్దరు పురుషులు కాగా ఇద్దరు మహిళలు. వీరి ఎన్నిక కోసం త్వరలోనే బల్దియా అధికారులు నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. ఆశావహులు అప్పుడే పార్టీల్లోని నాయకులను ప్రసన్నం చేసే పనిలో పడ్డారు.

ఆదిలాబాద్‌ రూరల్‌ : మున్సిపాలిటీల్లో కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నికకు ప్రభుత్వం బుధవారం జీవో విడుదల చేసింది. దీంతో జిల్లాలో మున్సిపల్‌ కో-ఆప్షన్‌ పదవి ఆశిస్తున్న అభ్యర్థులు తమకున్న బలాలతో పార్టీ పెద్దల ఇండ్లచుట్టూ తిరుగుతున్నారు. పదవులను దక్కించుకునేందుకు అది నాయకులను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మున్సిపల్‌ అధికారులు కూడా ప్రభుత్వం జీవో జారీ చేయడంతో త్వరలోనే నోటిఫికేషన్‌ జారీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.  

మున్సిపాలిటీ నలుగురు సభ్యులు..

కొత్త మున్సిపల్‌ చట్టం ప్రకారం ప్రతి మున్సిపాలిటీలోనూ నలుగురు కో-ఆప్షన్‌ సభ్యులను ఎన్నుకోవాలనే నిబంధన ఉంది. దీని ప్రకారం మున్సిపాలిటీలో నలుగురు కో-ఆప్షన్‌ మెంబర్లను ఎన్నుకునే అవకాశం ఉంది. నలుగురిలో ఇద్దరు మహిళలు తప్పని సరి. దీంతో ఈసారి మహిళలకు రెండు కో-ఆప్షన్‌ పదవులు దక్కడం ఖాయంగా కనిపిస్తుంది. 

కో-ఆప్షన్‌ సభ్యుడికి ఉండాల్సిన అర్హతలు ఇవే.. 

కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నికకు కొత్త మున్సిపల్‌ చట్టంలో పలు నిబంధనలు విధించారు. కో-ఆప్షన్‌ సభ్యునిగా ఎన్నుకొనే వారు తప్పని సరిగా పట్టణంలోని ఏదో ఒక వార్డులో మెంబరై ఉండాలి. 

స్థానిక రెవెన్యూ పరిధిలో సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, వార్డు మెంబర్‌లుగా, మున్సిపల్‌లో చైర్మన్‌, వైస్‌చైర్మన్‌, కౌన్సిలర్‌గా ఐదేండ్లు పదవి బాధ్యతలు నిర్వర్తించి ఉండాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థల్లో పనిచేసి రిటైర్డ్‌ గెజిటెడ్‌ అధికారి, మున్సిపల్‌ పరిపాలనలో ప్రత్యేక పరిజ్ఞానం ఉన్నవారితో పాటు మున్సిపాలిటీకి లీగల్‌ అడ్వయిజర్‌గా మూడేండ్లు పనిచేసినవారు కో-ఆప్షన్‌ సభ్యుడిగా పోటీ చేసేందుకు అర్హులు. మైనార్టీ వర్గంలో ముస్లిములు, క్రిస్టియన్లు, బౌద్ధులు, పార్శీలకు చెందిన వారై ఉండి, పట్టణంలో ఓటు హక్కు ఉండడంతో పాటు 21 సంవత్సరాల వయస్సు పూర్తి చేసుకున్నవారు కో-ఆప్షన్‌ సభ్యునిగా ఎన్నుకునేందుకు అర్హులు. 

నోటిఫికేషన్‌ వచ్చిన ఏడు రోజుల్లో పూర్తి.. 

కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నికకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్‌ను జారీ చేయడానికి మున్సిపాలిటీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందు కోసం నోటిఫికేషన్‌ జారీ చేసిన ఏడు రోజుల్లోపు నామినేషన్లు స్వీకరణ ప్రారంభమవుతుంది. నామినేషన్లను పరిశీలన పూర్తయ్యాక, కౌన్సిల్‌ సమావేశం నిర్వహించి మౌఖిక అభిప్రాయాలతో కో-ఆప్షన్‌ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ ఎన్నికల ప్రక్రియకు త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు సమాచారం. కొత్త పాలకవర్గాలు జనవరి 27న ఎన్నికకాగా, మార్చి 28వ తేదీలోపు ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. 


logo