నిర్మల్, మార్చి 3(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం అయోమయం, గందరగోళంగా తయారైంది. ఇప్పటి వరకు ఎకరం, రెండెకరాలు, మూడెకరాల చొప్పున నిధులు జమ చేశామని ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్నప్పటికీ, ఆచరణలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైతు భరోసా డబ్బులను ఎకరాల వారీగా జమ చేశారా? లేక సర్వే నంబర్లవారీగా రైతుల ఖాతాల్లో వేశారా? అనే విషయం తెలియక గందరగోళం నెలకున్నది. కొన్ని చోట్ల ఒక ఎకరం భూమి ఉన్న రైతుకు ఆ భూమిలో సగానికి కూడా రైతుభరోసా జమ కాలేదు. మరికొందరికి రెండెకరాల భూమి ఉంటే ఒక ఎకరానికే డబ్బులు జమ అయ్యాయి. మూడెకరాల లోపు ఉన్నప్పటికీ చాలా మందికి ఎకరం, అర ఎకరానికి మాత్రమే డబ్బులు వచ్చాయి. మరి కొందరికి అసలే రాలేదు. దీంతో రైతుభరోసా కాస్త కోతల భరోసాగా మారిందని రైతులు మండిపడుతున్నారు. ఇప్పటికే చాలామందికి రుణమాఫీ కాలేదు. బోనస్ కూడా అందలేదు. యాసంగి పంటలు వేసి దాదాపు రెండు నెలలు అవుతుండడంతో పెట్టుబడికి చేసిన అప్పులకు వడ్డీలు కట్టాల్సి వస్తున్నదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం రైతుభరోసా సాయాన్ని అందిస్తే చేసిన అప్పులు కట్టేస్తామని ఎదురుచూస్తున్న రైతులకు నిరాశే ఎదురవుతున్నది. జనవరి 27న ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించి మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి అక్కడి రైతులకు మాత్రమే రైతుభరోసాను అందించింది. మిగతా వారికి ఈనెల 31వరకు సాగు చేస్తున్న ప్రతి ఎకరాకు రైతుభరోసా అందజేస్తామని చెబుతున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం లేకుండాపోయింది. పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాల రైతులకు ఎన్ని ఎకరాలు ఉన్నా రైతుభరోసా సాయం అందింది. తమకు మాత్రం రెండెకరాలు న్నా పెట్టుబడి సాయం ఎందు కు రావడం లేదంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. గత కేసీఆర్ ప్ర భుత్వంలో ప్రతి రైతుకు ఠంఛనుగా సాయం అందిందని రైతు లు గుర్తు చేసుకుంటున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు మూడు విడుతల్లో మూడెకరాల లోపు ఉన్న రైతులందరికీ రైతుభరోసా నిధులను జమ చేశామని చెబుతున్నప్పటికీ, ఇంకా చాలామంది రైతులకు డబ్బులు జమకాలేదు. రెండు, మూడు ఎకరాల భూములున్న రైతులు రైతుభరోసా డబ్బులు జమ అయ్యాయేమోనని బ్యాంకులకు వెళ్లి తమ ఖాతాలను చూస్తే డబ్బులు ఇంకా రాలేదని అధికారులు చెబుతుండడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. నిర్మల్ జిల్లాలో 2,01,326 మంది రైతులు రైతుభరోసా పథకానికి అర్హులుగా ఉన్నారు. వీరికి యాసంగి సీజన్‌కు రూ. 277.04 కోట్ల డబ్బులను ఖాతాల్లో జమ చేయాల్సి ఉన్నది. అయితే ఇప్పటి వరకు మూడెకరాల లోపు ఉన్న 1,10,038 మంది రైతులకు రూ.96.39 కోట్లు జమ చేశారు. ఇంకా జిల్లాలోని 91,288 మంది రైతులకు రైతుభరోసా కింద రూ.180.65 కోట్లు జమ కావాల్సి ఉన్నది. రెండు నెలలుగా మూడెకరాల రైతులకే ముప్పుతిప్పలు పెడుతున్న ప్రభుత్వం.. పదెకరాల వరకు ఉన్న వారికి పెట్టుబడి సాయం అందాలంటే ఇంకా ఎన్ని నెలలు పడుతుందోనని రైతులు ఆవేదన చెందుతున్నారు.
ఉన్న రెండెకరాల పొలంలో వరి ఏసిన. ఇప్పటి దాక దుక్కులు, దమ్ము, నాట్లకు, మందులకు రూ.20 వేల దాక పెట్టుబడి ఖర్చులు అయినయ్. రైతుభరోసా పైసలు రాంగనే ఇస్త అని చెప్పి తెలిసిన కాడ బాకీ తెచ్చిన. రెండు నెలల సంది ఎదురుచూస్తున్న. రూపాయి రాలే. రైతుభరోసా పైసల కోసం రోజు బ్యాంకుల పొంటి తిరుగుడైతున్నది. నాకు 70 వేల లోన్ ఉంటే, రుణమాఫీ కూడా కాలేదు. ఎవుసం చేయాలంటేనే కండ్లకు నీళ్లు అస్తున్నయ్. కొందరికీ రుణమాఫీ చేసిన్రు, మూడెకరాలు ఉన్నోళ్లకు రైతుభరోసా పైసలు కూడా పడ్డయట. నాకు రెండెకరాలే ఉన్నది. మరి మేమేం పాపం చేసినం. మేము కూడా రైతులమే కదా. మాకెందుకు సాయం చేస్తలేరు. కేసీఆర్ సారు ఉన్నప్పుడు గిట్ల లేకుండే. అందరిని సమానంగా చూసిండు. అస్తే అందరికీ ఒకేసారి అస్తుండే. పి.లక్ష్మి, మహిళా రైతు, తర్లపాడు, ఖానాపూర్ మండలం.