సెగ్రిగేషన్ షెడ్లలో తయారీ
పంచాయతీ కార్యదర్శుల ప్రత్యేక చొరవ
నార్నూర్ మండలంలో ముమ్మరంగా వర్మి కంపోస్టు తయారీ
నార్నూర్, జూలై 18: మండలంలోని 23 గ్రామ పంచాయతీల్లో గల సెగ్రిగేషన్ షెడ్లలో వర్మి కంపోస్ట్ ఎరువు తయారీ ప్రక్రియ వేగవంతంగా సాగుతుండగా ఇందుకు సంబంధించిన పనులు ఊపందుకున్నాయి. ఆయా పంచాయతీల్లోని ఒక్కో సెగ్రిగేషన్ షెడ్డుకు కంపోస్ట్ ఎరువు తయారీకి ఇటీవల కీలకమైన వానపాముల బ్యాగులు ఐదు చొప్పున ఇవ్వడంతో పంచాయతీ కార్యదర్శులు ఎరువు తయారీ పనులకు శ్రీకారం చుట్టారు. ఎంపీవో స్వప్నశీల ప్రత్యక్ష పర్యవేక్షణలో పంచాయతీ కార్యదర్శులు వర్మి కంపోస్ట్ ఎరువు తయారీ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో వర్మి కంపోస్ట్ ఎరువు తయారు చేసుకొని గ్రామానికి అదనపు ఆదాయాన్ని సమకూర్చుకునేలా చూడాలని అధికారుల ఆదేశాలతో ఇప్పుడు గ్రామాలన్నీ వర్మి కంపోస్ట్ తయారీలో ప్రత్యేక చొరవ చూపుతున్నారు. వర్మికంపోస్ట్ ఎరువు తయారీలో ప్రధానంగా ఆయా గ్రామాల స్థానికులకు ఇచ్చిన రెండు బుట్టల్లో తడి, పొడి చెత్తను వేర్వేరు చేసి తీసుకుంటున్నారు. సేకరించిన తడి, పొడి చెత్తను వేరు చేయడం ఇంటి నుంచే ప్రారంభం కావాలని చైతన్యం చేస్తూ వర్మి కంపోస్ట్ తయారీ మరింత సులభతరం చేసేలా చర్యలు చేపడుతున్నారు. కార్యదర్శులు, జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో వర్మి కంపోస్ట్ ఎరువు తయారీ వేగవంతంగా ముందుకు సాగుతున్నది. మండలంలోని గ్రామాల్లో దీని తయారీ నిరంతరాయంగా జరుగుతుండడంతో భవిష్యత్తులో ఇక పారిశుధ్య నిర్వహణ మరింత మెరుగుపడనుంది.
నిరంతరం పర్యవేక్షిస్తున్నాం..
గ్రామాల్లో వర్మి కంపోస్ట్ ఎరువు తయారీ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. కంపోస్ట్ ఎరువు తయారు చేసే విధానంపై మండలస్థాయిలో శిక్షణ ఇస్తున్నాం. పంచాయతీ కార్యదర్శులు వర్మి కంపోస్ట్ ఎరువు తయారీలో ప్రత్యేక శ్రద్ధ చూపుతుండడంతో రానున్న రోజుల్లో గ్రామాల్లో పారిశుధ్య సమస్యలు తీరనున్నాయి. -స్వప్నశీల, ఎంపీవో, నార్నూర్