రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర సర్కారు అనేక పథకాలు అమలు చేస్తుండగా, సాగు సంబురంగా సాగుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించి.. 24 గంటల పాటు ఉచితంగా కరెంట్ సరఫరా చేస్తుండగా, యేటేటా పంటల విస్తీర్ణం పెరుగుతున్నది. రైతుబంధు ద్వారా రెండు పంటలకూ పెట్టుబడి సాయమందిస్తుండగా, అప్పుల కోసం తిరిగే బాధ తప్పింది. ఏదైనా కారణంతో ఇంటిపెద్ద మరణిస్తే రైతు బీమా ద్వారా రూ.5 లక్షలచ్చి భరోసానిస్తున్నది. సమైక్య పాలనలో బీడు భూములను చూసి కన్నీరు పెట్టిన కర్షకలోకం, స్వరాష్ట్రంలో పచ్చని పైరులను చూసి మురిసిపోతున్నది. పంట వేసింది మొదలు.. అమ్మే వరకూ అండగా నిలుస్తుండగా, రైతాంగం ప్రభుత్వానికి దీవెనలు అందిస్తున్నది. కాగా, తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు రైతు దినోత్సవాన్ని పండుగలా నిర్వహించేందుకు అన్నదాతలు సిద్ధమవుతున్నారు.
-మంచిర్యాల, జూన్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మంచిర్యాల, జూన్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ రాక ముందు ఎవుసం చేసేందుకు రైతులు అరిగోస పడేవారు. నీళ్లుంటే.. కరెంట్.. కరెంట్ ఉంటే.. నీళ్లుండేటివి కావు. ఎప్పుడో అర్ధరాత్రి కరెంట్ ఇచ్చేవారు. ఆ సమయంలో పొలాలకు నీళ్లు పెట్టేందుకు వెళ్లి కరెంట్ షాక్‌తోనో.. లేక పామో.. తేలో కరిచో ప్రాణాలు ఇడిసిన రైతులు అనేక మంది ఉన్నారు. వర్షాలు మంచిగ పడి నీళ్లున్న ఏడాది పంట పెట్టుబడికి కష్టమయ్యేది. అప్పోసప్పో చేసి సాగు చేస్తే పంట చేతికి వచ్చాక అప్పు ఇచ్చిన సేటుకో, వడ్డీ వ్యాపారికో అమ్మక తప్పేది కాదు. తీసుకున్న అప్పు, వడ్డీ కలిపితే దమ్మిడి కూడా మిగిలేదు కాదు. కానీ స్వరాష్ట్రంలో కేసీఆర్ సీఎం అయ్యాక గడిచిన తొమ్మిదేళ్లలో ఎవుసంను పండుగ చేసిండు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో బీడుపడిన భూములను సాగులోకి తెచ్చిండు. రైతుబంధు ఇచ్చి పంట పెట్టుబడి సాయంగా ఎకరాకు రూ.10వేల ఇస్తున్నడు. రైతు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు కేంద్రాలు పెట్టి కొంటున్నడు. అన్నింటికీ మించి వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నడు. అందుకే తెలంగాణ పదో ఆవిర్భవ వేడుకలను జూన్ 3న రైతు దినోత్సవం పేరుతో పండుగలా నిర్వహించకునేందుకు సిద్ధమవతున్నారు. అన్ని రైతు వేదికల్లో ఆ గ్రామాల పరిధిలోని రైతుల సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలు, పథకాల విశిష్టతను తెలిపేలా ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేయనున్నారు. వ్యవసాయ శాఖ రూపొందించిన కరపత్రాలను ఆవిష్కరిస్తారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు రైతులందరితో కలిసి సహపంక్తి భోజనాలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో గడిచిన తొమ్మిదేళ్లలో వ్యవసాయ రంగంలో అద్భుతమైన ప్రగతి సాధించి, పదో వసంతంలోకి అడుగుపెడుతున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులపై ‘నమస్తే తెలంగాణ అందిస్తున్న ప్రత్యేక కథనం..
ఐదేండ్లుగా 6,17,878 మందికి రైతుబంధు
రైతు బంధుపథకాన్ని ప్రవేశపెట్టిన 2018 వానాకాలం నుంచి మొన్నటి యాసంగి వరకు 6,17,878 మంది రైతులకు రూ.7607.17 కోట్లు పెట్టుబడి సాయంగా రాష్ట్ర ప్రభుత్వం అందించింది. ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించడం మొదలుపెట్టాక రైతులు చాలా మంది వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు. రైతుబంధు తొలివిడుత కేవలం 4.69 లక్షల మంది రైతులకు మాత్రమే వచ్చింది. పదో విడుతలో 6.17 లక్షల మంది సాయం అందుకున్నారు.
రైతు బీమాతో భరోసా
ప్రమాదవశాత్తు మరణించే రైతుల కుటుంబాలు రోడ్డున పడకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన మరో అద్భుతమైన పథకం రైతుబీమా. మరణించిన రైతు కుటుంబానికి రూ.5 లక్షల సాయం అందుతుంది. డెత్ సర్టిఫికెట్ ఇచ్చిన వెంటనే ఎవరితో సంబంధం లేకుండా డబ్బులు ఖాతాలో పడిపోతాయి. ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న రైతు మరణంతో రోడ్డున పడే స్థితిలో ఉన్న ఎన్నో కుటుంబాలకు రైతుబీమా ఆసరాగా నిలుస్తున్నది.
రైతుబీమా పొందిన వారి వివరాలు
మంచిర్యాల 1508 ఆదిలాబాద్ 442 నిర్మల్ 2700 ఆసిఫాబాద్ 547
ఉచిత విద్యుత్..
గత ప్రభుత్వాలు వ్యసాయానికి కరెంట్ ఇవ్వాలనే ఆలోచనే చేయలేదు. రోజులో ఆరు గంటలు ఇచ్చే కరెంట్ ఎప్పుడు వచ్చేదో, ఎప్పుడు పోయేదో తెలిసేది కాదు. తెలంగాణ రైతులకు ఆ కష్టాలు ఉండొద్దని సీఎం కేసీఆర్ వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యత్ ఇస్తున్నారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా రైతులకు మేలు చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 1,51,132 వ్యవసాయ కనెక్షన్లు ఉచితంగా విద్యుత్ సరఫరా జరుగుతుంది.
జిల్లాల వారీగా వ్యవసాయ కనెక్షన్లు
మంచిర్యాల 45,292 ఆదిలాబాద్ 30,000 నిర్మల్ 69,666 ఆసిఫాబాద్ 6174
సంక్షేమ పథకాలతో పెరిగిన సాగు విస్తీర్ణం..
రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం తీసుకువచ్చిన విప్లవాత్మక పథకాలతో సాగు విస్తీర్ణం కూడా పెరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ నాలుగు జిల్లాలో కలిసి రైతుబంధు రాకముందు 2018లో 13,68,054 లక్షల ఎకరాలు సాగులో ఉండగా, ప్రస్తుతం 18,47,622 ఎకరాలు సాగులోకి వచ్చాయి. ఈ లెక్కన సుమారు ఐదు లక్షల ఎకరాల సాగు పెరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
జిల్లా 2018 ముందు ప్రస్తుతం
మంచిర్యాల 1,37,887 4,25,334 ఆదిలాబాద్ 5,12,167 5,66,792 నిర్మల్ 3,75,000 4,40,000 ఆసిఫాబాద్ 3,43,000 4,15,496
6 ఎకరాల్లో రెండు బోర్లు వేసిన..
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : నాకు ఆరు ఎకరాల భూమి ఉన్నది. మూడె కరాలకు ఒకటి చొప్పున రెండు బోర్లు వేయించాను. ప్రభుత్వం ఉచిత విద్యుత్ వసతి కల్పించింది. యేటా రెండుసార్లు వరి పంటనే పండిస్తున్నాను. గతంలో ఉచిత విద్యుత్ లేకుండే. అప్పుడు ఎక్కువగా వర్షాకాలం పంటలను మాత్రమే పండించేవాళ్లం. సరిగా వర్షాలు కురవక పోతే పంటలు చేతికి వస్తాయో రావోననే భయం ఉండేది. ఆ తర్వాత బోరు వేశాను. అప్పుడు ఎప్పుడు కరెంట్ ఉంటుందో, పోతుందో తెలియక ఇబ్బందులు పడేవాళ్లం. ఒక్క బోరు ఉన్న కూడా పంట చేతికి వస్తుందనే నమ్మకం ఉండేది కాదు. కానీ సీఎం కేసీఆర్ 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అందించగా రెండు బోర్లు వేశాను. ఇప్పుడు ఎ లాంటి భయం లేకుండా రెండు పంటలు పండిస్తున్నాను. సీ ఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటా.
– ఎల్కర్ ప్రశాంత్ రైతు, దహెగాం
ఎవుసం బాగా సౌలత్ అయ్యింది ..
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : నాకు 3.5 ఎకరాల భూమి ఉన్నది. యాసంగి రైతుబంధు రూ.17500 వచ్చాయి. మునుపు ఎవుసానికి ముందే శావుకార్ల దగ్గరికి పోయి వడ్డీకి పైసలు తెచ్చి ఎవుసం చేయాల్సి వచ్చేది. పండిన పంటలో ఎక్కువ పైసలు వారికే పోయేవి. మిగిలేది ఏమీ ఉండక పోయేది. కానీ గిప్పుడు షావుకార్ల వద్దకు పోకుండా పండించిన పంట ఫలితం మొత్తం రైతుకే దక్కేటట్టు కేసీఆర్ సారు చేసిండు. గిట్ల రైతులను సంతోష పెడుతున్న గా సారు చల్లగా ఉండాలి.
-గుర్నులే పోశయ్య, రైతు కుశ్నపల్లి, బెజ్జూర్
రైతుబీమాతో చెల్లి పెళ్లిచేసిన..
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 2 (నమస్తే తెలం గాణ) : మా నాన్న ఆత్రం ముక్త పేరిట 8 ఎకరాల భూమి ఉంది. గతేడాది మా నాన్న చనిపోయాడు. తర్వాత 10 రోజుల్లోనే ప్రభుత్వం నుంచి రైతు బీమా డబ్బులు రూ. 5 లక్షలు వచ్చాయి. వ్యవసాయం కోసం మా నాన్న చేసిన అప్పు దాదాపు రూ. 30 వేల వరకు ఉండే. వాటిని తీర్చేయడంతో పాటు మా చెల్లి పెళ్లి చేసినం. మిగిలిన డబ్బులను ముగ్గురం అన్నదమ్ములం పంచుకున్నాం. ఒకవేళ ప్రభుత్వం బీమా పథకాన్ని ప్రవేశపెట్టి ఉండకపోతే మేము ఇంకా అప్పుల్లోనే ఉండేవాళ్లం. మా చెల్లెలు పెళ్లి చేయడం కూడా కష్టంగా మారేది. రైతుబీమా పథకం మా కుటుంబాన్ని ఆదుకున్నది.
– ఆత్రం అన్నీగ, కొలాం ఝరి, కెరమెరి మండలం
రైతబీమాతో ఆదుకున్నాడు..
తాండూర్, జూన్ 2 :మాకు 2.5 ఎకరాల భూమి ఉన్నది. నాకు ఇద్దరు పిల్లలు. నా భర్త, నేను వరి, పత్తి పంట పండిస్తూ కు టుంబాన్ని పోషించుకునేవాళ్లం. అయితే నా భర్త రమేశ్ 2018 అక్టోబర్ 2న అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో పెద్ద దిక్కు కోల్పోయిన మమ్మ ల్ని సీఎం కేసీఆర్ సారు రైతుబీమా పథకంతో ఆదుకున్నాడు. దరఖాస్తు చేసిన 9 రోజుల్లోనే రైతు బీమా డబ్బులు నా ఖాతాలో జమయ్యాయి. ఆ డబ్బులు కొండంత అండగా నిలిచాయి. వచ్చిన వాటిలో కొంత కర్మ కాండ ఖర్చులు పోనూ, మిగిలిన డబ్బులు పిల్లల చదువు , పిల్లల పేరు మీద బ్యాంకులో డిపాజిట్ చేసిన. సీఎం కేసీఆర్ సారుకు రుణపడి ఉంటాం.
మాసాడి ప్రవళిక, బోయపల్లి, (తాండూర్)
01