ఆదిలాబాద్, మే 16(నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఆదిలాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో మున్సిపాలిటీ పరిధిలోని 13 వార్డుల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభు త్వం దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నద ని, ఈ అంశంపై నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రచారానికి వచ్చే ప్రతిపక్షాలను ఎక్కడికక్కడ నిలదీయాలని కోరారు. కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణ ప్రజలకు చేసిందేమీ లేదని, తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారన్నారు. ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్లు, ఆరోగ్యలక్ష్మి, ఆరోగ్య మహిళలాంటి పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని తెలిపారు.
దళితబంధు తరహాలో గిరిజన బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధులాంటి పథకాలను ప్రభుత్వం అమలు చేయబోతున్నదని చెప్పుకొచ్చారు. మహిళల జన్‌ధన్ ఖాతాల్లో రూ.15 లక్షలు జమచేస్తామని చెప్పి ఓట్లు దండుకున్న ప్రధాని మోదీ.. ఇప్పటి వరకు నయాపైసా కూడా వేసింది లేదని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం రూ.400 ఉన్న వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ.1200కు పెంచిందని, నిత్యావసర సరుకుల ధరలు మూడింతలు అయ్యాయని, 2కోట్ల ఉద్యోగా లు హామీగానే మిగిలిపోయిందని, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల వల్ల ప్రజలు ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపారు. దేశ జనాభాలో 52శాతం ఉన్న బీసీలను సైతం కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తున్నదని, బడ్జెట్లో కేవలం రూ. 2వేల కోట్లు కేటాయిస్తే, తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్లో బీసీల సంక్షేమానికి రూ. 6వేల కోట్లు కేటాయించినట్లు గుర్తు చేశారు. మోదీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను అదానీ, అంబానీ కంపెనీలకు కట్టబెడుతూ, ఉద్యోగాలను కొల్లగొడుతుందన్నారు.ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టి ఓట్లు దండుకునే బీజేపీ నాయకుల ప్రయత్నాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
తొమ్మిదేళ్లలో ఆదిలాబాద్ నియోజకవర్గం గణనీయమైన అభివృద్ధి సాధించిందని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు నియోజకవర్గ అభివృద్ధి కనపడడం లేదా అని ప్రశ్నించారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ప్రతిపక్షాల పాలనలో రూ.1800 కోట్ల అభివృద్ధి పనులు జరిగితే, బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో రూ.4500 కోట్ల పనులు చేపట్టినట్లు తెలిపారు. ఎన్నికల సమీపిస్తుండడంతో నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, ఎమ్మెల్యే జోగు రామన్న ఐదోసారి భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలు, నాయకులు, ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అలాల అజయ్, కార్యదర్శి ఆశ్రప్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారి సతీశ్, కౌన్సిలర్ ప్రకాశ్, నాయకులు ప్రహ్లాద్, సాజిదొద్దీన్, రమేశ్, జహుర్, శైలేందర్, లక్ష్మణ్, ముష్షు, బుట్టి శివకుమార్, సాయికిరణ్, ప్రశాంత్, స్వరూపా రాణి, శ్రీనివాస్, రాజు పాల్గొన్నారు.