కుమ్రం భీం ఆసిఫాబాద్,(నమస్తే తెలంగాణ)/కాగజ్‌నగర్, మే 17 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ డివిజన్లోని పెంచికల్పేట్ అడవుల్లోగల ఎల్లూరు అటవీ ప్రాంతంలో ఏడేళ్ల వయసున్న ఆడపులిని వేటగాళ్లు విద్యుత్ షాక్ పెట్టి హతమార్చి ఆపై చర్మం, గోర్లు, వెంట్రుకలు తీసుకెళ్లినట్లు తెలుస్తున్నది. అటవీమార్గం గుండా ఉన్న విద్యుత్లేన్లకు 40 మీటర్ల దూరం వరకు విద్యుత్ తీగలను అమర్చి పులిని హతమార్చినట్లు తెలుస్తున్నది. ఘటనా స్థలాన్ని శనివారం కవ్వాల్ వైల్డ్‌లైఫ్ డైరెక్టర్ శాంతారాం, ఆసిఫాబాద్ జిల్లా అటవీ అధికారి నీరజ్‌కుమార్ పరిశీలించారు. కళేబరం నుంచి షాంపిళ్లు సేకరించారు. ఆపై ఖననం చేయించారు. అనంతరం కాగజ్‌నగర్‌లో కవ్వాల్ వైల్డ్‌లైఫ్ డైరెక్టర్ శాంతారాం, ఆసిఫాబాద్ జిల్లా అటవీ అధికారి నీరజ్‌కుమార్ వెలువరించిన వివరాల ప్రకారం.. పెంచికల్పేట్ అటవీ ప్రాంతంలో సంచరించే పులి ఆచూకీ ఈ నెల 13వ తేదీ నుంచి తెలియకుండా పోయింది.
14, 15 తేదీల్లో కూడా పులి ఆచూకీ లభించలేదు. దీంతో అటవీ అధికారుల బృందం 15న రాత్రి వరకూ దాని కోసం వెతికారు. 16న ఉదయం ఎల్లూరు అటవీ ప్రాంతంలో వెతుకుతున్న అటవీ అధికారులకు నల్లగుట్ట అటవీ ప్రాంతంలో పులి కళేబరం కనిపించింది. దానిని పరిశీలించగా చర్మం, గోర్లు, వెంట్రుకలు (పులిమీసాలు) కనిపించలేదు. పులిని చంపిన వేటగాళ్లు పులిచర్మాన్ని, గోర్లు, వెంట్రుకలను తీసుకెళ్లినట్లు అటవీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన అటవీ ప్రాంతంలో కాకుండా రెవెన్యూ పరిధిలో జరిగినట్లు వారు వెల్లడించారు. చనిపోయిన పులి కళేబరం నుంచి సేకరించిన షాంపిళ్లను పరిశీలించాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. క్రైం కంట్రోల్ నుంచి నిపుణులు వచ్చి పరిశీలించిన తర్వాత స్పష్టత వస్తుందని చెప్పారు.
పులిని హతమార్చిన ఘటనలో అనుమానితులుగా భావిస్తున్న కొంత మందిని అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఘటన జరిగిన చుట్టుపక్క గ్రామాల వారిని, కొంత మంది పశువుల కాపరులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఎల్లూరు, మేడిగూడ, కొత్తగూడ, అగర్‌గూడ, కొమ్ముగూడ గ్రామాలకు చెందిన సుమారు 20 నుంచి 30 మందిని అదుపులోకి తీసుకుట్లున్న ఆయా గ్రామాల ప్రజలు తెలిపారు.
కాగజ్‌నగర్ అడవుల్లో పులల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్నది. పులుల సంరక్షణ కోసం గత ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల జిల్లా అడవుల్లో పెరుగుతూ వచ్చిన పులుల సంఖ్య.. ప్రస్తుతం తగ్గిపోతోంది. జిల్లాలో 2015లో కదంబా అడవుల్లో మొదటిసారి గుర్తించారు. దాని ద్వారా వాటి సంతతి ఎమినిది పులుల వరకు పెరిగింది. తడోబా, తిప్పేశ్వరం నుంచి పులుల రాకపోకలు పెరిగాయి. క్రమంగా వాటి సంతతి పెరగడంతో జిల్లాలో పులుల సంఖ్య 20కి చేరింది. కొన్ని పులులు మహారాష్ట్ర అభయారణ్యాల్లోనికి రాకపోకలు సాగిస్తుండగా, జిల్లాలో పది వరకు పులులు స్థిర నివాసం ఏర్పర్చుకున్నాయి. సుమారు పదేళ్లుగా పులులకు సురక్షిత ప్రాంతంగా మారిన జిల్లా అడవుల్లో ప్రస్తుతం పులుల మనుగడకు ప్రశ్నార్థకంగా మారింది.
2024 జనవరిలో కాగజ్‌నగర్‌లోని దరిగాం అడవుల్లో దుండగులు రెండు పులులుపై విషయప్రయోగం చేసి హతమార్చారు. తాజాగా.. పెంచికల్పేట్ మండలం ఎల్లూరు అటవీ ప్రాంతమైన నల్లగుట్ట ప్రాంతంలో మరో పులిని చంపడం కలకలం రేపుతున్నది. సుమారు ఏడాదిన్నర వ్యవధిలో మూడుపులులు వేటగాళ్ల చేతిలో హతమయ్యాయి. గతేడాది జనవరిలో కాగజ్‌నగర్ అడవుల్లో వరుసగా రెండుపులుల చనిపోవడం అటవీ శాఖ వైఫల్యాలను తెలియజేస్తోంది.