హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దేశంలో గ్యాస్ కొరత తీవ్రమైన నేపథ్యంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్‌కు ముందుచూపు కరువయ్యిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు రాష్ట్రం ప్రత్యామ్నాయాల దిశగా ఆలోచించడంలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్యాస్ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు మన పక్క రాష్ట్రం తమిళనాడు విద్యుత్తు సబ్సిడీని ప్రకటించింది. యూనిట్‌కు రూ.2 చొప్పున రాయితీనిస్తున్నట్టు ప్రకటించింది. రెస్టారెంట్లు, హోటళ్లు, టీ షాప్‌లకు ఈ విద్యుత్తు రాయితీ వర్తిస్తుందని తమిళనాడు తెలిపింది. ఇదే తరహాలో మన దగ్గర సైతం గ్యాస్ సబ్సిడీ ఇవ్వాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. గ్యాస్ సరఫరా చేయలేక చేతులెత్తేసిన సర్కార్.. కనీసం విద్యుత్తు సబ్సిడీ ఇచ్చి అయినా ఈ సంక్షోభం నుంచి బయటపడేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లతోపాటు కమర్షియల్ వినియోగదారులు ఎలక్ట్రిక్ స్టౌలను ఆశ్రయిస్తున్నారు. సాధారణ ప్రజలు సైతం ప్రత్యామ్నాయం వైపు మొగ్గు చూపుతున్నారు. ఇండక్షన్ స్టౌలను వాడుతున్నారు. గతంలో నెలకు 1.8 లక్షల ఇండక్షన్ స్టౌలు అమ్ముడవుతుండగా, శనివారం ఒక్కరోజే ఆమెజాన్లో 1.34 లక్షలకు పైగా స్టౌలు అమ్ముడయ్యాయి. టీజీ ఎస్పీడీసీఎల్ అధికారులు గ్రేటర్లో కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లల్లో తనిఖీలు నిర్వహించగా, ఎలక్ట్రిక్ స్టౌలను వినియోగిస్తున్నట్టు గుర్తించారు.
రాష్ట్రంలో విద్యుత్తు వినియోగం, పీక్ డిమాండ్ టెన్షన్ పెడుతున్నది. వ్యవసాయ పంపుసెట్ల వాడకం, ఎండల తీవ్రతతో విద్యుత్తు వినియోగం అమాంతం పెరిగింది. గ్యాస్ కొరతతో ఎలక్ట్రిక్ స్టౌల వినియోగం తీవ్రమవుతున్నది. ఇప్పుడున్న లోడ్‌కు ఇది అధికం. గ్యాస్ కొరత కారణంగా ఎలక్ట్రిక్ హీటర్లు, ఎలక్ట్రిక్ స్టౌలు, ఎలక్ట్రిక్ కుక్కర్లు, కెటిల్స్ వంటి వాటి వాడకం పెరుగుతున్నది. సాధారణంగా ప్రతి ఏడాది ఈ సమయంలో విద్యుత్తు లోడ్ క్రమంగా పెరుగుతుంది. దీనికి ఇప్పుడు వంటింట్లో విద్యుత్తు పరికరాల వాడకం తోడవడంతో ఈ లోడ్ మరింత పెరుగుతున్నది. శుక్రవారం రాష్ట్రంలో ఒక్కరోజే రికార్డు స్థాయిలో 344 మిలియన్ యూనిట్లకు విద్యుత్తు వినియోగం చేరుకున్నది. గురువారం 341, బుధవారం 336, మంగళవారం 338 మిలియన్ యూనిట్ల చొప్పున విద్యుత్తు వినియోగమయ్యింది.