ఆదిలాబాద్, ఏప్రిల్ 7(నమస్తే తెలంగాణ) ః ఆదిలాబాద్ కలెక్టర్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ రాజర్షి షా దరఖాస్తులను స్వీకరించారు. భూములు, పింఛ న్లు, విద్య, వైద్యం, మున్సిపాలిటీ, విద్యుత్, ఇతర శాఖల్లోని సమస్యలపై 111 దరఖాస్తులు వచ్చాయి. వివిధ శాఖల అధికారుల వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.
ప్రజల సమస్యలను పరిష్కరించాలి
నిర్మల్ చైన్‌గేట్, ఏప్రిల్ 7 : ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. నిర్మల్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. శాఖలవారీగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, సీఎం ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ఎంపీడీవో కార్యాలయాల్లో ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరించాలన్నారు. టెలిఫోన్ ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, ఆర్డీవో రత్నకల్యాణి పాల్గొన్నారు.
బతికున్నా.. చనిపోయినట్టు చూపుతున్నారు..
నా భర్త మల్లేశ్‌కు 2022లో వృద్ధాప్య పింఛన్ రెండు నెలలు మాత్రమే వచ్చింది. ఆ తర్వాత రాలేదు. పింఛన్ ఎందుకు వస్తలేదని ఎంపీడీవోను అడిగితే ఆన్లైన్లో తప్పుగా నమోదు కావడంతో వస్తలేదని అన్నారు. ఆన్లైన్లో డెత్ అని వస్తుందని సిబ్బంది చెబుతున్నారు. సిబ్బంది తప్పిదంతో పొరపాటు వల్ల నా భర్తకు పింఛన్ నిలిచింది. పింఛన్ ఇప్పించాలని ఖానాపూర్ ఎమ్మెల్యేతోపాటు కలెక్టర్, ఎంపీడీవోను కలిసినా ఫలితం లేదు. మరోసారి కలెక్టర్‌ను కలిసి మా సమస్య చెప్పుకుందామని ప్రజావాణికి వచ్చి దరఖాస్తు ఇచ్చా. బతికి ఉన్న మనిషిని చనిపోయినట్లు చూపించి పింఛన్ ఇవ్వకపోవడం అన్యాయం. ఇప్పటికైనా అధికారులు స్పందించి మా సమస్యను పరిష్కరించాలి.
– సత్తవ్వ, ఉట్నూర్