సాధారణంగా మార్చి, ఏప్రిల్ మాసాల్లోనే విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం అవుతాయి. ఈ మాసాలు అంటేనే విద్యార్థుల్లో ఒక రకమైన భయం మొదలవుతుంది. డిప్రెషన్ అలుముకుంటుంది. బాగా చదవాలి, బాగా పరీక్షలు రాయాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి అనే ఆలోచనలు నిద్రలేకుండా చేస్తాయి. మరికొందరు మానసిక ఒత్తిడికి గురవు తారు. ఈ సమయమే కీలకం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థుల్లో మనోనిబ్బరం నింపాలి. ఉత్కంఠ, ఉద్వేగా లకు గురికాకుండా చూసుకోవాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సులువుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు మంచి మార్కులు కూడా తెచ్చుకోవచ్చని విద్యావేత్తలు సూచిస్తున్నారు.
– ఇచ్చోడ, ఫిబ్రవరి 24
మార్చి 21వ తేదీ నుంచి టెన్త్ వార్షిక పరీక్షలు ప్రారంభంకానున్నాయి. అంటే ఇంకా 25 రోజుల సమయం మాత్రమే ఉంది. ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో బాలికలు 4,993.. బాలురు 5,058.. మొత్తం 10,051.. నిర్మల్ జిల్లాలో బాలికలు 4,685.. బాలురు 4,442.. మొత్తం 9,127 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఏడు పేపర్ల పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఆరోగ్యపరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పరీక్షకు ఎలా సన్నద్ధం కావాలి.. ఉన్నటు వంటి సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలనే అంశాలపై సబ్జెక్టు, విద్యారంగ నిపుణుల అభిప్రాయాలతో ‘నమస్తే’ తెలంగాణ ప్రత్యేక కథనం.
సహజంగా పరీక్షలు అనగానే విద్యార్థుల్లో భయం ఉంటుంది. తెలుగు పరీక్ష మొదటి రోజే ఉంటుంది. కొత్త వాతావరణం కాబట్టి కొంత ఉత్కంఠతగా ఉంటుంది. తెలుగు పేపర్లో మంచి మార్కులు సాధించేందుకు.. ముందుగా పద్యభాగం, గద్యభాగంలోని అన్ని అంశాలను గుర్తుంచుకోవాలి. వాటిని పునఃశ్చరణ చేసుకోవాలి. పాఠాన్ని చదవడంతో సరి పెట్టకుండా సారాంశాన్ని, ఉద్దేశాన్ని తెలుసుకోవాలి. ప్యాసేజ్ పేరిట ఉండే అపరిచిత గద్యం ఎంతో ముఖ్యం. ఈ విషయంలో సొంతంగా ఆలోచిస్తూ చదవాలి. ఉపవాచకానికి సంబంధించి ఇతివృత్తం, ప్రాముఖ్యత, పాత్రలు, వాటి ప్రాధాన్యత, వ్యక్తుల ప్రవర్తన శైలి వంటి అంశాల ద్వారా ఇచ్చే సందేశాన్ని తెలుసుకోవాలి. వ్యాకరణంలో మంచిగా ప్రతిభ చూపాలంటే సంధులు, సమాసాలు, సంయుక్తార్థాలు, ఉత్పత్యర్థాలు, జాతీయాలను బాగా చదవాలి.
– సెర్పూర్ సత్యనారాయణ, తెలుగు విషయ నిపుణులు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సిరికొండ.
విద్యార్థులు క్లిష్టంగా భావించే సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్. సిలబస్ అంశాలను అధ్యయనం చేస్తూ.. ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈ సబ్జెక్ట్‌పై పట్టు సాధించొచ్చు. సంఖ్యా వ్యవస్థ, బీజగణితం, నిరూపక రేఖాగ ణితం, రేఖాగణితం, క్షేత్రమితి, త్రికోణమితి, సంభావ్యత, సాంఖ్యకశాస్త్రంపై సంపూర్ణ అవగాహన పెంచుకోవాలి. ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంతోపాటు కారణాల నిరూపణ, వ్యక్తీకరణ, ఒక సమస్యను ఇతర అంశాలతో అనుసంధానం చేయడం వంటి నైపుణ్యాలు పొందాలి.
ముఖ్యమైన నిర్వచనాలు, సూత్రాలను నోట్స్ రూపంలో రాసుకుంటే.. రివిజన్ సమయంలో ఉపయుక్తంగా ఉంటుంది. పాఠ్యపుస్తకంలో ప్రతి చాప్టర్ చివరన ఇచ్చే సమస్యలను తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి. గ్రాఫ్‌లు, నిర్మాణాత్మక సమస్యలకు సమాధానాలు కొనుగోనేందుకు ప్రాక్టీస్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. వాస్తవ సంఖ్యలు, సమితులు, బహుపదులు, రెండు చరరాశులలోని రేఖీయ సమీకరణాల జత ఆధ్యయాల్లోని గ్రాఫ్ ఆధారిత సమస్యలు, సంభావ్యత, సాంఖ్యక శాస్త్రం, త్రికోణమితి, క్షేత్రమితిలోని ముఖ్యమైన సమస్యలను సాధన చేయాలి.
– జాదవ్ పుండలిక్, గణితశాస్త్రం నిపుణులు, ఆశ్రమ ఆదర్శ పాఠశాల, రాయిగూడ.
సైన్స్ సబ్జెక్ట్‌లో పార్ట్-ఏ ఫిజికల్ సైన్స్ ఉంటుంది. ఇందులో అప్లికేషన్ అప్రోచ్‌తో చదవడం ముఖ్యం. ఆయా చాప్టర్ల అంశాలను నిజ జీవిత ఘటనలతో అన్వయించుకుంటూ ప్రిపరేషన్ సాగిస్తే.. విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. విషయ అవగాహనతోపాటు, ప్రశ్నించడం, పరికల్పన చేయడం, ప్రయోగాలు-క్షేత్ర పర్యటనలు, సమాచార నైపుణ్యాలు-ప్రాజెక్ట్ పనుల పటాలు, వాటి ద్వారా భావ ప్రసావం వంటి వాటిని కృషి చేయాలి.
కాంతి పరావర్తనం, కాంతి వక్రీభవనం, విద్యుత్ ప్రవాహం, రసాయన బంధం, పరమాణు నిర్మాణం, కార్బన్ సమ్మేళనాలపై పట్టు సాధించాలి. మూలకాల ధర్మాలు-వర్గీకరణ, రసాయన సమీకరణాలను బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇలా చేయడం వల్ల లఘు, అతి స్వల్ప, బహుశైచ్చిక ప్రశ్నలకు సులువుగా సమాధానాలిచ్చే పట్టు లభిస్తుంది. ప్రశ్నను ఎలా అడిగినా సమాధానం ఇచ్చే సంసిద్ధత లభించి.. మంచి మార్కులు సొంతమవుతాయి.
– ఆత్రం చంద్రకాంత్, భౌతికశాస్త్ర నిపుణులు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సిరికొండ.
సైన్స్ పేపర్ పార్ట్-బీ జీవశాస్త్రంలో రాణించేందుకు అవగాహన, స్వీయ విశ్లేషణ నైపుణ్యాలను పెంచుకోవాలి. పుస్తకాల్లోని ఆయా అంశాలకు సంబంధించి ఫ్లో చార్ట్‌లు, బ్లాక్ డయాగ్రమ్స్‌లను సొంతంగా రూపొందించుకోవాలి. విశ్లేషణాత్మక, తులనాత్మక అధ్యయనానికి ప్రాధాన్యం ఇవ్వాలి. నేర్చుకున్న అంశాలను వాస్తవ పరిస్థితులతో అన్వయించే విధంగా చదవాలి. ప్రయోగాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ప్రయోగ నిర్వహణ ప్రక్రియపై అవగాహన పొందడం మేలు చేస్తుంది. ఆయా అంశాలకు సంబంధించి చాప్టర్లో పేర్కొన్న అభ్యాసాలకు సంబంధించి విశ్లేషణ, కారణాలు, పోలికలు, బేధాలు తెలుసుకుంటూ చదవాలి. డయాగ్రమ్స్ విషయంలో భాగాలను గుర్తించడమే కాకుండా.. వాటి ప్రాముఖ్యతను వర్ణించగలిగే విధంగా ప్రాక్టీస్ చేయాలి. విద్యార్థులు చదవుతోపాటు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
– హిమబిందు, జీవశాస్త్రం నిపుణులు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఇచ్చోడ
సమకాలిన అంశాలపై అవగాహన పెంచుకోవాలి. పాఠ్య పుస్తకంలోని ఏదైనా ఒక అంశాన్ని చదువుతున్నప్పుడు దానికి సంబంధించి మన నిజజీవితంలో జరుగుతున్న ఘటనలతో పోల్చుకుంటూ చదవాలి. సమకాలీన అంశాల విషయంలో ప్రతిస్పందన, ప్రశ్నించడం, ప్రశంస, అభినందనలపై సాధన చేయడం అవసరం. అవగాహనకు సంబంధించి ఒక నిర్దిష్ట అంశాన్ని చదివి.. సొంత పరిజ్ఞానంతో రాసే నైపుణ్యం పెంచుకోవాలి.
జాగ్రఫీ, ఎకనామిక్స్‌లో భారతదేశం-భౌగోళిక స్వరూపం, శీతోష్టస్థితి, భారతదేశ నీటి వనరులు, వలసలు, ఆహార భద్రత, ఉత్పత్తి-ఆదాయం, సుస్థిరాభివృద్ధి పాఠ్యాంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. హిస్టరీలో రెండు ప్రపంచ యుద్ధ కాలాల సమయంలో ప్రపంచం, సమకాలిన సామాజిక ఉద్యమాలపై దృష్టి పెట్టాలి. భారత జాతీయోద్యమ చరిత్రను ప్రత్యేక దృష్టితో చదవాలి. సివిక్స్‌కు సంబంధించి రాజ్యాంగం మూల సూత్రాలు, రాజ్యాంగంలో పేర్కొన్న అంశాలను ఏఏ దేశాల రాజ్యాంగం నుంచి అనుసరించారు వంటి కోణాల్లో చదవాలి.
– కిషన్ సింగ్, సాంఘికశాస్త్రం నిపుణులు, ఆశ్రమ ఉన్నత పాఠశాల, మోడిగూడ.
రెండో పేపర్ హిందీ ఉంటుం ది. మొదటి ప్రశ్నపత్రము చదవడానికి 15 నిమిషాల సమయం ఇస్తారు. కాబట్టి ప్రశ్నలను నిధానంగా చదివి, బాగా రాయగలిగే ప్రశ్నలకు జవాబులను ముందుగా రాయాలి. పాఠ్య పుస్తకాన్ని, రాసుకున్న నోట్స్‌ను అర్థం చేసుకుని చదవాలి. చదివిన అంశాలను తిరిగి మననం చేసుకోవాలి. పరీక్షల చివరి సమయంలో కొత్త విషయాలు, వేరే ఇతర మెటీరియల్‌ను చదవకుండా ముందు నుంచి చదివిన వాటినే చదవాలి.
పాఠం పేరు, కవి, రచయిత పేరు, ఆ పాఠంలోని ముఖ్యాంశాలను తెలియజేసే పట్టికలను పద్య భాగం, గద్య భాగం, ఉపవాచకాలను వేర్వేరుగా తయారు చేసుకోవాలి. ప్రతి పాఠంలోని భాషా కిబాత్, శబ్ద బండార్ అంశాలను ఒకేచోట అంశాలవారీగా రాసుకుని చదవడం వల్ల వాటిపైన పట్టు వస్తుంది. అందంగా, గుండ్రటి అక్షరాలతో పాటు కొట్టి వేతలు లేకుండా పద్యాలను విడగొట్టకుండా విద్యార్థులు రాయాలి. వ్యాకరణంపై మంచి అవగాహన కలిగి ఉండాలి. బహుళైచ్చిక ప్రశ్నలలో పూర్తిస్థాయి మార్కులు సాధించవచ్చు. ఈ సూచనలు పాటిస్తే పదికి పది సాధించవచ్చు.
– జాదవ్ సంతోష్, హిందీ విషయ నిపుణులు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సిరికొండ.
తెలుగు మీడియం విద్యార్థులకు కొంచెం ఆంగ్లం అంటే భయం ఉండడం సహజం. కానీ.. ప్రణాళిక ప్రకారం చదివితే పదికి పది సాధించవచ్చు. మొదట అక్షర దోషాలపై దృష్టిసారిం చాలి. మంచి మార్కులు సాధించాలంటే వెర్బల్, నాన్ వెర్బల్ అంశాలను బాగా చదవాలి. ఉదాహరణకు.. లేబుల్స్, బార్ డయాగ్రమ్స్‌పై చార్ట్స్ అంశాలను అధ్యయనం చేయాలి. సొంతంగా విశ్లేషించే లా నైపుణ్యం పెంచుకోవాలి. ఇందుకోసం పాత ప్రశ్నపత్రాల సమాధానాలను పరిశీలించడం మేలు. ప్రతి పాఠం చివరలో ఉండే కాంప్రహెన్సివ్ ప్రశ్నలపై దృష్టి పెట్టాలి.
ప్రతి పాఠం సా రాంశాన్ని గ్రహించి సొంతంగా రాసుకునే అలవాటు చేసుకోవాలి. పద్యంలో ముఖ్య పదాలు, యాంటానిమ్స్, సినానిమ్స్‌పై దృష్టి సారించాలి. వీటితోపాటు పార్ట్స్ ఆఫ్ స్పీచ్, డైరెక్ట్, ఇన్ డైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఫ్రేజిల్ వెర్బ్స్ ఈ విషయంలో చదవడంతో పాటు ప్రాక్టీస్ కూడా చేస్తే మెరుగైన మార్కులు పొందేందుకు ఆస్కారం లభిస్తుంది. అదేవిధంగా అపరిచిత గద్యం సారాంశాన్ని గ్రహించేలా చదవాలి. లెటర్ రైటింగ్‌కు సంబంధించి పంక్చుయేషన్స్, బాడీ ఆఫ్ ది లెటర్ వంటి అంశాలపై పట్టు అవసరం.
– శ్రీనివాస్, ఇంగ్లిష్ విషయ నిపుణులు, ఆశ్రమ ఉన్నత పాఠశాల, ఉమ్రి(బి)