మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెపుతున్నా మాటలు నీటి మూటలవుతున్నాయి. కేవలం పట్టణాల వైపు మాత్రమే ఆర్టీసీ బస్సులను నడిపిస్తూ పల్లెలను విస్మరిస్తుండడంపై ఆ గ్రామాలు మహాలక్ష్మీ పథకానికి నోచుకోవడం లేదు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఎనిమిది నెలల నుంచి ఆ గ్రామాలకు ఆర్టీసీ సేవలు నిలిచిపోవడంతో అక్కాచెల్లెళ్లు, అమ్మలకు ప్రైవేట్ వాహనాలే పెద్ద దిక్కుగా మారుతున్నాయి. కోటపల్లి మండలంలోని పారుపల్లి నుంచి వెంచపల్లి మార్గంలో ఆర్టీసీ సేవలు ఎనిమిది నెలలుగా నిలిచిపోయాయి. ఈ మార్గంలో ఉన్న పది గ్రామాల ప్రజలు ప్రైవేట్ వాహనాల్లో రెట్టింపు చార్జీలు చెల్లిస్తూ ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణం చేస్తున్నారు.
కోటపల్లి, నవంబర్ 3 : కోటపల్లి మండలంలోని పారుపల్లి నుంచి వెంచపల్లి గ్రామం వరకు బీటి రోడ్డు ఉంది. ఈ మార్గంలో లింగన్నపేట, ఎదుల్లబందం, సిర్సా, పుల్లగామ, రొయ్యలపల్లి, ఆలుగామ, జనగామ, సూపాక, నందరాంపల్లి గ్రామాలు ఉన్నాయి. గతంలో ఈ మార్గంలో ఆర్టీసీ సేవలు కొనసాగగా, రోడ్డు మరమ్మతుల కారణంగా బస్సు సేవలను పూర్తిగా నిలిపివేశారు. పారుపల్లి గ్రామం సమీపంలోని కల్వర్టు నిర్మాణంతోపాటు ఈ మార్గంలో వర్షాలకు దెబ్బతిన్న రోడ్డు బాగు అయినప్పటికీ ఆర్టీసీ సేవల పునరుద్ధరణ జరగకపోవడంతో పది గ్రామాల ఆడపడుచులకు ప్రైవేట్ వాహనాలే దిక్కుగా మారుతున్నాయి. ఈ మార్గంలో ఉన్న పది గ్రామాల ప్రజలకు ఆర్టీసీ సేవలు లేక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తెలియని పరిస్థితి.
సూపాక నుంచి చెన్నూర్‌కు రూ.100 చార్జీ
కోటపల్లి మండలంలోని పారుపల్లి నుంచి వెంచపల్లి మార్గంలో బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రైవేట్ వాహనాల యజమానులది ఇష్టారాజ్యంగా మారింది. సూపాక, వెంచపల్లి, జనగామ గ్రామాల నుంచి చెన్నూర్‌కు వెళ్లాలంటే ఒక్కరికి రూ.80 నుంచి రూ.100 వరకు వసూలు చేస్తున్నారు. ప్రయాణికులకు గత్యంతరం లేక తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్ వాహనాల యజమానులు అడిగిన చార్జీ ఇస్తూ రాకపోకలు సాగిస్తున్నారు. ఎనిమిది నెలలుగా ఈ మార్గంలో ప్రయాణికులు ఉచిత ఆర్టీసీ బస్సుకు నోచుకోక తమ గ్రామాలకు రానుపోను కలిపి ఒక్క రోజుకు రూ.200 వరకు ఖర్చు చేసుకుంటున్నా స్థానిక ఎమ్మెల్యే, సంబంధిత అధికారులు పట్టించుకోవడం విమర్శలకు తావిస్తున్నది.
విద్యుత్ తీగలు సరిచేస్తే సేవలు పునరుద్ధరణ
కోటపల్లి మండలంలోని పారుపల్లి సమీపంలో ఒర్రెపై ఇటీవల కల్వర్టును నిర్మించారు. కల్వర్టు నిర్మాణంతో రోడ్డు ఎత్తు పెరగగా, విద్యుత్ తీగలు కిందకు రాగా, ఈ మార్గంలో ఆర్టీసీ బస్సు నడిచినట్లయితే విద్యుత్ తీగలు బస్సును తాకే అవకాశం ఉంది. కానీ.. విద్యుత్ లైన్ ఎత్తు పెంచే విషయంలో అర్అండ్బీ, విద్యుత్ అధికారులు తమకేమీ సంబంధం లేనట్లు వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తున్నది. విద్యుత్ లైన్ ఎత్తు పెంచేందుకు తాము విద్యుత్ సంస్థకు డబ్బులు చెల్లించామని ఆర్అండ్బీ అధికారులు చెపుతుండగా, విద్యుత్ లైన్ ఎత్తు పెంచేందుకు ఆ డబ్బులు సరిపోయేలా లేవని విద్యుత్ అధికారులు చెపుతున్నారు. రెండు శాఖల సమన్వయ లోపం ఈ మార్గంలో ఉన్న ఎనిమిది గ్రామాల ప్రజలకు శాపంగా మారుతున్నది.
ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యం
కోటపల్లి మండలంలోని జనగామ రూట్లో ఆర్టీసీ సేవలు నిలిచిపోయిన విషయాన్ని స్థానిక నాయకులు, ప్రజలు చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రోడ్డు బాగున్నా, చిన్న కారణాలతో బస్సును నడిపించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, ఈ విషయాన్ని స్థానిక నాయకుల ద్వారా ఎమ్మెల్యేకు చెప్పినా ఫలితం లేకుండా పోతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. సమస్య చిన్నదైనప్పటికి పరిష్కారానికి నోచుకోకపోవడంతో ఆర్టీసీ బస్సు లేక ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు చెపుతున్నారు. పారుపల్లి, సిర్సా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పై తరగతులు చదువుతున్న విదార్థులు బస్సు సౌకర్యం లేక కాలినడకన పాఠశాలలకు వెళ్తున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు చెపుతున్నారు. ఎమ్మెల్యే స్పందించి తమ గ్రామాలకు ఆర్టీసీ బస్సు నడిచేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
విద్యుత్ లైన్ సరి చేసేందుకు చర్యలు తీసుకుంటాం..
పారుపల్లి గ్రామం సమీపంలోని కల్వర్టు వద్ద విద్యుత్ లైన్ ఎత్తు పెంచేందుకు చర్యలు తీసుకుంటు న్నాం. విద్యుత్ లైన్ ఎత్తు పెంచేం దుకు అవసరమైన డబ్బులను విద్యుత్ శాఖకు చెల్లించగా, వారు ఆ డబ్బులు సరిపోవని చెపుతుండడం వల్ల విద్యుత్ లైన్ అలానే ఉంది. ఈ విషయమై మళ్లి విద్యుత్ అధికారులతో మాట్లాడి లైన్ ఎత్తు పెంచేందుకు చర్యలు తీసుకుంటాం.
– భరత్, ఆర్అండ్బీ జేఈ.
ఎనిమిది నెలల నుంచి బస్సే లేదు..
ఎనిమిది నెలల నుంచి మా ఊరికి బస్సు జాడే లేదు. బస్సులు లేక మా ఊరోళ్ళంతా ఆటోలు, జీబులలో చెన్నూర్‌కు వెళ్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ ప్రయాణం అని టీవీలలో చూసుడే తప్ప నేను ఒక్కరోజు కూడా బస్సుల పోలేదు. మా ఊరికి బస్సును నడిపితే మాతోపాటు మా చుట్టు పక్కల ఊరోళ్లు కూడా ఉచిత బస్సులో ప్రయాణం చేస్తాం.
– జాడి లచ్చక్క, జనగామ.
ఎమ్మెల్యే పట్టించుకోవాలి..
జనగామ రూట్లో బస్సు సౌకర్యం పునరుద్ధరణ కోసం ఎమ్మెల్యే పట్టించుకోవాలి. బస్సులు లేక ప్రైవేట్ వాహనాల్లో మహిళలు రోజుకు రూ.100 నుంచి రూ.200 వరకు ఖర్చు చేసుకోవాల్సి వస్తోంది. రోడ్డు మార్గం బాగున్నా బస్సు నడపకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికైనా ఎమ్మెల్యే దృష్టి పెట్టి మా మార్గంలో బస్సులను నడిపించి మాకు కూడా మహాలక్ష్మీ పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలి.
– రావుల రాజేశ్వరి, రొయ్యలపల్లి.
రోడ్డు బాగు చేయిస్తే బస్సును నడుపుతాం..
కోటపల్లి మండంలోని పారుపల్లి మార్గం రూట్ సరిగా లేక ఆర్టీసీ బస్సును నడపడం లేదు. చిన్న వర్షాలకు బస్సులు దిగబడడంతోపాటు పారుపల్లి గ్రామ సమీపంలోని కల్వర్టు దగ్గర విద్యుత్ తీగలు తక్కువ ఎత్తులో ఉండడం వల్ల ఆర్టీసీ బస్సు ఈ మార్గంలో నడపడం లేదు. పారుపల్లి నుంచి జనగామ రూట్లో ఉన్న విద్యుత్ లైన్ సరిచేయడంతోపాటు రోడ్డు మరమ్మతు చేయించినట్లయితే ఆర్టీసీ సేవలను పునరుద్ధరణ చేస్తాం.
– జనార్దన్, ఆర్టీసీ డీఎం, మంచిర్యాల.