రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రత పేరిట చేపట్టిన నూతన హెల్త్ స్కీమ్ వివాదాస్పదంగా మారింది. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాటికి ఉద్యోగులందరికీ కొత్త హెల్త్ కార్డులు మంజూరు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించింది. ఆ గడువు ముగిసి 20 రోజులు అవుతున్నా విధివిధానాలు ఖరారు చేయలేదు. కనీసం ఏ దవాఖానలు నెట్వర్క్గా ఉంటాయో కూడా క్లారిటీ ఇవ్వలేదు. కానీ.. ఉద్యోగుల బేసిక్ పే నుంచి 1.50 శాతం ప్రీమియం డబ్బులు కట్ చేసి చేతులు దులుపుకున్నది.
నిర్మల్, జూన్ 19(నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లాలో 6,972 మంది ఉద్యోగులతోపాటు 4,792 మంది పెన్షనర్లు ఉన్నారు. ఇప్పటివరకు కార్డులు రాకపోవడంతో అత్యవసర వైద్యం అవసరమైతే ఎక్కడికి వెళ్లాలంటూ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రశ్నిస్తున్నారు. కాగా.. ప్రైవేట్ దవాఖానల్లో చేరితే ఆ బిల్లులు ప్రభుత్వం చెల్లిస్తుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంకా.. ఒక కుటుంబానికి వైద్య చికిత్సల కోసం ఏడాదికి ఎంత మొత్తాన్ని పరిమితిగా విధించారనే విషయాన్ని ప్రకటించ లేదు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఏయే కార్పొరేట్, ప్రైవేట్ దవాఖానల్లో ఒప్పందం కుదిరింది. అత్యవసరమైతే ఏ దవాఖానకు వెళ్లాలనే కనీస సమాచారం కూడా ప్రభుత్వ ఉద్యోగులకు అందుబాటులో లేదు.
అందరికీ ఒకే కోత
కుటుంబ సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా అందరికీ ఒకే రకమైన ప్రీమియం వసూలు చేయడంపై ఉద్యోగ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఒక ఉద్యోగి కుటుంబంలో భార్యాభర్తలతోపాటు ఇద్దరు పిల్లలు(నలుగురు) ఉంటారు. మరో కుటుంబంలో వీరితోపాటు వృద్ధులైన తల్లిదండ్రులు(ఆరుగురు) ఉంటారు. కొన్ని పెద్ద కుటుంబాల్లో పది మంది వరకు సభ్యులు ఉంటారు. అయితే కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నా, వారందరికీ ఒకే రకమైన ప్రీమియం పద్ధతిని వర్తింపజేస్తూ బేసిక్ పేలో శాతం ఆధారంగా కట్ చేయడం ఎంత వరకు సమంజసమంటూ ప్రశ్నిస్తున్నారు. ఒకే ఇంట్లో భార్య, భర్త ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైతే.. వారిద్దరి వేతనాల నుంచి విడివిడిగా 1.50 శాతం చొప్పున డబుల్ ప్రీమియం కట్ చేశారు. కొన్ని కుటుంబాల్లో భార్యాభర్తలతోపాటు తల్లిదండ్రులు కూడా రిటైర్డ్ పెన్షనర్లుగా ఉన్నారు. అలాంటి ఇళ్లల్లో అందరి జీతాలు, పెన్షన్ల నుంచి హెల్త్ కార్డుల పేరిట ప్రభుత్వం డబ్బులు లాగేసుకున్నది. లబ్ధి పొందేది ఒకే కుటుంబం అయినప్పుడు.. ఆ కుటుంబంలోని ఉద్యోగులందరి వద్ద విడివిడిగా ప్రీమియం వసూలు చేయడం ప్రభుత్వ ధన దాహానికి నిదర్శనమని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఉద్యోగులు, పెన్షనర్ల అనుమానాలు నివృత్తి చేసి, వెంటనే హెల్త్ కార్డులు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
అనుమతి లేకుండానే..
సగానికి పైగా ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి. అలాంటి వారికి ప్రభుత్వ హెల్త్ కార్డు అవసరమా? లేదా? అని ఉద్యోగుల నుంచి ఆప్షన్ తీసుకోకుండా, కనీసం ముందస్తు అనుమతి కూడా లేకుండా నేరుగా ట్రెజరీ ద్వారా జీతాల్లో కోత విధించడం చట్టవిరుద్ధమని పలువురు వాపోతున్నారు. కనీస విధివిధానాలు ఖరారు చేయకుండానే ఇష్టానుసారంగా నిధులు మళ్లించుకోవడం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతున్నది. ప్రభుత్వం స్పందించి విధివిధానాలు విడుదల చేయాలని, నెట్వర్క్ ఆసుపత్రుల జాబితాను ప్రకటించాలని, ఒకే ఇంట్లో ఇద్దరు ఉద్యోగులు ఉంటే ఒకరికే ప్రీమియం మినహాయింపు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేని పక్షంలో జీతాల కోతకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగుతామని హెచ్చరిస్తున్నారు.
వేతనాల్లో కోత విధించడం అన్యాయం
హెల్త్ కార్డులపై స్పష్టమైన విధివిధానాలు ప్రకటించకుండానే ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ, పెన్షనర్ల వేతనాల్లో కోత విధించడం అన్యాయం. జీతం డబ్బులను కట్ చేసి 20 రోజులవుతున్నా నేటికీ హెల్త్ కార్డులు జారీ చేయలేదు. భార్యాభర్తలు ఉద్యోగులుగా ఉంటే వారిద్దరి జీతాల నుంచి డబ్బులు తీసుకున్నారు. ఇది ఎంతవరకు సమంజసం. ఉద్యోగులకు సమ్మతి తెలిపే అవకాశం కూడా ఇవ్వరా? ఉద్యోగుల్లో చాలామందికి ఇప్పటికే ప్రైవేటులో హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. ప్రభుత్వ నిర్ణయంతో వారందరికీ తీవ్ర నష్టం జరుగుతున్నది. హామీ ఇచ్చి కోత విధించడం కాదు, ముందు కార్డు ఇచ్చి తర్వాత ప్రీమియం డబ్బులు తీసుకోవాలి.
– దర్శనం దేవేందర్, టీఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు, నిర్మల్