ఆదిలాబాద్/నిర్మల్, మే 21(నమస్తే తెలంగాణ) : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందస్తుగా హెచ్చరించింది. అయినా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అల్పపీడనం కారణంగా బుధవారం తెల్లవారు జాము నుంచి జిల్లావ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం కొంత తెరిపిచ్చిన వర్షం మళ్లీ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి వరకు ఏకధాటిగా కురిసింది. ముఖ్యంగా ఖానాపూర్, కడెం, లక్ష్మణచాంద, నిర్మల్, సోన్, సారంగాపూర్, కుంటాల, దిలావర్పూర్ మండలాల్లో భారీ వర్షం కురిసింది.
దీంతో కొనుగోలు కేంద్రాలతోపాటు కల్లాల్లో ఆరబోసిన వడ్లు తడిసిపోయాయి. నిర్మల్ మండలంలోని తాంశ, కౌట్ల (కే), ముజ్గి తదితర గ్రామాల్లో రోడ్ల పక్కన ఆరబోసిన వడ్లు పూర్తిగా తడిసిపోయి నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి. ఈసారి జిల్లాలో ఎక్కువగా ఐకేపీ మహిళా సంఘాలకు సెంటర్లను కేటాయించడం వల్లనే కొనుగోళ్లలో జాప్యం జరుగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేంద్రాల నిర్వహణలో అనుభవం లేకపోవడం, అవసరమైన మేరకు కూలీలను తెప్పించడంలో విఫలం కావడం వల్లనే కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదన్న వాదనలు ఉన్నాయి.
కొన్ని చోట్ల రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకునేందుకు 15 నుంచి 20 రోజులుగా ఎదురు చూస్తున్నారంటే పరిస్థితి తీవ్రంగా ఉన్నదో అర్థమవుతున్నది. కొనుగోళ్లలో జరుగుతున్న ఆలస్యానికి తోడు అకాల వర్షాలు కురుస్తుండడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రాల్లో కోతలు, కొర్రీలతోపాటు సరైన వసతులు లేక, సమయానికి కాంటాలు పెట్టకపోవడంతో తాము నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కూలీల సంఖ్యను పెంచి వేగంగా ధాన్యం కొనుగోళ్లను చేపట్టాలని, అలాగే తడిసిన ధాన్యాన్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో బుధవారం కురిసిన వర్షానికి మార్కెట్ యార్డుల్లో రైతులు అమ్మకానికి తీసుకొచ్చిన జొన్నలు తడిసిపోయాయి. మార్కెట్ యార్డులో జొన్నల కొనుగోళ్లలో జాప్యం ఫలితంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు మంగళవారంతోపాటు బుధవారం ఉదయం రైతులు పంటను విక్రయించడానికి తీసుకొచ్చారు. దీంతో మార్కెట్ యార్డుల్లోని షెడ్లు జొన్నలతో నిండిపోగా.. కొందరు రైతులు షెడ్ల కింద ఖాళీ ప్రదేశాల్లో పంట ఉత్పత్తులను నిల్వ చేశారు. మధ్యాహ్నం కురిసిన వర్షానికి పంట కొంత తడిసింది. రైతులు కవర్లు కప్పి జొన్నలను తడవకుండా కాపాడుకున్నారు. వర్షం తగ్గిన వెంటనే పంటను కొనుగోలు చేయాలని రైతులు కొనుగోలు కేంద్రాల సిబ్బంది చుట్టూ తిరుగుతున్నారు. మార్కెట్ యార్డుకు వాహనాల్లో తీసుకొచ్చిన జొన్నలు వర్షంతో అన్లోడ్ చేయలేదు. వర్షం కారణంగా పంటలో తేమ శాతం పెరుగుతుందని, దీంతో సిబ్బంది పంటను తీసుకునేందుకు సుముఖత చూపడం లేదని రైతులు అంటున్నారు. పంట కొనుగోళ్లలో జాప్యం కారణంగా తాము నష్టపోవాల్సి వస్తుందని రైతులు తెలిపారు.