తాంసి, అక్టోబర్ 25 : ప్రస్తుతం యాసంగి పంటలు ప్రారంభించే సమయమని, సాగుకు నీటిని వదిలితే చెరువులు ఖాళీ అవుతాయని, ఈ సమయంలో చేప పిల్లలను పంపిణీ చేయడం మత్స్యకారులను కాంగ్రెస్ ప్రభుత్వం నిండా ముంచడమేనని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. శుక్రవారం తాంసి మండలంలోని వడ్డాడి మత్తడి వాగులో 2.50 లక్షల చేప పిల్లలను నాయకులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సకాలంలో చేప పిల్లలు విడుదల చేసి మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి కృషి చేసిందన్నారు. బీఆర్ఎస్ పాలనలో 5 లక్షల చేప పిల్లలు పంపిణీ చేస్తే కాంగ్రెస్ సర్కార్ సగానికి సగం తగ్గించిందని గుర్తు చేశారు. ఎన్నడూ ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి రాలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి సాంబశివరావ్, బీఆర్ఎస్ మాజీ మండల కన్వీనర్ కృష్ణ రత్న ప్రకాశ్, నాయకులు వినోద్ రెడ్డి, మొట్టె కిరణ్ కుమార్, మహేందర్, కిషన్, రజినీకాంత్ రెడ్డి, రఘు, రమణ, అబ్దుల్లా, చంద్రన్న పాల్గొన్నారు.
తేమ పేరిట పత్తి ధర తగ్గించొద్దు
గుడిహత్నూర్, అక్టోబర్ 25 : పత్తిలో తేమ శాతం పేరిట ధర తగ్గించవద్దని, రైతులకు మద్దతు ధర వచ్చేలా చూడాలని అధికారులకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సూచించారు. గుడిహత్నూర్ మండలంలోని డోంగర్గావ్ గ్రామ సమీపంలో రాణి జిన్నింగ్ మిల్లులో శుక్రవారం పత్తి కొనుగోళ్లను ప్రారంభించారు. అక్కడక్కడ వర్షాలు కురుస్తుండడంతో తేమ శాతం ఎక్కువగా ఉండవచ్చని ఎమ్మెల్యే తెలిపారు. రైతులకు ఆమోదయోగ్యమైన ధర చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జీ తిరుమల్గౌడ్, జాదవ్ రమేశ్, ముండె సంజీవ్, తదితరులు పాల్గొన్నారు.