“ఎవరి నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేనే కింగ్ మేకర్. నా నియోజకవర్గంలో నేనే రాజు.. నేనే మంత్రి.. నా అనుమతి లేకుండా తట్టెడు మట్టి కూడా తీయలేరు.” ఇదీ మంచిర్యాల జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రి గతంలో చేసిన వ్యాఖ్యలు. ఇలా ఎవరికి వాళ్లు గొప్పలు చెప్పుకోవడం తప్ప.. తట్టెడు వడ్లు తీసి, రైతుల తిప్పలు పట్టించుకునే పరిస్థితిలో అధికార పార్టీ నాయకులు లేకపోవడం విమర్శలకు తావిస్తున్నది.
మంచిర్యాల, మే 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల జిల్లాలో సేకరించిన వడ్లను పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లోని మిల్లుల్లో దించుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నది. మంచిర్యాల నియోజకవర్గానికి సంబంధించి హజీపూర్, లక్షెట్టిపేట, దండేపల్లి మండలాల వడ్లను కరీంనగర్ జిల్లాలోని మిల్లులకు(10 వేల మెట్రిక్ టన్నులు) యంత్రాంగం ట్యాగింగ్ చేసింది. కేవలం మంచిర్యాలలోని మూడు మండలాల నుంచి ధాన్యం వెళ్తున్నది.
కాగా, చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాలకు సంబంధించించిన పంటను పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లోని మిల్లలు దించుకునే పరిస్థితి కనిపించడం లేదు. కొనుగోళ్లు మొదలై నెల రోజులు పూర్తికావస్తున్నా ఇప్పటి దాకా పెద్దపల్లి జిల్లా నుంచి ట్యాగింగ్ ఇవ్వాల్సిన మిల్లుల లిస్టు రాలేదు. దీంతో పెద్దపల్లి జిల్లాకు మంచిర్యాల నుంచి పంపాల్సిన 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఏం చేయాలన్నది ప్రశ్నార్థకంగా మారింది. కరీంనగర్ జిల్లాకు 50 వేల మెట్రిక్ టన్నులు ట్యాగింగ్ ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటి దాకా కేవలం 10 వేల మెట్రిక్ టన్నులకే ట్యాగింగ్ వచ్చింది. దీంతో కల్లాల్లో ధాన్యం లిప్ట్ చేశాక.. ఎక్కడికి పంపించాలి, ఏం చేయాలన్న దానిపై అధికారులు తలలు పట్టుకుంటున్నట్లు సమాచారం. ముందస్తు ప్రణాళికలు లేకపోవడం.. పొరుగు జిల్లాల అధికారులు, మిల్లర్లతో సమన్వయం కొరవడడంతోనే సమస్య వచ్చినట్లు తెలుస్తున్నది.
పక్క జిల్లాలకు తరలించాల్సిందే..
మంచిర్యాల జిల్లాలో ప్రస్తుతం 11 మిల్లులకు ట్యాగింగ్ ఇచ్చారు. వీటితో పాటు 14 గోదాములు, ఏడు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీల గోదాములు ఉండగా, డీఫాల్డర్ మిల్లుల గోదాముల్లో ధాన్యం నిల్వ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. మంచిర్యాల జిల్లాలో 55 రైస్ మిల్లులు ఉన్నప్పటికీ, వీటిలో సుమారు 26 మిల్లుల్లో సీఎంఆర్ బకాయిలు పేరుకుపోయి బ్లాక్ లిస్టులో ఉన్నాయి. మిగిలిన 24 మిల్లుల్లో రా మిల్లులను కాదని, కేవలం బాయిల్డ్ మిల్లులకే ట్యాగింగ్ ఇచ్చారు. ఈ మిల్లుల కెపాసిటీ 50 వేల మెట్రిక్ టన్నులు కాగా, వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాములు, రైతు వేదికలు, బ్లాక్ లిస్టులో ఉన్న రైస్ మిల్లుల గోదాములను వాడుకున్నా.. మొత్తం లక్షన్నర మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ చేసే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ లెక్కన మిగిలిన ధాన్యం పక్క జిల్లాలకు తరలించక తప్పని పరిస్థితి నెలకొంది. పొరుగున ఉన్న పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో వందల సంఖ్యలో రైస్ మిల్లులు ఉన్నాయి. లోకల్ ప్రొక్యూర్మెంట్ కంటే అక్కడి మిల్లుల కెపాసిటీ ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వం ఆ రెండు జిల్లాలకు ధాన్యం తరలించాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో కాంటా వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు లిఫ్ట్ చేయాల్సి ఉన్నా.. పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల అధికారులు సరిగా స్పందించడం లేదని సమాచారం. ఆయా జిల్లాలో గోదాములు కేటాయించినప్పటికీ మిల్లుల వివరాలు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని తెలిసింది. మంచిర్యాల జిల్లాలో మిగిలిన రా మిల్లర్లకు సైతం ట్యాగింగ్ ఇస్తే సమస్య పరిష్కరించే అవకాశాలున్నప్పటికీ.. ధాన్యం ఇస్తే డీఫాల్డర్లుగా మారుతామని ఆయా మిల్లర్లు ముందుకు రావడం లేదని తెలిసింది.
లోకల్‌కే ప్రియారిటీ.. రానున్న రోజుల్లో సమస్య మరింత తీవ్రం..
మంచిర్యాల జిల్లా నుంచి పంపించే ధాన్యాన్ని దించుకోవడానికి బదులు లోకల్ ధాన్యాన్నే దించుకునేందుకు అక్కడి అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిసింది. ఆయా జిల్లాల్లో సేకరించిన ధాన్యం పూర్తిస్థాయిలో మిల్లులకు తరలించాకే, మంచిర్యాల జిల్లా ధాన్యం దించుకోవాలని ఇంటర్నర్ ఆదేశాలున్నట్లు తెలిసింది. దీంతో ఇటీవల మంచిర్యాల నియోజకవర్గం నుంచి కరీంనగర్‌కు పంపించిన ధాన్యం సైతం అన్లోడింగ్ చేసుకోవడం లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయని వాపోతున్నారు. ఇప్పటికే ఆలస్యమవడంతో పాటు, రానున్న రోజుల్లో వర్షాలు పడే అవకాశాలు ఉండడంతో ఆ లోగా ధాన్యాన్ని లిఫ్ట్ చేయలేకపోతే సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశముందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో మంచిర్యాల జిల్లా రైతులు ధాన్యం దించుకోకపోవడంపై ఎంపీ వంశీకృష్ణ పెద్దపల్లి జిల్లా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎస్‌కు ఫిర్యాదు చేస్తానంటూ ప్రెస్‌మీట్‌లోనే మాట్లాడారు. దీనిపై రైతులు మండిపడుతున్నారు. ముందు నుంచి లేనిది ఇప్పుడొచ్చి మాట్లాడితే ఏం లాభమంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడి ధాన్యం అక్కడ పేరుకుపోయాకా రివ్యూ మీటింగ్‌లు తీసుకుంటున్నారని, ఇన్ని రోజులు ఏం చేశారంటూ రైతులు నిలదీస్తున్నారు. మంత్రి ఉన్నా.. ధాన్యం రవాణా చేయించే దిక్కు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందే పెద్దపల్లి అధికారులతో మాట్లాడి ధాన్యం వెళ్లేలా చర్యలు తీసుకుంటే ఈ దుస్థితి వచ్చేది కాదంటున్నారు. సమన్వయం చేయలేక చివరకు అధికారులపై విమర్శలు చేస్తే ఏం అనుకోవాలంటూ రైతులు వాపోతున్నారు.
