ఆదిలాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నిర్మల్ జిల్లా సోన్ మండలం కూచన్‌పల్లిలో శనివారం డబుల్ బెడ్రూం ఇండ్లను రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు. 30 మంది లబ్ధిదారులకు డబుల్బెడ్రూం ఇండ్లను పంపిణీ చేసి వాటికి సంబంధించిన పట్టాలు అందించారు. ముంపు గ్రామమైన కూచన్‌పల్లిలో ఇన్నాళ్లూ ఇండ్లు లేకుండా పూరి గుడిసెలు, అద్దె ఇళ్లలో ఉంటూ ఇబ్బందులు పడ్డారు. కూలీ పనులు చేస్తేగాని పూటగడవని పరిస్థితి వారిది. తమకు ఇండ్లు కట్టించాలని స్థానిక నాయకులతో కలిసి మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిని సంప్రదించారు. ఇందుకు స్పందించిన ఆయన రూ. 1.55 కోట్లతో 30 ఇండ్లు నిర్మించారు. శనివారం 30 మంది లబ్ధిదారులు గృహ ప్రవేశం కార్యక్రమం నిర్వహించగా, గ్రామస్తులు, స్థానిక నాయకులు, పరిసర గ్రామాల ప్రజలు, బంధువులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఆ ప్రాంతం సందడిగా కనిపించింది. తమ కలను సాకారం చేసిన సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని లబ్ధిదారులు తెలిపారు.
కూలీ చేసుకుంటూ కిరాయి చెల్లించేవాళ్లం కూలీ పని చేసుకుంటేనే బుక్కెడు బువ్వ నోట్లకస్తది. సొంతిల్లు లేక కిరాయికి ఉన్నం. ప్రతి నెలా అద్దె చెల్లించడానికి మస్తు తిప్పలయ్యేటిది. అటు తిండికి.. ఇటు కిరాయి కట్టడానికి పడరాని పాట్లు పడ్డం. ఇగ ఎప్పుడైనా పాణం బాగా లేకుంటే ఆడా.. ఈడా.. అప్పులు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు మాకు ఇల్లు ఇచ్చి భరోసా ఇచ్చిన్రు. సీఎం కేసీఆర్, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సార్లు చేసిన మేలు మరచిపోలేం.
– ఈలసరం నిఖిత, కూచన్‌పల్లి
సోన్, ఫిబ్రవరి 26 : వచ్చే ఏప్రిల్ నుంచి సొంత స్థలము న్న వారికి ఇండ్లు కట్టుకోవడానికి డబ్బులిస్తామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం సోన్ మండలం కూచన్పెల్లిలో 30 మందికి డబుల్‌బెడ్ రూం ఇండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని, దేశ ప్రజలంతా తెలంగాణ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆశీర్వాదం ఇవ్వాలని పిలుపునిచ్చారు. నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టించి ఇస్తున్న ఘనత తమదేనని చెప్పారు. నిర్మల్ జిల్లాలో ఇప్పటికే 3 వేల ఇండ్ల నిర్మాణం పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. సొంత స్థలం ఉంటే ఇండ్లు కట్టుకునే వారికి నిధులు మంజూరు చేస్తామని మంత్రి హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వీ.సత్యనారాయణగౌడ్, జడ్పీటీసీ జీవన్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ అంపోలి కృష్ణప్రసాద్‌రెడ్డి, సోన్ టీఆర్ఎస్ మండల కన్వీనర్ మోహినొద్దీన్, సర్పంచ్ ఇందూరి రాజేందర్, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు టీ.వినోద్, ఆర్డీవో రమేశ్ రాథోడ్, తహసీల్దార్ ఆరిఫా సుల్తానా, ఎంపీడీవో సాయిరాం, ఆత్మ చైర్మన్ గంగారెడ్డి, నాయకులు వెంకయిగారి శ్రీనివాస్‌రెడ్డి, అంకం శ్రీనివాస్, దాసరి శ్రీనివాస్, జగన్, బండి లింగన్న, గ్రామస్తులు ఉన్నారు.
మాది పేద కుటుంబం. చిరు వ్యాపారం చేసుకుంటం. మాకు సొంతిల్లు లేదు. 20 ఏండ్లసంది కిరాయి ఇంట్లో ఉంటున్నం. ఇంటి కిరాయి, కరెంటు కోసం నెలకు రూ.2 వేల దాకా పెట్టేటోళ్లం. డబ్బులు ఎటూ సరిపోక మస్తు తిప్పలపడేటోళ్లం. ఇప్పుడు మాకు ఆ బాధ లేకుంటైంది. డబుల్ బెడ్ రూం ఇల్లు ఇచ్చిన్రు. మస్తు సంబురమైతంది. ఎన్నో ఏండ్ల కల నెరవేరింది. – కటకం లావణ్య, కూచన్‌పల్లి
మాది పేద కుటుంబం. ఉండటానికి ఇల్లు లేకుండే. ఇప్పటి దాకా కిరాయి ఇండ్లళ్ల ఉండుకుంట వచ్చినం. ఖాళీ చేయమంటే వేరే ఇల్లు వెతుక్కునేటోళ్లం. మస్తు తిప్పల పడ్డం. ఇగ ఇప్పుడు ఆ బాధలు తప్పినయ్. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సార్లు మాకు ఇల్లు కట్టించి ఇచ్చినందుకు మస్తు సంతోషంగా ఉన్నాం. గాళ్లకు జీవితాంతం రుణపడి ఉంటం.
– ఎలగందుల లత, కూచన్‌పల్లి