ఆసిఫాబాద్ అంబేదర్చౌక్, సెప్టెంబర్ 5 : స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించడంలో రాజకీయ పార్టీల భాగస్వామ్యం కీలకమైనదని కలెక్టర్ బోరడే హేమంత్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు దీపక్ తివారీ, దాసరి వేణుతో కలిసి గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు జాబితా రూపకల్పనపై మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీ వరకు ఓటరు నమోదు, జాబితాలో మార్పుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, ఈ విషయమై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. పోలింగ్ కేంద్రాల్లో బూతు స్థాయి అధికారులు, తహసీల్ కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, ఇప్పటివరకు దాదాపు 16 వేల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజేశ్వర్, ఎన్నికల విభాగం అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.