అమ్మకావడం ఆడవాళ్లకు ఓ వరం. ఆ పిలుపు కోసం ఎంత బాధనైనా అనుభవిస్తారు. అయితే సుఖప్రసవం తల్లితోపాటు బిడ్డకూ ఎంతో ఆనందదాయకం. కానీ, ప్రస్తుత కార్పొరేట్ యుగంలో కాసులే లక్ష్యంగా కడుపుకోతలే అధికమవుతున్నాయి. ఫలితంగా అటు ఆర్థికంగా.. ఇటు ఆరోగ్యపరంగా మహిళలు మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. దీన్ని అధిగమించేందుకు యాదాద్రి భువనగిరి జిల్లా యంత్రాంగం వినూత్న ప్రయత్నానికి నడుం బిగించింది. ‘అమ్మకు భరోసా’ కార్యక్రమంతో కాబోయే తల్లికి ధైర్యం చెబుతున్నారు అధికారులు. అమ్మదనానికి సాదర స్వాగతం పలుకుతున్న ‘అమ్మకు భరోసా’ ఆత్మీయతకు చిరునామాగా నిలుస్తున్నది.
యాదాద్రి భువనగిరి జిల్లాలో గర్భిణుల కోసం కలెక్టర్ హనుమంతరావు మార్గదర్శనంలో ఓ కొత్త కార్యక్రమం పురుడుపోసుకుంది. ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఈ ఏడాది ఫిబ్రవరిలో అమ్మకు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించారు. సర్కారు ఆస్పత్రుల్లో ప్రసవాలతోపాటు సాధారణ డెలివరీలు పెంచడమే లక్ష్యంగా దీనికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం వైద్య ఆరోగ్య శాఖతోపాటు ఇతర విభాగాలను భాగస్వామ్యం చేసి.. ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేశారు.
ఇందులో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, జిల్లా యంత్రాంగం, ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు ఉంటారు. ప్రతి నెలా చివరి వారంలో కలెక్టర్‌తోపాటు అధికారులంతా ఒక్కో గర్భిణి ఇంటికి వెళ్లి తలుపు తడతారు. ఆమెతో ముచ్చటించి యోగ క్షేమాలు తెలుసుకుంటారు. ‘ఆరోగ్యం ఎలా ఉంది..? ఏం ఆహారం తీసుకుంటున్నారు..? వైద్య సేవలు సరిగ్గా అందుతున్నాయా? సమయానికి మందులు వేసుకుంటున్నారా..?’ ఇలా అన్నివిషయాలపై ఆప్యాయంగా ఆరా తీస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులపై ఉన్న అపోహలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. సర్కారు దవాఖానల్లో అందిస్తున్నసదుపాయాలను వారికి వివరిస్తున్నారు. సాధారణ ప్రసవాల వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేస్తున్నారు. ఆపరేషన్‌తో కలిగే ఆర్థిక, ఆరోగ్య నష్టం గురించి అర్థమయ్యేలా చెబుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవం చేయించుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాదు గర్భిణులకు పండ్లు, పౌష్టికాహారం ఇచ్చి పుట్టింటివారు జరిపినట్టు సీమంతం నిర్వహిస్తున్నారు.
ఇంటికి వెళ్లి కుశల ప్రశ్నలు అడిగి.. ఊరుకోవడం లేదు అధికారులు. ఆ గర్భిణికి అనుక్షణం అండగా నిలుస్తున్నారు. ఇందుకోసం మెటర్నల్ చైల్డ్ హెల్త్ కాల్ సెంటర్ నిర్వహిస్తున్నారు. ఒక్క యాదాద్రి భువనగిరి జిల్లాలోనే ఈ సెంటర్ ఉంది. దీన్ని ఈ ఏడాది ఫిబ్రవరిలోనే భువనగిరిలోని టీ-హబ్‌లో ప్రారంభించారు. ప్రసవానికి రెండు నెలల సమయం ఉన్న గర్భిణుల వివరాలను సిబ్బంది సేకరిస్తారు. ప్రతి రోజూ నలభై మంది గర్భిణులకు ఫోన్ చేసి.. వారి బాగోగులు విచారిస్తారు. సాధారణ ప్రసవాల గురించి వివరిస్తారు. అంతేకాదు, సుఖ ప్రసవం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తారు. చిన్న చిన్న వ్యాయామాలు ఎలా చేయాలో సూచిస్తారు. ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో చెబుతారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చేరితే.. తమకు కాల్ చేస్తే, ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి అవసరమైన చికిత్స చేయిస్తామని భరోసా కల్పిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 2,800 మంది గర్భిణులకు ఇలా ఫోన్ చేసి సలహాలు ఇచ్చారు.
జిల్లా యంత్రాంగం తీసుకొచ్చిన వినూత్న కార్యక్రమాలు అనతికాలంలోనే సత్ఫలితాలు ఇచ్చాయి. ఫిబ్రవరి కంటే ముందు ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో డెలివరీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. 49 శాతం సర్కారు దవాఖానల్లో, 51శాతం ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రసవాలు జరిగేవి. కానీ నాలుగు నెలల్లోనే ఎంతో మార్పు వచ్చింది. జూన్ నెల వచ్చేసరికి సర్కారు దవాఖానలో ప్రసవాలు 67 శాతానికి పెరిగాయి. ఇక సిజేరియన్లు కూడా తగ్గుముఖం పట్టాయి. ఫిబ్రవరిలో సిజేరియన్లు 80 శాతం నమోదు కాగా.. జూన్‌లో ఏకంగా 66 శాతానికి పడిపోయింది. కలిసికట్టుగా అందరూ సమన్వయంతో పనిచేయడం వల్లే మంచి
ఫలితాలు సాధ్యమయ్యాయని అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అమ్మకు భరోసా కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుండటం సంతోషంగా ఉంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచడంతోపాటు నార్మల్ డెలివరీలు లక్ష్యంగా దీన్ని నిర్దేశించుకున్నాం. ముందుగా గర్భిణుల్లో ధైర్యం, భరోసా కల్పించాలని భావించాం. ఆ దిశగా టీమ్‌వర్క్‌తో ముందుకెళ్లాం. ప్రతి నలా చివరి వారంలో గర్భిణుల ఇంటికి నాతోపాటు ప్రతి ఒక్క అధికారి వెళ్లి అవగాహన కల్పిస్తున్నాం. మున్ముందు మరింత సమర్థంగా దీన్ని కొనసాగిస్తాం. మాతాశిశు మరణాలు తగ్గడానికి కూడా ఇది ఎంతో దోహదపడుతుంది. తల్లీబిడ్డ ఆరోగ్యమే మా ప్రధాన లక్ష్యం.
– హనుమంతరావు,కలెక్టర్, యాదాద్రి భువనగిరి
– పున్న శ్రీకాంత్, యాదాద్రి భువనగిరి