‘అవును. తెలంగాణ మహిళలమైన మేము.. నిర్భయంగా బతికేస్తున్నాం. ఆత్మవిశ్వాసంతో అడుగులేస్తున్నాం. ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకుంటున్నాం. ధైర్యంగా వీధుల్లో తిరుగుతున్నాం’ అని సగర్వంగా ప్రకటించుకోగల వాతావరణాన్ని తీసుకురాగలిగింది పదేండ్ల సమర్థ పాలన. ఇందుకు కొనసాగింపుగా ‘ఉమెన్ సేఫ్టీ సర్వైలెన్స్ రిజిస్టర్’ ప్రారంభించారు హైదరాబాద్ పోలీసులు. ఇకనుంచి పోకిరీల ప్రతి కదలికా నమోదు అవుతుంది. రోమియోల చేష్టలు రికార్డులకు ఎక్కుతాయి. భారత రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛ, సమానత్వపు హక్కులకు ఈ కార్యక్రమంరక్షణ కవచం.
TS Womensafety | కుషాయిగూడకు చెందిన శ్రీనివాస్ (పేరు మార్చాం) స్నేహం ముసుగులో ఒక అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. స్నేహంగా నటించాడు. శారీరక అవసరాలు తీర్చమంటూ ఇబ్బంది పెట్టాడు. ఒంటరిగా కనిపిస్తే చాలు.. లైంగిక దాడికి ప్రయత్నించేవాడు. ఇలాంటి విషయాల్ని ఏ ఇల్లాలూ భర్తకు చెప్పుకోలేదన్న ధైర్యంతో తరచూ హద్దులు మీరేవాడు. అత్యాచారం ఒక్కటే తక్కువ. ఆ హింసను భరించలేక.. షీటీమ్‌కు సమాచారం ఇచ్చిందా మహిళ. పోలీసులు కేసు నమోదు చేశారు. అతగాడికి ‘కౌన్సెలింగ్’ చేశారు. మరోసారి తప్పు చేస్తే.. తాట తీస్తామని వార్నింగ్ ఇచ్చారు. మొదటి నెల బాగానే గడిచింది. ఆ తర్వాత, తననెవరూ గమనించడం లేదని అతనికి అర్థమైపోయింది.
రెట్టింపుగా రెచ్చిపోయాడు. మరో అమ్మాయితో వెకిలి వేషాలు ప్రారంభించాడు. నిజానికి, శ్రీనివాస్ లీలల్ని ఓ కంట కనిపెడుతూనే ఉంది షీటీమ్. తేది, సమయంతో సహా రికార్డు చేసిపెట్టింది కూడా. సాక్ష్యాలతో కోర్టు ముందుంచి.. జైలుకు పంపింది. ప్రస్తుతం శ్రీనివాస్ సీను మారిపోయింది. ఊచలు లెక్కబెడుతున్నాడు.
‘లైంగిక వేధింపులకు పాల్పడే మృగాళ్లూ.. జాగ్రత్త! నేరం చేశాం కదా.. కేసు పెట్టారు కదా.. బయటికి వచ్చేశాం కదా. ఇక ఎవరేం చేస్తార్లే? మనల్ని పట్టించుకునే తీరిక పోలీసులకు ఎక్కడుంది? అనే మితిమీరిన ఆత్మవిశ్వాసంతో మళ్లీ వెకిలి వేషాలు వేశారో.. ఇక మిమ్మల్ని జైలు నుంచి బయటికి తీసుకురావడం ఎవరి తరమూ కాదు అని హెచ్చరిస్తున్నది తెలంగాణ పోలీసు శాఖ, ఉమెన్ సేఫ్టీ వింగ్‌లో భాగమైన షీటీమ్. నిందితులు సదరు బాధితులను మళ్లీ వేధింపులకు గురిచేయకుండా, ఒంటరిగా ఉన్నప్పుడు దాడులకు తెగబడకుండా, ఏ యాసిడ్ సీసా పట్టుకునో చంపేస్తామని భయపెట్టకుండా.. అసలు, మరో మహిళ వైపు కన్నెత్తి కూడా చూడకుండా..
‘మహిళా సంరక్షణ నిఘా రిజస్టర్’ నిర్వహిస్తున్నది. ఇటీవల రాచకొండ కమిషనరేట్‌లో ప్రయోగాత్మకంగా దీన్ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ‘లైంగిక’ నేరగాళ్లను నీడలా వెంటాడుతూ, ప్రతి చర్యనూ డేగకళ్లతో గమనిస్తూ.. ఆరు నెలలపాటు గట్టి నిఘా పెడతారు. సంబంధిత పోలీసు స్టేషన్ బాధ్యుడు లేదా సెక్టార్ ఎస్ఐ ఆధ్వర్యంలో ఈ రిజిస్టర్‌ను అతి రహస్యంగా నిర్వహిస్తారు. బాధిత మహిళకు ప్రమాదం ఉందని తెలిస్తే తక్షణ చర్యలు తీసుకుంటారు. ఆమె కుటుంబసభ్యులకు సమాచారం అందించి, తగిన రక్షణ ఇస్తారు.
కౌన్సెలింగ్ దశలోనే నిందితుడి ప్రవర్తనపై ఓ అంచనాకు వస్తారు షీటీమ్ సిబ్బంది. అక్కడితో ఆగకుండా.. ఏ మేరకు నిఘా పెట్టాలో బేరీజు వేస్తారు. తేడాగా అనిపిస్తే రోజంతా అతణ్ని ఫాలో అవుతూనే ఉంటారు. స్పై కెమెరాలతో ప్రతి కదలికనూ రికార్డు చేస్తారు. ఇవే కాదు, ఏ సమస్య ఎదురైనా సరే..
పాఠశాల విద్యార్థినుల నుంచి ఉద్యోగినుల వరకు ఎవరైనా సరే.. ఉమెన్ సేఫ్టీ వింగ్‌ను 8712656858 వాట్సాప్‌లో సంప్రదించొచ్చు. +9140 27852246 నంబర్‌కు కాల్ చేయవచ్చు. womensafety.ts@gmail.com, tswomensafety.sp@gmail.comకు మెయిల్ చేసినా స్పందిస్తారు. మనం ఆటవిక యుగంలో లేము. సర్వసత్తాక గణతంత్ర దేశమిది. సమానత్వం మన హక్కు. వివక్షను ఎదిరించడానికి, హింసను ప్రశ్నించడానికి రాజ్యాంగం అనేక ఆయుధాలు ప్రసాదించింది. ఆ ప్రయత్నంలో పోలీసుల సహకారమూ తీసుకోవచ్చు. ‘రిపబ్లిక్ డే’ సందర్భంగా ప్రతి మహిళా తీసుకోవాల్సిన తీర్మానమిది. జై భారత్.
చౌటుప్పల్‌కు చెందిన ఓ యువతి బీటెక్ చేసింది. ఆన్లైన్లో ఓ సీనియర్ పరిచయమయ్యాడు. ‘ఇదిగో ఇక్కడ ఉద్యోగం. అదిగో అక్కడ ఖాళీలు’ అంటూ నాలుగు మంచి మాటలు చెప్పాడు. రెజ్యూమే పంపమంటూ నంబర్ తీసుకున్నాడు. పరిచయం పెంచుకొని ఆమె సోషల్ మీడియా ఖాతాల నుంచి ఫొటోలు డౌన్లోడ్ చేసుకుని.. మార్ఫింగ్ చేశాడు. వాటిని ఒక్కొక్కటిగా ఆ యువతికి పంపి.. తన కోరిక తీర్చమని వేధించేవాడు. ఒప్పుకోకపోతే నెట్లో పెడతానని బెదిరించేవాడు. దీంతో ఆమె షీటీమ్‌కు ఫిర్యాదు చేసింది. వెంటనే కేసు నమోదు చేశారు చౌటుప్పల్ పోలీసులు. చట్టపరంగా చేయాల్సినంతా చేశారు. ఇటీవల అతను జైలు నుంచి విడుదలవడంతో.. ఇప్పుడు అతనిపై పూర్తిస్థాయిలో నిఘా కొనసాగిస్తున్నారు. మూడు షిఫ్టుల్లో ముగ్గురు కానిస్టేబుల్స్ అతని కదలికలు రికార్డు చేస్తున్నారు.
…? రవికుమార్ తోటపల్లి