మెనోపాజ్ ఆలస్యమయ్యే మహిళల్లో.. గుండెజబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. ఇలాంటివారి రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటాయని, దాంతో వారిలో గుండెజబ్బుల ప్రమాదం తగ్గుతుందని కొలరాడో బౌల్డర్ విశ్వవిద్యాలయం నిర్వహించిన సర్వే వెల్లడించింది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్ సర్క్యులేషన్ రీసెర్చ్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం.. అనేక విషయాలను వెల్లడించింది. 55 ఏళ్ల వయసులో, ఆ తర్వాత రుతుచక్రం ఆగిపోయిన మహిళల్లో గుండెపోటు వచ్చే అవకాశం తగ్గుతుందని తేల్చి చెబుతున్నది. మెనోపాజ్ ఆలస్యంగా ప్రారంభం కావడం వల్ల అనేక శారీరక ప్రయోజనాలు అందుతాయని పరిశోధకులు గుర్తించారు.
ఈ సర్వేలో భాగంగా పలువురు మహిళల వాస్కులర్ ఆరోగ్యాన్ని పరీక్షించారు. ఈ సందర్భంగా పలు కొత్త విషయాలను కనుగొన్నారు. మిగతావారితో పోలిస్తే.. రుతుక్రమం ఆగిపోయిన మహిళల ధమనుల పనితీరు బాగున్నట్టు చెప్పారు. వయసు పెరిగేకొద్దీ మహిళల శరీరంలో.. నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి పెరుగుతుందనీ, ఇది రక్తనాళాలు విస్తరించడానికి సహాయపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. రక్తనాళాలు గట్టిపడకుండా నిరోధిస్తుందని వెల్లడించారు. సాధారణంగా మహిళల్లో 45 నుంచి 55 ఏళ్ల మధ్యలో రుతుచక్రం ఆగిపోతుంది. అలాకాకుండా.. 55 ఏళ్ల తర్వాత మెనోపాజ్‌కు గురైన వారిలో.. 10% మందికి గుండెజబ్బుల ప్రమాదం తగ్గుతుంది. వారి ఆరోగ్యం కూడా మెరుగుపడే అవకాశం ఉన్నదని పరిశోధకులు చెబుతున్నారు.