భారత సాంకేతికరంగంలో మహిళా శక్తి క్రమంగా పెరుగుతున్నది. మహిళలకు వ్యాపారాలు, ఉద్యోగాలు కల్పించడంలో ఐటీ పరిశ్రమ ముందుంటున్నది. రాబోయే మూడేళ్లలో భారతీయ టెక్ వర్క్‌ఫోర్స్‌లో మహిళల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నదని ప్రముఖ రిక్రూట్మెంట్ సంస్థ.. ‘టీమ్‌లీజ్ డిజిటల్’ చెబుతున్నది. ‘టీమ్‌లీజ్ డిజిటల్’ నిర్వహించిన సర్వే ప్రకారం.. భారత ఐటీ రంగంలో మహిళా ఉద్యోగులు 2022లో 10.8 శాతం ఉండగా.. 2027 నాటికి 14.9 శాతానికి పెరిగే అవకాశం ఉన్నది. ఈ రంగంలో ఉద్యోగిణుల వార్షిక వృద్ధిరేటు 5.5 శాతంగా నమోదవుతున్నది. ప్రస్తుతం భారతీయ ఐటీలో 20లక్షలకుపైగా మహిళలు పనిచేస్తున్నారు. వచ్చే మూడేళ్లలో ఈ సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నది. 2027 నాటికి ఇన్నోవేషన్ హబ్‌లో 35 శాతం శ్రామికశక్తిని మహిళలే కలిగి ఉంటారని ‘టీమ్‌లీజ్’ అంచనా వేస్తున్నది. ఐటీలో తమదైన ముద్ర వేయాలనుకునే మహిళలకు.. క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తోపాటు మెషిన్ లెర్నింగ్, యూఐ, యూఎక్స్ రంగాల్లో భారీగా అవకాశాలు దక్కనున్నాయి. తమ సృజనాత్మకతకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తూ.. మహిళలు ఆయా రంగాల్లో రాణించే అవకాశం ఉన్నది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ పరిశ్రమ.. మహిళా సాధికారతలోనూ అంతే వేగంగా దూసుకెళ్తున్నదని ‘టీమ్‌లీజ్ డిజిటల్’ చెబుతున్నది.