e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 26, 2021
Home జిందగీ Engineers Day | తెలంగాణ గంగమ్మలు!

Engineers Day | తెలంగాణ గంగమ్మలు!

నేడు ఇంజినీర్స్‌ డే

జలాధిదేవత.. గంగ. నదీమతల్లి.. గంగ. తెలంగాణ సర్కారు లక్ష్యమూ .. గంగావతరణే! అనంత జలరాశిని పల్లం నుంచి పైపైకి పారించితీరాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ సాహసోపేత సంకల్పానికి నీటిపారుదల నిపుణుల సమర్థత తోడైంది. నిన్న మొన్నటి వరకూ చెరువుల నుంచీ, బావుల నుంచీ బిందెలకొద్దీనీళ్లు మోసి, ఇంటిల్లిపాది దాహం తీర్చిన మహిళకూడా ఇంజినీర్‌ హోదాలో అంతే బాధ్యతతో అదే ప్రేమతో.. పంటపొలాల గొంతు తడిపే మహత్కార్యంలోపాలుపంచుకొంటున్నది. తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టులలో దాదాపు వందమంది మహిళా ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. అంతకు ఏడురెట్ల మంది కంప్యూటర్ల ముందు కూర్చుని.. పని ప్రగతిని పర్యవేక్షిస్తున్నారు, సాంకేతిక సహకారం అందిస్తున్నారు.

- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత సాగునీటి రంగం స్వరూపమే మారిపోయింది. సీఎం కేసీఆర్‌ మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టే అందుకు నిలువెత్తు నిదర్శనం. ప్రపంచశ్రేణి ప్రాజెక్టుల కారణంగా.. మహిళా ఇంజినీర్లకు మంచిరోజులు వచ్చాయి. ఉమ్మడి పాలనలో మహిళా ఇంజినీర్లు, అందులోనూ తెలంగాణకు చెందినవారు కార్యాలయాలకే పరిమితమయ్యారు. ఇప్పుడా అవరోధాలు లేవు, వివక్షా లేదు. సర్కారు ప్రోత్సాహంతో ఉత్సాహంగా క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్నారు. నెర్రెలుబారిన నేలను సస్యశ్యామలం చేస్తున్నారు.

సవాళ్లను అధిగమిస్తూ
ప్రాజెక్టు సైట్ల వద్ద పనిచేయడం అన్నది భిన్నమైన అనుభవం. విపరీతమైన చలి, కుండపోత వర్షాలు, మండే ఎండలు.. అన్నిటినీ తట్టుకోవాలి. నిర్ణీత పనివేళలంటూ ఏమీ ఉండవు. దుమ్మూ ధూళీ చికాకు పెడతాయి. ఇక కాలువలు, తూములు, రిజర్వాయర్ల దగ్గర అయితే, విధి నిర్వహణ ఓ పరీక్షే. రాత్రికి రాత్రి వరద ముంచుకురావచ్చు, జలాశయం నిండిపోవచ్చు. అర్ధరాత్రి అయినా సరే, స్వయంగా వెళ్లి గేట్లు ఎత్తాలి. తరచూ నీటి మట్టం కొలతలను తీసుకోవాలి. ఉన్నతాధికారులకు సమాచారం చేరవేయాలి. ఇలాంటి పరిస్థితుల కారణంగానే, చాలా మంది మహిళా ఇంజినీర్లు కార్యాలయానికే పరిమితమయ్యేవారు. ఆపరేషన్‌, మెయింటెనెన్స్‌, మేనేజ్‌మెంట్‌ తదితర విభాగాల వైపు వెళ్లడానికి ఆసక్తి చూపేవారు కారు. కానీ, ప్రస్తుతం పరిస్థితి మారింది. ‘మేము సైతం’ అంటూ మహిళా ఇంజినీర్లు ఓ అండ్‌ ఎం విభాగంలో దూసుకుపోతున్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణంలో భాగస్వాములవుతున్నారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి తదితర ప్రాజెక్టుల్లోనూ ఏఈఈ మొదలు చీఫ్‌ ఇంజినీర్‌ స్థాయి వరకు అన్ని హోదాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు, తమదైన ముద్ర వేసుకుంటున్నారు. కాలువలు, డ్యామ్‌లు, సొరంగాల్లోని పంప్‌హౌస్‌లలోనూ వందల మంది పురుషుల మధ్య స్వేచ్ఛగా పనిచేస్తున్నారు. తెలంగాణ మహిళ సమర్థతను చాటుతున్నారు.

తొలిసారి క్షేత్రస్థాయిలో

నా పేరు మంజుల. సివిల్‌ ఇంజినీరింగ్‌ చదివాను. ఉద్యోగంలో చేరాక, దాదాపు పదేండ్లు కార్యాలయానికే పరిమితం అయ్యాను. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత, తొలిసారిగా క్షేత్రస్థాయిలో అడుగుపెట్టాను. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టులో పనిచేస్తున్నా. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన.. రాష్ట్రంలోనే అతిపెద్ద మానవ నిర్మిత జలాశయ రూపకల్పనలో పాలుపంచుకొనే అరుదైన అవకాశం నాకు దక్కింది. ప్రాజెక్టును ప్రారంభించింది మొదలు, పురుష ఇంజినీర్లతో
సమానంగా పనిచేస్తున్నా. – మంజుల, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌

గర్వంగా ఉంది..

ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్‌ చేశా. జేఎన్టీయూ నుంచి ఎంటెక్‌ పట్టా అందుకున్నా. సాగునీటి శాఖలో అడుగుపెట్టి 17 ఏండ్లవుతున్నది. ఏడాది క్రితం వరకూ జలసౌధలోని కార్యాలయానికే పరిమితమయ్యా. కానీ, మొదటిసారి క్షేత్రస్థాయి విధులకు వచ్చాను. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు పరిధిలోని తుక్కాపూర్‌ పంప్‌హౌస్‌లో పనిచేస్తున్నా. ఇంత పెద్ద ప్రాజెక్టులో భాగస్వామిని కావడం గర్వంగా ఉంది. ఈ పంప్‌హౌస్‌లో ఏకైక మహిళా ఇంజినీర్‌ నేనే. అయినా సహచరులు, అధికారుల ప్రోత్సాహం వల్ల విధులు నిర్వర్తించగలుగుతున్నా. – శిల్ప, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (తుక్కాపూర్‌ పంప్‌హౌస్‌)

నా అదృష్టం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత.. 2016లో సాగునీటి శాఖలో అడుగుపెట్టాను. చేరీచేరగానే అత్యంత భారీ సాగునీటి ప్రాజెక్టు అయిన కాళేశ్వరంలో పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం. నిర్మాణ సమయంలో సవాళ్లు ఎదురైనా ఉత్సాహంగా పనిచేశాం. ఎక్స్‌కవేషన్‌ పనులకు ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌గా పనిచేయడం మరచిపోలేని అనుభవం. రోజూ తెల్లవారు జామునే బ్లాస్టింగ్‌ చేయాల్సి ఉండేది. 20 కిలో మీటర్లు ప్రయాణించి, నిర్ణీత సమయానికి సైట్‌కు చేరుకుని పనులు పూర్తిచేసేవాళ్లం. అక్కడే రాత్రి అయ్యేది. అయినా, ఎప్పుడూ అధైర్యపడలేదు. భూసేకరణ సమయంలోనూ ఒత్తిళ్లు వచ్చేవి. ప్రభుత్వ ప్రోత్సాహం, ఉన్నతాధికారుల సహకారంతో వాటన్నిటినీ అధిగమించా. ప్రాజెక్టులో వేలమంది కార్మికులతో, గొప్పగొప్ప నిపుణులతో కలిసి పనిచేయడం వల్ల ఎన్నో విషయాలు తెలుసుకున్నా. – లావణ్య, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌

… మ్యాకం రవికుమార్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana