తలకు నూనె పూసుకోవడం, ఒంటికి నూనె పట్టించుకోవడం సర్వసాధారణం. అయితే, ఇవి ఆరోగ్యకరమైన అలవాట్లే అయినా.. స్నానం చేసిన తర్వాత నూనె రాసుకుంటానంటే ఇంట్లో పెద్దలు అగ్గిమీద గుగ్గిలం అవుతారు. ముఖం జిడ్డుగా కనిపిస్తుందనో, ఒళ్లంతా బంకగా తయారవుతుందనో పెద్దలు ఈ మాట చెప్పలేదు. శాస్త్రీయమైన అవగాహనతోనే స్నానానికి ముందే నూనె రాసుకోవాలని సూచించారు. అసలు విషయం ఏంటంటే.. మన శరీరంలో చెమట గ్రంథులు ఉంటాయి. పని చేస్తున్నప్పుడు, భావోద్వేగాలకు గురైనప్పుడు శరీరంలో ఏర్పడే చెమట.. స్వేదరంధ్రాల ద్వారా వెలుపలికి వస్తుంది.
ఈ చెమట గ్రంథులు చర్మంపై విస్తారంగా ఉంటాయి. ముఖ్యంగా వెంట్రుకల కుదుళ్ల దగ్గర కనిపిస్తాయి. చెమటలో నీళ్లు, ఖనిజాలు, యూరియా లాక్టేట్లు ఉంటాయి. ఒంటికి నూనె రాసుకున్నప్పుడు చర్మంలోని చెమట గ్రంథులు మూసుకుపోతాయి. అంతేకాదు గ్రంథుల బయటి రంధ్రాలపై దుమ్ము, ధూళి చేరి స్వేదం బయటికి వచ్చే మార్గాన్ని బిగించినట్టు అవుతుంది. దీనివల్ల శరీరంలో ఉత్పత్తి అయ్యే చెమట బయటికి వెళ్లే అవకాశం ఉండకుండా పోతుంది. వ్యర్థాలు లోపలే పేరుకుపోతాయి. ఈ ప్రభావం మూత్రపిండాల మీద కూడా పడుతుంది. ఇక చర్మం రెండు పొరలను కలిగి ఉంటుంది. ఇవి మృతకణాలను ఎక్కువగా కలిగి ఉంటాయి.
పైగా ఇవి చాలా సూక్ష్మంగా ఉంటాయి. ఈ పొరలలో చెమట గ్రంథులు ఉంటాయి. వీటి నాళాలు చర్మం వెలుపలికి తెరుచుకొని ఉంటాయి. వాటి ద్వారా చెమట బయటికి వస్తుంది. స్నానం చేసిన తర్వాత నూనె లాంటి పదార్థాలను పూయడం ద్వారా ఈ రంధ్రాలు మూసుకుపోతాయి. అందుకే, మన పెద్దలు స్నానం తర్వాత నూనె రాయడాన్ని ప్రోత్సహించరు. స్నానానికి ముందు నూనెతో బాగా మర్దన చేయమని సూచిస్తారు. తర్వాత గోరువెచ్చని నీళ్లతో స్నానం చేస్తే.. స్వేద రంధ్రాలు విచ్చుకుంటాయి. అందులో అప్పటికే పేరుకుపోయిన దుమ్ము ఏదైనా ఉంటే.. అదీ తొలగిపోతుంది. ఒంట్లో పుట్టిన చెమట ఎప్పటికప్పుడు వెలుపలికి వచ్చి.. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.