కన్నయ్య రూపు కన్నంతనే ఎన్నో వింతలు గోచరమవుతాయి. శిఖలో నెమలి పింఛం ముచ్చటగొలుపుతుంది. విజయహారంగా ధరించిన వైజయంతిమాల నిత్యనూతనంగా దర్శనమిస్తుంది. ఇక నల్లనయ్య చల్లని చేతుల్లో ఒదిగిపోయిన మురళిది ప్రత్యేక స్థానం. కుదురులేని గాలిని ఒడిసిపట్టి.. మధుర రాగాలను వినిపిస్తూ పరవశింపజేస్తుంది. ఒళ్లంతా గాయాలు చేసుకున్న వెదురు.. ఎదురులేని కీర్తిని గడించింది నల్లనయ్య చేతుల్లోకి చేరాకే! అందరివాడైన గోవిందుడి మోవితేనె రుచిని తొలిగా చవిచూసింది వేణువే! ఈ బృందావన విహారి ఏ పిల్లను చేపట్టక ముందే పిల్లనగ్రోవిని వలచాడు మరి! అందుకే కాబోలు.. నిరంతరం కన్నయ్యను అంటిపట్టుకుని ఉన్న వేణువును చూసి గోపికలు, కృష్ణుడి అష్టభార్యలూ ఈర్ష్యపడేవారట.
ఓసారి కృష్ణుడు నిద్రిస్తున్న సమయంలో గోపికలంతా వేణువును సమీపించి ‘నీవంటే గోపాలునికి ఎందుకంత ప్రీతి?’ అని అడిగారట. అప్పుడు వేణువు ‘నన్ను తేరిపారా చూడండి. నా అంతరంగం అంతా శూన్యమే. నిష్కామంతో స్వామిని ఆశ్రయించాను. అందుకే ఆయన నన్ను అంతగా ఆదరించాడు’ అని బదులిచ్చిందట. గొప్ప ఆధ్యాత్మిక సత్యమిది. మనసులో ఏ కోరిక, ఏ మాలిన్యమూ లేకుండా తనను ఆరాధించిన భక్తులకు భగవానుడు తన హృదయంలో చోటిస్తాడు అనడానికి మురళి అదృష్టమే ఉదాహరణ.