గోళ్ల రంగు వేసుకోవడం అన్నది ఎంతో కాలం నుంచీ అలవాటైన అలంకరణే. అయితే దాన్ని కూడా కాలానికి జత చేస్తే కనువిందైన ఫ్యాషన్‌గా మార్చుకోవచ్చు. సీజన్‌ని బట్టి గోళ్ల రంగులు ఎంచుకోవడం మనకు కూడా కొత్త అనుభూతిని కలిగించే విషయమే. అందుకే వానాకాలం ప్రత్యేక అతిథి హరివిల్లుని గోళ్ల మీదకెక్కించేస్తే అటు విభిన్నంగానూ, ఇటు టైమ్లీగానూ ఉంటుందనుకున్నారేమో ఫ్యాషనిస్టులు ‘రెయిన్ బో నెయిల్ కలర్ ట్రెండ్’కి శ్రీకారం చుట్టారు.
ఇదేదో ఆర్టిస్టులు మాత్రమే వేయగలిగే పెద్ద డిజైన్ ఏమీ కాదు, ఎంచక్కా ఇంద్రధనుస్సును చూస్తూ అందులోని ఒక్కో రంగునీ ఒక్కో గోరుకీ పులిమేయడమే. ఇంకా చెప్పాలంటే ఆకాశపు రంగుల్ని అందాల గోరు మీదకి ఆవాహన చేయడం. అచ్చంగా అవే రంగులు లేకపోయినా ఏం ఫర్వాలేదు. చేతినో, పాదాలనో చూస్తే హరివిల్లు గుర్తొచ్చేలా వర్ణాల మేళవింపు ఉంటే సరి… మనం సింక్‌లో ఉన్నట్టే. కాబట్టి హరివిల్లు గోళ్లు ఓ సింపుల్ ఫ్యాషన్ ట్రెండ్ అన్నమాట!