వ్యాయామం ఇష్టం లేదా? జాగింగ్, రన్నింగ్ అంటూ అలసి పోతున్నారా? అయితే, మీకో శుభవార్త. రోజూ వేడినీళ్లతో స్నానం చేస్తే చాలంటున్నారు పరిశోధకులు. ఇంగ్లండ్‌లోని కోవెంట్రీ యూనివర్సిటీ పరిశోధక బృందం ఇటీవల జరిపిన ఓ అధ్యయనంలో ఈ విషయాన్ని కనుగొన్నారు.
రన్నింగ్, జాగింగ్ ఇష్టం లేనివారు వేడినీటితో స్నానం చేస్తే ‘శరీరాన్ని పరుగులు పెట్టించినంత ప్రయోజనమని’ చెబుతున్నారు. రోజూ వేడినీటితో స్నానం చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని వారంటున్నారు. చార్లెస్ జేమ్స్ స్టీవార్డ్ బృందం అధ్యయనంలో భాగంగా కొందరు వలంటీర్లతో సైక్లింగ్, రన్నింగ్, జాగింగ్ చేయించారు. ఆపైన వారి శరీర ప్రతిస్పందనలను, ఉష్ణోగ్రతలను, శక్తిని తెలుసుకున్నారు. మరికొంతమంది వలంటీర్లతో కేవలం వేడినీటి స్నానం (హాట్ టబ్ బాత్) చేయించారు. ఆ తర్వాత పరిశీలించగా వారి శరీర ప్రతిస్పందనలు, ఉష్ణోగ్రతలు, గుండెవేగం, ధమనుల ప్రతిస్పందన, రక్త ప్రసరణ, గ్లూకోజ్ స్థాయులు దాదాపుగా రన్నింగ్, సైక్లింగ్ చేసిన వారితో సమానంగా ఉన్నాయని గుర్తించారు. వ్యాయామం చేయలేని వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు నిరభ్యంతరంగా హాట్ టబ్ బాత్‌ను ఎంచుకోవచ్చని సూచిస్తున్నారు. వారానికి ఏడుసార్లు వేటినీటి స్నానం చేసిన మధ్యవయస్కులైన పురుషుల్లో కొంతమందికి గుండె సంబంధ వ్యాధులు నియంత్రణలోకి వచ్చినట్టు గుర్తించారు. అయితే, ఈ విధానాన్ని వ్యాయామానికి ప్రత్యామ్నాయంగా మాత్రం చూడలేమని వారు పేర్కొన్నారు.