హలో జిందగీ. ఇటీవల చాలామందిలో విటమిన్-బి12 లోపం కనిపిస్తున్నది. దీన్ని అధిగమించడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి. శాకాహారుల్లో ఈ లోపం అధికంగా ఉండటానికి కారణం ఏమిటి?
Vitamin B12 | ఇటీవలి కాలంలో చాలామందిలో విటమిన్ బి12 లోపం కనిపిస్తున్న మాట వాస్తవమే. ఇది మాంసం, గుడ్లలో ఎక్కువగా దొరుకుతుంది. పాలలోనూ కొద్ది మోతాదులో ఉన్నా అధికంగా మాంసాహారంలో లభించడం వల్ల శాకాహారుల్లో విటమిన్ బి12 లోపం ఎక్కువగా కనిపిస్తుంది. అట్రోఫిక్ గ్యాస్ట్రయిటిస్, క్రాన్స్ డిసీజ్లాంటి జీర్ణ సంబంధ వ్యాధులతోపాటు కొన్ని రకాల ఆటోఇమ్యూన్ జబ్బుల వల్ల శరీరం బి12ని సరిగ్గా శోషించుకోలేదు. దీనికి సంబంధిత డాక్టర్ల పర్యవేక్షణలో లోపాన్ని సరిచేసుకోవాల్సి ఉంటుంది.
ఇక సాధారణ పరిస్థితుల్లో విటమిన్ బి12 లోపాన్ని అధిగమించాలన్నా, సమస్య రాకుండా చూసుకోవాలన్నా సరైన మోతాదులో మాంసం, చేపలు, గుడ్లు, పాలు తీసుకుంటూ ఉండాలి. పాల ఉత్పత్తుల్లోనూ ఇది దొరుకుతుంది. అలాగే విటమిన్ బి12 ఫోర్టిఫైడ్ ఆహారాన్ని తినాలి. అల్పాహారం కోసం వాడే తృణధాన్యాలు, బ్రెడ్, న్యూట్రిషనల్ ఈస్ట్ తదితరాల్లో ఇది ఫోర్టిఫైడ్ రూపంలో దొరుకుతుంది. వృక్ష సంబంధ పదార్థాల నుంచి తీసిన పాలలోనూ ఇది అధిక మోతాదులో ఉంటుంది.
సోయా పాలు, చీజ్, బఠాణీలు, యోగర్ట్లాంటి వాటినుంచి కూడా దీన్ని పొందొచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా చద్దన్నం విటమిన్ బి12 దొరికే మంచి ఆహార పదార్థం. సప్లిమెంట్ల రూపంలోనూ దీన్ని తీసుకోవచ్చు. మరీ అవసరం అనుకున్న సందర్భాల్లో ఇంజెక్షన్ల రూపంలోనూ దీన్ని ఇస్తారు. అయితే, ఆల్కహాల్ అధికంగా తీసుకుంటే శరీరం బి12ని సరిగ్గా శోషించుకోలేదు. మధుమేహులకూ ఈ సమస్య ఉంటుంది. అందుకే మద్యపానానికి దూరంగా ఉండి, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటే బి12 లోపాన్ని అధిగమించడం తేలికవుతుంది.
– మయూరి ఆవుల
న్యూట్రిషనిస్ట్
Mayuri.trudiet@ gmail.com