మొదటి చిత్రాన్నే ఇంటి పేరుగా మలుచుకున్న మేటి నటి ‘షావుకారు’ జానకి. ఏడు దశాబ్దాల సినిమా కెరీర్లో కథానాయికగా, చెల్లిగా, వదినగా, తల్లిగా, బామ్మగా ఎన్నో మరపురాని చిత్రాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు పోషించారు. నటిగా ఆ తరం, ఈ తరం అభిమానం చూరగొన్న ఆమె తాజాగా ‘పద్మ శ్రీ’ పురస్కారాన్ని అందుకున్నారు. తొమ్మిది పదుల వయసులోనూ అంతే చలాకీగా మాట్లాడుతారు. అడపాదడపా ప్రేక్షకులను పలకరిస్తూనే ఉన్నారు.
మామయ్యను ఆటపట్టించే కోడలు.బావ దగ్గరికి వచ్చేసరికి సిగ్గుల మొగ్గయి పోయే మరదలు. తొలిచిత్రం ‘షావు కారు’లో కనుసైగలతో పెను భావాలు
పలికించిన ఆ నటి తెలుగువారి.. ‘షావుకారు జానకి’.
‘చిటారుకొమ్మన మిఠాయి పొట్లం చేతికందదేం గురుడా!’ అంటూ ది గ్రేట్ గిరీశం ఆట పట్టిస్తున్నా అర్థం చేసుకోలేని కన్యాశుల్కం బుచ్చమ్మ వదినను మరచి
పోగలమా! పరిమితమైన హావభావాలతో అపరిమితమైన అమాయకత్వాన్ని పండించిన ఆమె నటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
‘డాక్టర్ చక్రవర్తి’లో పొగరుబోతు భార్యగా, ‘ముందడుగు’లో తెలివైన కార్మికురాలిగా, ‘రోజులు మారాయి’లో రైతు ఇల్లాలిగా, ‘మంచి మనసులు’ అంధురాలిగా, ‘నాగుల చవితి’లో పగబూనిన నాగదేవతగా.. ఎన్నో చిత్రాల్లో దిగ్గజాల సరసన మహాద్భుతంగా నటించిన మేటి నటి ‘షావుకారు’ జానకి. ‘అక్కా చెల్లెలు’ సినిమాలో ‘పాండవులు పాండవులు తుమ్మెద’ అంటూ ఆమె వేసిన చిందులు వినోదాల విందులు పంచాయి.
‘సంసారం ఒక చదరంగం’లో చిలుకమ్మ పాత్ర ఆమెలోని నటనా వైదుష్యానికి పరాకాష్ఠ. కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దాదాపు 400 చిత్రాల్లో నటించారు షావుకారు జానకి. సుమారు 72 ఏండ్ల సినిమా కెరీర్లో ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న ఆమె ‘పద్మ శ్రీ’ రావడంపై స్పందిస్తూ.. “నా చలనచిత్ర జీవితంలో ఎన్నో పురస్కారాలు అందుకున్నాను. భారత ప్రభుత్వం ప్రకటించిన ‘పద్మ శ్రీ’ వాటిలో ప్రత్యేకం. ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను” అని చెప్పుకొచ్చారు. “చాలామంది అభినందనలు చెబుతున్నారు. 90వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన నాకు ఈ అవార్డు మరింత ఉత్సాహాన్ని, ఆనందాన్ని ఇచ్చింది” అన్నారు షావుకారు జానకి. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ తదితర భాషల్లో నటించిన ఈ నట దిగ్గజానికి మనమూ అభినందనలు చెబుదాం.