Josh Talks | ప్రతి సక్సెస్ స్టోరీ సెలెబ్రిటీలదే ఎందుకు కావాలి? స్ఫూర్తినిచ్చే సామాన్యుడి కథ అయినా కావచ్చు. ఎత్తుపల్లాలు, మలుపులు, గెలుపులు సినిమా కథల్లోనేనా? చుట్టూ ఉన్న జీవితాల్లోనూ కనిపించొచ్చు. అలాంటి సాధారణ మనుషుల అసాధారణ జీవిత గాథల్ని వాళ్లతోనే చెప్పిస్తున్నది ‘జోష్ టాక్స్’. ప్రతి కథా ఓ ఆశావాద సంకేతమే. ఎంతటి నిస్పృహలో ఉన్నవారికైనా బతుకుమీద మమకారం పుట్టితీరుతుంది. ఈ వేదిక సృష్టికర్త సుప్రియా పాల్ లక్ష్యమూ అదే.
ఇంటర్ తర్వాత చదువు కొనసాగించడానికి అష్టకష్టాలు పడిన ఓ పల్లెటూరి పిల్ల పీహెచ్డీ పూర్తిచేసింది. ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించింది. ఇది గెలుపు కాదా? పుట్టుకతోనే కంటిచూపు లేని శ్రావ్య భవిష్యత్తు మీద చుట్టుపక్కల వాళ్లకు, స్నేహితులకు ఎప్పుడూ పెదవి విరుపులే. కానీ ఆమె మంచి గాయనిగా పేరు తెచ్చుకోవడమే కాదు, ఐఎస్బీలో సీటు కూడా సాధించింది. ఉబెర్, వెల్స్ఫార్గోలాంటి మల్టీనేషనల్ సంస్థల్లో ఉద్యోగం చేయగలిగింది. ఇది విజయం కాదా? బీటెక్ పూర్తి చేసిన సంవేద్ 43 సార్లు ఉద్యోగానికి రిజెక్ట్ అయ్యాడు. చివరికి, బతుకు మీద విరక్తితో హిమాలయాలకు వెళ్లిపోయాడు. కానీ తిరిగొచ్చి ట్రెక్సమ్ పేరిట ట్రావెల్ సంస్థను స్థాపించాడు. దాన్ని విజయవంతంగా నడిపిస్తున్నాడు. ఇది స్ఫూర్తిదాయకం కాదా? ఏరికోరి చేసుకున్న ఎన్నారై భర్త పెండ్లయిన పదిహేను రోజులకే వదిలేసి వెళితే, ఐఏఎస్‌గా మారి జీవితాన్ని పునర్నిర్మించుకున్న అమ్మాయి కథ, వ్యవసాయ కుటుంబంలో కష్టాలను చవిచూసి పాతికేండ్లకే ఇరవైకోట్ల టర్నోవరు కలిగిన నిర్మాణ సంస్థను నడుపుతున్న అబ్బాయి గాథ.. ప్రతి పోరాటం ఓ స్ఫూర్తి కెరటం, ప్రతి విజయం వేయి ఏనుగుల బలం. జోష్టాక్స్ తన చానెల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో పడిలేచిన కెరటాల కథే.
జోష్ టాక్స్.. ఇండియన్ టెడెక్స్లాంటిది. విద్య, వైద్యం, వ్యాపారం, సంఘసేవ, రాజకీయం, క్రీడలు, కళలు.. ఇలా విభిన్న రంగాల విజేతల మలుపు కథలు ఉంటాయి. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, గుజరాతీ.. మొత్తం పది భాషల్లో వీడియోలను రూపొందిస్తున్నారు. అన్ని భాషలకూ కలిపి కోటి అరవై లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇప్పటిదాకా మూడువేల పైచిలుకు వీడియోలు అప్లోడ్ చేశారు. ఇందులోని కంటెంట్‌ను రోజుకు లక్ష మంది చూస్తున్నారు. వీరిలో ఎనభై శాతం 18 నుంచి 34 ఏండ్ల వాళ్లే. జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే తపన కలిగిన యువతను అమితంగా ఆకట్టుకుంటున్నాయి ఈ వీడియోలు. జోష్టాక్స్ లక్ష్యమూ అదేనంటారు సుప్రియ. ‘నేను ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్న రోజుల్లో ఒక కార్యక్రమంలో శోభిత్ బంగాను కలిశాను. చాలా సేపు మాట్లాడుకున్నాం. ‘పెద్దగా చదువుకోని కుటుంబాల నుంచి విద్య కోసం, ఉద్యోగాల కోసం నగరాలకు వచ్చే యువతకు దిశానిర్దేశం చేసేవాళ్లుంటే బాగుంటుంది కదా’ అనిపించింది ఇద్దరికీ. ముందుగా ఢిల్లీలోని విద్యార్థుల కోసం ఏదైనా చేయాలనుకున్నాం. అలా 2014లో మొదటి ఈవెంట్ జరిగింది. పదిమంది హాజరయ్యారు. అయితేనేం, మంచి ప్రచారం వచ్చింది. ఆ స్ఫూర్తితో ముందుకెళ్లాం. జీవితంలో రకరకాల ఒడుదొడుకులను తట్టుకొని బలంగా నిలబడిన వ్యక్తుల కథలను వాళ్ల నోటితోనే చెప్పించాం. ఆ వీడియోలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ కొత్త ఉత్సాహాన్ని నింపాలన్న ఉద్దేశంతో మా వీడియో చానెల్‌కు ‘జోష్ టాక్స్’ అని పేరు పెట్టాం. మా ప్రయత్నం చాలామందిని ఆకట్టుకుంది. జీవిత కథలు అయినా సరే, సుదీర్ఘంగా ఉంటే ఎవరూ చూడరు. అందుకే మేం అప్లోడ్ చేసే వీడియోల నిడివి ఆరు నుంచి పన్నెండు నిమిషాలే ఉంటుంది.
యువత నైపుణ్యాలను మెరుగుపరిచే ప్రయత్నంలో ‘జోష్ స్కిల్స్’ అనే యాప్‌ను రూపొందించాం. కొవిడ్ సమయంలో ఇంట్లో కూర్చునే కొత్త విషయాలు నేర్చుకునేందుకు వీలుగా డిజైన్ చేసిన ఈ యాప్‌లో.. స్పోకెన్ ఇంగ్లిష్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కంప్యూటర్ బేసిక్స్ లాంటి రకరకాల నైపుణ్యాలకు సంబంధించిన కంటెంట్ ఉంటుంది. ఇప్పటికే 20 లక్షల డౌన్లోడ్లు అయ్యాయి. గూగుల్, ఫేస్బుక్, ఐక్య రాజ్య సమితిలాంటి సంస్థలతో కలిసి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఆన్లైన్, ఆఫ్‌లైన్ ప్రోగ్రామ్‌లు నిర్వహిస్తున్నాం. పొదుపు-మదుపు పట్ల అవగాహన కల్పించేందుకు ‘జోష్ మనీ’ అనే చానల్‌ను ప్రారంభించాం. మా పనులకు గుర్తింపుగా భారత రాష్ట్రపతి చేతుల మీదుగా మీడియా ఎక్సలెన్సీ అవార్డు అందుకున్నాం. ఫోర్బ్స్ లిస్టులోనూ చోటు దక్కించుకున్నాం. మా రీసోర్స్ టీమ్ క్షేత్ర స్థాయిలో ఆసక్తికర కథనాలను గుర్తిస్తుంది. వారిదే మా సంస్థలో కీలక పాత్ర. ఎంత మంచి జీవిత కథ దొరికితే అంత బలంగా స్ఫూర్తి నింపవచ్చని మా ఆశ’ అని చెబుతారు సుప్రియ. కష్టాల్లో ఉన్నవారికి ఆశావాదం, అపజయాల్లో కూరుకుపోయినవారికి స్ఫూర్తి నినాదం.. ఈ రెండూ చాలు! జీవితం మారిపోతుంది. అపజయం పారిపోతుంది. ఆనందం చిగురిస్తుంది.
… లక్ష్మీహరిత ఇంద్రగంటి
“బెంగాల్ టైగర్, ఖడ్గమృగాలను చూస్తేనే పారిపోతాం.. ఈ సివంగులైతే వాటికే సెక్యూరిటీ”