పచ్చబొట్టు పురాతన కళ. ఆదివాసీల సంప్రదాయం. ప్రపంచం మారింది. పద్ధతులూ మారుతున్నాయి. ‘తోటి తెగ’ మాత్రం ఇప్పటికీ పచ్చబొట్టుతోనే ప్రయాణిస్తున్నది. ఆ పురాతన తెగ సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన అవసరాన్ని గుర్తించింది.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- హైదరాబాద్. ఆ ప్రయత్నంలో భాగంగా గుడిహత్నూర్ మండలం తోషం గ్రామ పరిధిలోని తోటిగూడలో ప్రొఫెసర్ దీపక్ జాన్ మాథ్యూ నేతృత్వంలో ఓ పరిశోధన బృందం పర్యటించింది. అంతేకాదు, ఆదిలాబాద్ జిల్లాలోని ‘తోటి తెగ’ కళలపై డాక్యుమెంటరీ తీస్తున్నది. ఈ నేపథ్యంలో పచ్చబొట్టుతో అనుబంధం గురించి ఆ గిరిజన మహిళల అంతరంగం..
ఇది వారసత్వంగా వస్తున్న కళ. నరాల నొప్పులకు మంచి వైద్యం. చేతులూకాళ్లూ ఉబ్బినవాళ్లు, నడవలేనివాళ్లు.. మా దగ్గరికి వస్తుంటారు. పచ్చబొట్టు చికిత్స మీద నమ్మకం అలాంటిది. వాస్తవానికి వాళ్లిచ్చే పైసలు మాకు దేనికీ సరిపోవు. డబ్బుకు ఆశపడి పనిచేస్తే విద్యకు అన్యాయం చేసినట్లే. అందుకే పదిచ్చినా పరకిచ్చినా తీసుకుంటాం. మా లక్ష్యం ఒక్కటే. తాతముత్తాతల నుంచి వస్తున్న కళ బతకాలి. దానివల్ల పదిమందికీ మంచి జరగాలి. పచ్చబొట్టు వేయడమే ఓ పవిత్ర కార్యం. రోజంతా సూదులను బాగా కాల్చుతాం. రెండు రెండు సూదులు జత చేస్తాం. ఒకరికి వాడినవి మరొకరికి ఉపయోగించం.
సూదులను ఉల్లి గడ్డల్లో కుచ్చి రోజంతా అలానే ఉంచుతాం. దీనివల్ల సూదుల్లోని విషగుణం సచ్చిపోతుంది. పుండ్లు కావు. దురద పెట్టదు. మోకాళ్లకు, మోచేతులకు, నొసళ్లకు, వీపుమీద ఎక్కువగా పచ్చబొట్లు వేస్తుంటాం. కాళ్ల నొప్పులు ఉన్న దగ్గర నిలువు గీతలు గీసి పొడుస్తాం. పొడుగు గీతలు నడుముకు, అడ్డు గీతలు కాళ్లూచేతులకూ వేస్తాం. పిల్లలు లేని వాళ్లకు ‘పూషకొక్కువా’ అనే పచ్చబొట్టు వేస్తాం. నొసళ్లకు సూర్యచంద్రుల గుర్తులు వేస్తాం. వాస్తవానికి ఇవి మా ఇండ్లలో పెండ్లి పిల్లలకు వేస్తుంటాం. పచ్చబొట్టు లేనిదే మనువు జరుగదు. చేతికి జానెడు పొడుగు పొడిచే పచ్చబొట్టును ‘మనగడి’ అంటారు. దీన్ని ఆరోగ్య సమస్యలున్నవారికి వేస్తాం. మనగడి లేకుండా నైవేద్యం పెడితే దేవరకు అందదని మా నమ్మకం. ఆ పచ్చబొట్టుకు అంత విలువ. డంగ్, పుండకె.. అంటే చేతినిండా పచ్చబొట్టు వేయడం. ఆ సమయంలో నొప్పి అనిపించినా ఓర్చుకోక తప్పదు. పచ్చబొట్టు పసరు తయారీలో ఆముదం, ఇతర చెట్ల రసాలను ఉపయోగిస్తాం. అవసరమైన మూలికలను అడవంతా జల్లెడపట్టి తెచ్చు కుంటాం.
వారసత్వంగా..
కిక్రీ వాద్యం మా జీవితంలో భాగం. దాన్ని ఉపయోగించి మా దేవతల పాటలు పాడుకుంటాం. ఏటా దీపావళి తర్వాత గ్రామగ్రామానా పర్యటిస్తూ కిక్రీ వాయిస్తాం. జానపదాలూ పాడతాం. మా అమ్మమ్మలు మా అమ్మలకు నేర్పిస్తే, మా అమ్మలు మాకు నేర్పిన పాటలు ఇవి. మా పిల్లలు మాత్రం నేర్చుకోవడం లేదు. అదే మా చింత. మా కళల ఆద్యుల గురించి, దేవతల గురించి కథలు చెబుతూ మాకు పచ్చబొట్టు విద్యను నేర్పేవారు. వెనుకటి రోజుల్లో మమ్మల్ని ఒక డాక్టర్ లెక్క చూసేవాళ్లు. అయితే ఈ మధ్య కాలంలో ‘టాటూ కల్చర్’ పెరిగిపోయింది. వాళ్ల వల్ల మాకు ఉపాధి తగ్గిపోయింది. అవి అంత సురక్షితమా అంటే అదీ లేదు. మొత్తంగా రసాయనాలు వాడతారు. దీంతో లేనిపోని సమస్యలు వస్తున్నాయి. మా పచ్చబొట్లతో ఇప్పటి వరకూ ఎలాంటి ఇబ్బందులూ రాలేదు. కాబట్టే మహారాష్ట్ర నుంచీ వస్తుంటారు. ఈ కళ మాకు అమ్మలాంటిది. బాధ్యతతో నేర్చుకుంటాం. మా తరమే పచ్చబొట్లకు ఆఖరు. ఇక అంతరించినట్టే. ఆ పరిస్థితి రాకుండా కాపాడమని దేవుణ్ని ప్రార్థిస్తున్నాం.
ఆయా జాతుల సంప్రదాయ వృత్తులను కాపాడుకోవడం ద్వారా, అంతరించి పోతున్న జాతులనూ కాపాడుకోగలం. పచ్చబొట్టునే ఉపాధి మార్గంగా ఎంచుకున్న తోటి మహిళల జీవన విధానం చాలా ఆసక్తికరం. వాళ్లు గోండులపైనే ఆధారపడి బతుకుతారు. వాళ్ల పచ్చబొట్టు డిజైన్లను, పాడుకునే పాటలను రికార్డు చేస్తున్నాం. దీన్ని ఆదివాసీలు ఒక థెరపీగా కూడా భావిస్తారు. కానీ ఆ ప్రాచీన తెగ క్రమంగా అంతరించిపోతున్నది. తాజా జనాభా లెక్కల ప్రకారం దాదాపు ఐదు వేలమంది తోటీలు మాత్రమే ఉన్నారు.
– బీఎస్ మూర్తి, డైరెక్టర్-ఐఐటీహెచ్