సైకిల్ అంటే చిన్నప్పటి కోరిక ఎంత మాత్రం కాదు. నాలుగు దశాబ్దాల కిందట మగపెండ్లివారు సగర్వంగా అడిగే కట్నకానుక కూడా కాదు. మన అభివృద్ధి, సుస్థిరత, ఆరోగ్యం దిశగా అదో అద్భుతమైన పరికరం. మన శారీరక శ్రమే దానికి ఇంధనం. చెమటోడ్చి తొక్కే కొద్దీ శక్తినిచ్చే సాధనం సైకిల్. సవాల్లేని సైకిల్ సవారీ వల్ల కలిగే ప్రయోజనాలు ఇవి..
కాలుష్య రహితం: రవాణా సాధనాల్లో సైకిల్ ఎలాంటి ఇంధనం లేకుండానే నడుస్తుంది. కాలుష్యం ఉండదు. ట్రాఫిక్ జామ్స్ ఉండవు. ఇంధన ఖర్చులూ ఉండవు.
చవకైన రవాణా: సైకిళ్లు రవాణా ఖర్చులను పూర్తిగా తొలగిస్తాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పిల్లలు బడికి వెళ్లాలన్నా, రైతులు పొలాలకు వెళ్లాలన్నా, కూరగాయల్లాంటి పంటలను మార్కెట్లకు తరలించడానికి సైకిళ్లనే ఆశ్రయిస్తుంటారు. చిన్నాచితక పనులకు వెళ్లే వాళ్లకు కూడా ఇవే ఖర్చులేని రవాణా సదుపాయం.
శారీరక మానసిక ఆరోగ్యం: సైకిల్ తొక్కడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శారీరక బలం పెరుగుతుంది. క్యాలరీలు కరిగిపోతాయి. తాజా గాలిలో, ఆరుబయట ఏకాంతంగా సైకిల్ తొక్కుతూ ఉంటే మనసుకు ఆహ్లాదంగా, ఉల్లాసంగా, ఉపశమనంగా ఉంటుంది.
సుస్థిరం: పెట్రోలు, డీజిల్ వాడకం వల్ల కాలుష్యం పెరుగుతున్నది. వాతావరణ మార్పులు తలెత్తుతున్నాయి. ఇలాంటప్పుడు దగ్గరి ప్రయాణాలకు సైకిల్ మంచి పరిష్కారం.
జీవనాడి: ఇప్పటికీ ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో చాలామందికి సైకిల్ జీవనాడి. వైద్య సహాయం పొందాలన్నా, పిల్లలు బడికి వెళ్లాలన్నా, పెద్దలు ఉద్యోగాలు చేసుకోవాలన్నా గమ్యం చేరుకోవడానికి సైకిల్ ఖర్చులేని వాహనం.