పాలకూర, తోటకూర, మెంతికూర, పొనగంటి కూర ఇవన్నీ మనకు తెలిసిన ఆకుకూరలు. పొలాల్లో విత్తనాలు చల్లితే ఇవి సాగవుతాయి. కానీ, విత్తనాలు చల్లడం, నీరు పెట్టాల్సిన అవసరం లేకుండానే పంటపొలాల్లో కలుపు మొక్కలుగా పెరిగే ఆకుకూరలు కూడా చాలా రకాలే ఉన్నాయి. సహజ సిద్ధంగా పంట పొలాల్లో పెరిగే జొన్న చెంచాలి కూర, ఎలుక చెవుల కూర, ఆడవి సోయ కూర, తెల్లగర్జల కూర, బంకటి కూర, తడక దొబ్బుడు, పప్పుగునగ కూర, ఉత్తరేణి, తిమ్మికూర ఇలాంటి ఎన్నో ఆకుకూరలు పంట పొలాల్లో కలుపు మొక్కలుగా పెరుగుతాయి. తెలిసిన వారు వీటిని బేషుగ్గా వండుకొని తింటారు కూడా. జహీరాబాద్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఈ కలుపు కూరలను పోషకాల గనులుగా భావించి తింటుంటారు.

ఈ ప్రాంతంలోని పంటపొలాల్లో సహజ సిద్ధంగా లభించే 160కి పైగానే ఉన్న ఆకుకూరలను జాతీయ పోషకాహార సంస్థలో పరీక్షలు చేయించగా, వీటిలో అధిక మొత్తంలో పోషకాలు ఉన్నాయని తేలింది. ఈ ఆకుకూరల ప్రత్యేకతను చాటేందుకు డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ- కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ‘సాగు చేయని ఆకుకూరల పండుగ’ను ఏటా నిర్వహిస్తున్నారు.

ఈ వేడుకలో ఆయా ఆకుకూరలు వండే విధానం, తినడం వల్ల కలిగే ప్రయోజనాలను నిపుణులతో తెలియజేస్తారు. జహీరాబాద్ మండలం దిడ్గి గ్రామ శివారులోని డీడీఎస్-కేవీకే కేంద్రంలో ఆదివారం ఒక్కరోజు ఉత్సవం జరగనుంది. ఈ క్రతువుకు పలువురు శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులు హాజరవుతారు. కాలానుగుణంగా దొరికే ఆకుకూరలు వండుకొని తింటే పోషకాలు సమృద్ధిగా అందుతాయని, ఇవి అద్భుత ఔషధాలని డీడీఎస్ మహిళా సంఘాల ప్రతినిధులు, మహిళా రైతులు పేర్కొంటున్నారు.
– గున్నాల విట్టల్, జహీరాబాద్