పోతన భాగవతం దశమ స్కంధం పూర్వభాగం, ‘రుక్మిణీ కృష్ణ కల్యాణ’ ఘట్టంతో అట్టహాసంగా, అపూర్వంగా- అపురూపంగా సమాప్తమవుతుంది. రుక్మిణీ కృష్ణ కల్యాణం జీవ జగత్ కల్యాణ సంధాయకం. శుక యోగి రాజ యోగి పరీక్షిత్తుతో- పృథివీపతీ! ఆనర్త దేశ ప్రభువు రైవతుడు బ్రహ్మదేవుని ప్రేరణచే తన పుత్రిక రేవతిని బలరామస్వామి కిచ్చి వివాహం జరిపించాడని నీకు ముందే- నవమ స్కంధంలో వివరంగా వినిపించాను.
మ॥ ‘ఖగనాథుండమరేంద్రు గెల్చి సుధమున్ గైకొన్న చందంబునన్
జగతీనాథుల జైద్య పక్ష చరులన్ సాళ్వాదులం గెల్చి భ
ద్రగుడై చక్రి వరించె భీష్మక సుతన్ రాజీవీగంధిన్ రమా
భగవత్యంశ భవన్ మహాగుణమణిన్ బాలామణిన్ రుక్మిణిన్’.
బలరామునికి పరిణయం కాగానే, పూర్వం ఖగనాథుడు- పక్షి రాజైన వినతాసుతుడు గరుత్మంతుడు సమరంలో అమరేంద్రుని గెలిచి సుధను- అమృతాన్ని సాధించినట్లు, పన్నగశాయి హరించేది దేశాధిపతి ఐన శిశుపాలుని, వాని పక్షం వహించిన సాళ్వుడు మొదలైన క్షుద్ర భూపతులను ఓడించి భద్రగుడై- శోభన మూర్తియై, భీష్మక మహారాజు పుత్రిక భైష్మి- రుక్మిణిని వరించి, హరించి పాణిని గ్రహించాడు. ఆ రుక్మిణి రాజీవగంధి- పద్మం వంటి దేహ పరిమళం కలది. ఇది సామాన్యార్థం. రాజీవం అనగా నారాయణ మంత్రమని కోశార్థం. రాజీవగంధి అనగా నారాయణ మంత్రార్థమే శరీర సుగంధంగా కలిగిన నారాయణి- మహాలక్ష్మి అని పరమార్థం! రమా భగవత్యంశ భవ- సాక్షాత్ పరమేశ్వరి ఐన లక్ష్మీదేవి అంశతో ఆవిర్భివించినది. మహాగుణమణి- దీనిని, అర్థం చెప్పడం సాధ్యం కాని సమాసమని అన్నారు విశ్వనాథ వారు. శమము, దమము మొదలైన మహా- ఆత్మీయ గుణాలే మణులు. అట్టి మహా గుణమణులు కలది, మహా గుణవతీమతల్లులలో శ్రేష్ఠురాలు. బాలామణి- కన్నెలలో మిన్న. సుధమున్ గైకొన్న చందంబునన్- ఈ ఉపమానంలో రుక్మిణి సుధవంటిది- అనగా అమృత స్వరూప. ‘స్వధాం సుధాం, పద్మినీం, పద్మగంధినీం’ అన్న మహాలక్ష్మి నామాలు ఇచ్చట అనుంధేయాలు. ‘వైనతేయశ్చ పక్షిణాం’ (గీత)- పక్షులలో గరుత్మంతుడు శ్రీకృష్ణ పరమాత్మ విభూతి.
ఇలా శుకయోగి పలుకగా పరీక్షిన్నరేంద్రుడు ఇట్లు ప్రశ్నించాడు.. మునీంద్రా! మునుపు గోవిందుడు స్వయంవరానికి వచ్చి భైష్మి- భీష్మక సుతను రాక్షస వివాహ (రాక్షసో యుద్ధ హరణాత్) విధానంతో గ్రహించాడని చెప్పావు. శ్రీకృష్ణుడు ఒంటరిగా వచ్చి సాళ్వాది తుంటరులను జయించి ఆ రాకుమారిని జంటగా చేకొని ఇంటికి ఎలా చేరగలిగాడు? అంతేకాక బ్రాహ్మణోత్తమా!
శా॥ ‘కల్యాణాత్మకమైన విష్ణుకథ లాకర్ణించుచున్ ముక్తవై
కల్యుండెవ్వడు తృప్తుడౌనవి వినంగా గ్రొత్తలౌచుండు సా
కల్యం బేర్పడ భూసురోత్తమ! యెఱుంగం బల్కవే రుక్మిణీ
కల్యాణంబు వినంగ నాకు మదిలో గౌతూహలం బయ్యెడిన్’-
‘అభయమిచ్చే శుభదాయకాలైన విష్ణు కథలు పటుతరం- శ్రద్ధగా వింటేచాలు, కటువైన మనో వికారాలు- అశుభ వాసనలన్నీ మటుమాయమైపోతాయి. అలా మనసులోని మలదోషాలు తొలగిపోయిన వాడెవడూ ఇలలో ఆ గాథలు వింటూ తృప్తి చెందడు. ఇక చాలని అనడు. ఏల? ఆ కథలు నిత్య నూతనాలు- విన్నకొద్దీ ఎప్పటికప్పుడు సరికొత్తగా ఉంటాయి. ‘రుక్మిణీ కల్యాణం’ కథ వినాలని నాకు చాలా కుతూహలం- ఉబలాటంగా ఉంది. కాన సమగ్రంగా వినిపించు’. సహజ పండితుడు కవన శిల్పి పోతన చెక్కిన రసవత్తరమైన అనేక లసత్తర- జాజ్వల్యమాన మహత్తర కళాఖండాలలో ‘రుక్మిణీ కల్యాణం’ ఒకటి. శ్రవణ భక్తుడైన ఉత్తరా తనయుడు పరీక్షిత్తు కథా శ్రవణం పట్ల తనకున్న ఉత్సుకతని పైవిధంగా కనపరచాడు. శ్రవణానికున్న శక్తిని గ్రహించిన ఏ వ్యక్తికైనా ఎంత విన్నా తనివి తీరదు. విన్నకొద్దీ వాని శ్రవణేచ్ఛ వృద్ధి పొందుతుందని మనవి. పూర్వ పుణ్యం లేకపోతే శ్రవణేచ్ఛ కలుగదు. ‘నరాస్తే పశవః ప్రోక్తా యేషాంన శ్రవణాదరః’- శ్రవణం పట్ల శ్రద్ధాభక్తులు లేని మనుష్యులు పశు సమానులని స్మృతి. ‘అనఘా! ఆసక్తితో ఆలకించే రసజ్ఞ- భావుక హృదయులకు ‘స్వాదు స్వాదు పదే పదే’- మాటమాటకు అధిక మధురమైనవి విష్ణు కథలు. యోగ యాగాదులతో మేము తృప్తులం. కాని, కథా శ్రవణంలో అతృప్తులం’ అని అంటారు సూతమునితో శౌనకాది మహర్షులు.
క॥ ‘భూషణములు సెవులకు బుధ
తోషణము లనేక జన్మ దురితౌఘ విని
శ్శోషణములు మంగళతర
ఘోషణములు గరుడ గమను గుణ భాషణముల్’
‘గురుదేవా! గరుడగమనుని- నీలవర్ణుని వెన్నుని గుణగణాలు వర్ణించే సంభాషణలు కర్ణాభరణాలు- చెవులకు అలంకారాల వంటివి. అవి బుధులకు (‘బుధా భావ సమన్వితాః’- గీత) భక్తి భావ మండితులైన పండితులకు నిండైన ఆనందాన్ని అందించేవి. పలు జన్మల పాప సమూహాలను రూపుమాపేవి. అవి వాస్తవంగా సకల శుభ వ్రాతా- సమూహాలకు భేరీ మృదంగ ఘోషణాలు- మ్రోతలు!’ ‘విష్ణు కథాః నిత్య నూతనాః’- ‘అవి వినంగా గ్రొత్తలౌచుండు’.. ఆహా! ఎంత అందమైన అనువాదం. ఐనా, డెందంలో తృప్తి- ఆనంద పడక, శ్రవణ భక్తి యెడల తనకున్న సడలని శ్రద్ధాసక్తులను పరీక్షిత్తు ముఖతః వీనుల విందైన పై కంద పద్యంలో పొందుపరచకుండా ముందుకు సాగలేకపోయాడు భక్త కవి చందురుడు పోతన్న.
శుక ఉవాచ- రాజా! విను, కుండిన నగరం రాజధానిగా గల విదర్భ దేశానికి ప్రభువు భీష్మకుడు. అతడు మహావీరుడు. దొడ్డ- గొప్పరాజు. ఆయనకు ఐదుగురు పుత్రులు. పెద్దవాడు రుక్మి అనయుడు- నీతిమాలినవాడు. రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మమాలులు అతని అనుజులు. ఈ ఐదుగురికి కడగొట్టు చెల్లెలై భీష్మకుడికి ఒక కుమార్తె కలిగింది. ఆమె ‘రుక్మిణి’ అను నామధేయంతో ప్రసిద్ధి గాంచింది. ‘రుక్మము’ అనగా హిరణ్యం- బంగారం. హిరణ్యం పరబ్రహ్మకు ప్రతీకం. ‘హిరణ్యవర్ణాం హరిణీం’- హిరణ్యవర్ణ- మేలిమి బంగారు చాయ కలిగిన రుక్మిణి పరబ్రహ్మను తెలియజేయు బ్రహ్మవిద్యా స్వరూపిణి. భీష్మకుడు దొడ్డరాజు. ఏమిటా దొడ్డతనం- పెద్దరికం? అంటే స్థితప్రజ్ఞత్వం, బ్రహ్మనిష్ఠత్వం! భీష్మకుడు బ్రహ్మవేత్త కాకపోతే రుక్మిణికి- బ్రహ్మవిద్యకు జనకుడు కాగలడా?
‘చంద్రాం చంద్ర సహోదరీం’- శుక్లపక్షంలోని చంద్రరేఖ వలె రుక్మిణి దినదిన ప్రవర్ధమానురాలవుతూండగా, ‘పుణ్యగంధాం సుప్రసన్నాం ప్రసాదాభిముఖీం ప్రభాం’- ఆమె ‘ప్రభా’- కాంతిరూపిణి కాన భీష్మకుని రాజమందిరం ఓజ- శోభాకాంతులతో తేజరిల్లింది. రుక్మిణీ బాల తన తొలి యౌవనంలో పితృగృహానికి వస్తున్న అతిథుల వలన అచ్యుతుని- కృష్ణుని రూప, బలాది సద్గుణాలను విని, తనకతడే తగిన వరుడని నిశ్చయించుకుంది.
క॥ ‘ఆ లలన రూపు బుద్ధియు
శీలము లక్షణము గుణము జింతించి తగన్
బాలారత్నము తనకి
ల్లాలుగ జేకొందుననుచు హరియుం దలచెన్’
‘ఆ బాలామణియగు రుక్మిణి రూపం, వివేకం, శీలం- సత్ప్రవర్తన, శుభ లక్షణాలు, సద్గుణాలు అన్నీ గ్రహించి ఆ లీలా మానుష విగ్రహుడు కూడా ఆమెను తనకు ఇల్లాలుగా స్వీకరించాలని నిర్ణయించుకున్నాడు’ రుక్మిణీ కృష్ణులు పరస్పరం ఇలా పెండ్లాడాలని తీర్మానించుకోగా…
ఉ॥ ‘బంధువులెల్ల గృష్ణునకు బాలికనిచ్చెదమంచు శేముషీ
సింధువులై విచారములు సేయగ వారల నడ్డుపెట్టి దు
స్సంధుడు రుక్మి కృష్ణునెడ జాల విరోధము జేసి మత్తపు
ష్పంధయ వేణినిత్తు శిశుపాలున కంచు దలంచెనంధుడై’.
శుకుడు- ‘రాజా! బుద్ధిమంతులైన బంధుజనులందరూ రుక్మిణిని కృష్ణునకిచ్చి వివాహం చెయ్యాలని ఆలోచనలు జరుపుతుండగా, వారందరినీ త్రోసిరాజని- తిరస్కరించి దుష్టుడు, అంధుడు- అజ్ఞాని ఐన రుక్మి మాత్రం కృష్ణుని పట్ల- ‘చోరుడని, జారుడని, రాజ్య హీనుడని’ మిక్కిలి విరోధం వహించి, మత్తపుష్పంధయ వేణిని- గండు తుమ్మెదల పిండు (బారు) వంటి నల్లని జుట్టు- జడగల, తన చెల్లెలిని తనకిష్టుడు, చేది రాజైన శిశుపాలునికి కట్టబెట్టాలని పట్టుబట్టాడు.’ బంధువులు శేముషీ సింధువులు- సముద్రమంత విశాలమైన బుద్ధి గలవారెలా అయ్యారు? అంటే, రుక్మిణీ కృష్ణులు ‘మాతాచ కమలాదేవీ పితాదేవో జనార్దనః’- ప్రకృతి పురుషులు, జగజ్జననీ జనకులైన లక్ష్మీనారాయణులు అన్న స్పృహ, స్ఫురణ ఉన్నవారు కనుక. రుక్మి దుస్సంధుడు- దుష్టమైన సంధ- ప్రతిజ్ఞ, సంయోగం కలవాడు. ఏమిటా ప్రతిన? చెల్లెలు రుక్మిణిని శిశుపాలునికి ఇస్తానని వానికి ఇచ్చిన పొల్లు- వ్యర్థమైన మాట. మరి ఆ దుష్టమైన సంయోగం- కూర్పు ఏమిటి? రుక్మిణికి ఇష్టం లేని శిశుపాలుని వరునిగా వరించడం.
శిశు, బాల శబ్దాలకు వేదాంత శాస్త్రంలో ‘అజ్ఞాని’ అని అర్థం. ‘శిశుపాలుడు’ అనగా అజ్ఞానులను పెంచి పోషించే మహామూర్ఖాగ్రేసర చక్రవర్తి అని తాత్పర్యం. రుక్మి అంధుడు- అనగా కళ్లు లేని కబోది అని కాదు. కళ్లున్నా సత్యాన్ని కనలేనివాడు. తత్తం ‘కృష్ణస్తు భగవాన్ స్వయం’- (కృష్ణుడు సాక్షాత్ భగవంతుడు) అని తెలియని వాడని అర్థం. బ్రహ్మవిద్యను అనధికారి, అయోగ్యునికి- అజ్ఞానికి సమర్పించబూనటమే రుక్మి అంధత్వం. సూర్యుని ప్రభావం గుడ్లగూబకేమి తెలుస్తుంది? పై ఉత్పలమాలకి మూల శ్లోకం ‘బంధూనా మిచ్ఛతాం దాతుం..’ చాల స్వభావోక్తిగా- వాచ్యార్థ ప్రధానంగా ఉంది. (రాజా! బంధువులంతా తన చెల్లిని నల్లనయ్యకు ఇవ్వాలని ఉవ్విళ్లూరు- తహతహలాడుచుండగా కృష్ణద్వేషి రుక్మి మాత్రం వారిని వారించి, ఆమెకు చైద్యు- శిశుపాలుని వరునిగా చేయ ఇచ్చగించాడు). కాని, అమాత్యుడు ఈ స్వభావోక్తిని గాఢమైన గూఢోక్తిగా మలచి పై ఉత్పల (కలువపూల) మాలలో స్వారస్యంతో కూడిన ఆధ్యాత్మిక- తాత్తికమైన అర్థ పరిమళాలు గుబాళింపజేశాడు.