మార్పు పేరుతో అడిగిన తీర్పు.. పట్నాన్ని పరేషాన్ చేస్తున్నది. పల్లెల్లో మళ్లీ పల్లేర్లు మొలిపిస్తున్నది. అతీగతీ లేని పాలకుల నిర్వాకంతో రాజధానిలో రియల్ ఎస్టేట్ ఢమాల్ అయింది. పల్లెలకు కరువును పరిచయం చేసింది. చివరికి ఆదివాసీ అతివలకు కష్టాలు తెచ్చిపెట్టింది. అందుకు ఉదాహరణే.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కౌటాగూడలోని మిల్లెట్ పరిశ్రమ. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటై.. లక్షల టర్నోవర్ సాధించిన చిరుధాన్యాల పరిశ్రమకు నేడు తాళం పడింది. స్వయం ఉపాధి పొందుతున్న గిరిజన మహిళల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
ఆసిఫాబాద్ మండల పరిధిలో ఉంటుంది కౌటాగూడ. 2021 ఆగస్టులో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.40 లక్షలతో ఇక్కడ మిల్లెట్ పరిశ్రమ (చిరుధాన్యాల పొడుల తయారీ కేంద్రం)ను ఏర్పాటుచేసింది. గిరిజన మహిళలకు ఉపాధి కల్పించడం, వారిని పారిశ్రామిక రంగంలో ముందుకు నడిపించడం కోసం దీన్ని ప్రారంభించింది. పరిశ్రమను నడిపించే విధంగా మహిళలకు శిక్షణ ఇవ్వడంతోపాటు వ్యాపార మెలకువలు, ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్ ఇలా అన్ని విషయాల్లోనూ నిపుణులతో శిక్షణ ఇప్పించింది. అలా శిక్షణ పొందిన
పదిమంది ఆదివాసీ బిడ్డలు సంఘంగా ఏర్పడి ప్రభుత్వ సాయంతో శ్రీ ఆంజనేయ డ్రై మిక్స్ ఇండస్ట్రీస్ పేరుతో మిల్లెట్ పరిశ్రమ ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ చిరుధాన్యాలను ప్రాసెస్ చేసి పొడులుగా మార్చి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఐటీడీఏ పరిధిలో ఉన్న ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో చదివే గిరిజన విద్యార్థులకు సరఫరా చేసేవాళ్లు.
ప్రభుత్వ తోడ్పాటు, గిరిజన మహిళల పట్టుదలతో.. ఈ చిరుధాన్యాల పరిశ్రమ త్వరితగతిన పురోగతి సాధించింది. ఏడాదికి సుమారు రూ.20 లక్షల టర్నోవర్ సాధించి ఔరా అనిపించుకుంది. పరిశ్రమ లాభాల్లోంచి పదిమంది మహిళలు రూ.15 వేల చొప్పున వేతనంగా తీసుకునేవారు. మిగిలిన లాభాన్ని పరిశ్రమ అభివృద్ధికి వెచ్చించేవారు. దాదాపు 20 రకాల చిరుధాన్యాలను కలిపి స్వీట్మిల్, మల్టీగ్రేన్, జవార్మిల్ మూడు రకాల ఉత్పత్తులు తయారు చేసేవారు. జిల్లాలో రక్తహీనత, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులు, గర్భిణులు, కిశోర బాలలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా వీటిని అందించేవారు. ఈ పరిశ్రమ ద్వారా జిల్లాలోని అన్ని ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలకు కావాల్సిన సంతులిత ఆహారం అందేది.
అదే సమయంలో మహిళా సంఘం ఆర్థికంగా బలపడింది. జొన్నలు, మినుములు, పల్లీ, జీలకర్ర, ఎర్రమిరప, ఆవాలు, ఉప్పు, కొర్రలు, పెసర, మిరియాలు, ధనియాలు, సజ్జలు, చక్కెర, బాదం, బొంబాయి రవ్వ, వసస్పతి, ఏలకులు, పసుపు తదితర 20 రకాల చిరుధాన్యాలు, పప్పులు, మసాలా దినుసులు మల్టీగ్రెయిన్ పొడులను ఉత్పత్తి చేసి.. మంచి లాభాలు గడించారు. స్థానికంగా దొరికే ధాన్యంతోపాటు గిరిజన సంహకార సంస్థ ద్వారా రాజమండ్రి నుంచి చిరుధాన్యాలను దిగుమతి చేసుకునేవారు. ప్రతి నెలా డిమాండ్‌కు తగ్గట్లుగా డ్రైమిక్స్డ్ పొడులను ఉత్పత్తి చేసి మహిళా సంఘటిత శక్తికి చిరునామాగా నిలిచారు.
మిల్లెట్ పరిశ్రమలో ఉత్పత్తి అయిన చిరుధాన్యాల పొడులను ఐటీడీఏ ఆధ్వర్యంలోని ఆశ్రమ పాఠశాలలకు, వసతి గృహాలకు సరఫరా చేశాం. వీటికి సంబందించిన బిల్లులను జీసీసీ ద్వారా మాకు చెల్లించాల్సి ఉంటుంది. గత కొద్ది నెలలకు సంబంధించిన బిల్లులు సుమారు 10 లక్షల 88 వేల రూపాయలు పెండింగ్‌లో ఉండటంతో ముడిసరుకులు కొనటం సాధ్యం కావటం లేదు. దీంతో పరిశ్రమను మూసి ఉంచాం. పెండింగ్ బిల్లుల విషయాన్ని ఐటీడీఏ పీఓ దృష్టికి కూడా తీసుకువెళ్లాం. త్వరలోనే బిల్లులు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. బిల్లులు వస్తేనే గానీ పరిశ్రమలో ఉత్పత్తులు తిరిగి ప్రారంభించలేం!
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మూడు ఉత్పత్తులు.. ఆరు ఆర్డర్లుగా సాగిపోయిన మిల్లెట్ పరిశ్రమకు కాంగ్రెస్ రాకతో కష్టకాలం దాపురించింది. బిల్లులు రాక నీరిగారిపోయింది. ఐటీడీఏ ద్వారా నిర్వహించే ఆశ్రమ పాఠశాలలకు, వసతి గృహాలకు సరఫరా చేసే చిరుధాన్యాల పొడులకు సంబంధించి బిల్లులు గిరిజన సహకార సంస్థ (జీసీసీ) దగ్గర పేరుకుపోయాయి. ప్రతినెలా బిల్లులు వస్తేనే ముడిసరుకు కొనుగోలు చేసి, ఉత్పత్తులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. సుమారు రూ.10.88 లక్షల బిల్లులు జీసీసీ వద్ద పెండింగ్‌లో ఉండటంతో ఈ చిరు పరిశ్రమ నిర్వహణ కునారిల్లుతున్నది. బీఆర్ఎస్ హయాంలో మూడేండ్లపాటు నిరాటంకంగా సాగిన పరిశ్రమ.. కాంగ్రెస్ వచ్చిన ఏడాదిన్నరకే మూతబడే దుస్థితికి చేరుకుంది. మూడేండ్లపాటు తమకు అన్నం పెట్టిన పరిశ్రమ ఇప్పుడు బోసిపోయింది. దీనినే నమ్ముకున్న గిరిజన మహిళల జీవితాలు మళ్లీ మొదటికొచ్చాయి.
– మంజుల, నిర్వాహకురాలు
– జాడి హన్మయ్య, ఆసిఫాబాద్