‘సమాజం మనకు ఎంతో ఇచ్చింది. మనం కూడా సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి.. లేకుంటే లావైపోతాం’ ఇది ఓ సినిమాలో డైలాగ్. కానీ ఓ యంగ్ టీమ్ దాన్ని నిజం చేస్తున్నది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ పిలుపు మేరకు ఒక్కచోటుకు చేరి చేతులు కలిపిన ఆ ఉద్యమకారులు.. నేడు సమాజ సేవకులుగా మారారు. నూనూగు మీసాల వయసులో విరిసిన స్నేహబంధం వారిని సప్త సముద్రాల అవతల ఉన్నా ఇప్పటికీ కలిపి ఉంచుతున్నది. సమాజ హితం కోసం పరితపించేలా చేస్తున్నది. అందుకే ‘గివ్ ఫర్ సొసైటీ’ ( GIVE 4 Society ) అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు వాళ్లంతా. విద్య, మహిళా సాధికారత, వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ తదితర రంగాల్లో సేవలందిస్తున్నారు. తెలంగాణ బాగు కోసం పరితపిస్తున్న ఆ మిత్రబృందం కథ అందరికీ స్ఫూర్తిదాయకం.
విద్యార్థి దశలో ఉద్యమకారులుగా తమ ప్రస్థానాన్ని ప్రారంభించిన వీళ్లంతా సామాజిక కార్యకర్తలుగా పోరాడుతున్నారు. ఉద్యమ బాటలో విరిసిన వీరి స్నేహబంధానికి సంకల్ప బలం తోడైంది. సత్య రాపెల్లి, పీవీ అరుణ్, అఖిలేశ్ కాసాని, పర్శురామ్ పంజాల, చంద్రశేఖర్ రెడ్డి, అభిషేక్, రాజు మోకిడె, మహిపాల్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, భాను గౌడ్, సాయి ఈశ్వర్, ప్రియాంకర్, సజేశ్ రావు, శ్రీనివాస్, సాయికృష్ణ సీ, లవణ్ కుమార్, ఫణిందర్ రావు, డాక్టర్ గోపీచంద్, జీ నరేశ్, అనిల్ బీ, రఘు సీ, సుమన్, అల్తాఫ్, భానుప్రకాశ్, శ్రీకాంత్, రమేశ్ జైనోజ్, రాంప్రసాద్, సునిల్, సతీశ్, శ్రీధర్, నరేశ్ బండి, రాంప్రసాద్, రజినీశ్, వేణుమాధవ్ వీళ్లంతా మలిదశ పోరులో పోటెత్తిన ఉద్యమ తరంగాలే! స్వరాష్ట్ర ఏర్పాటుకోసం ఆన్లైన్లో, ఆఫ్‌లైన్‌లో కొట్లాడారు.
కాలక్రమంలో కొందరు అమెరికాలో, ఇతర దేశాల్లో స్థిరపడితే, మరికొందరు తెలంగాణతోపాటు మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో సెటిల్ అయ్యారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులుగా, వ్యాపారవేత్తలుగా వివిధ రంగాల్లో రాణిస్తున్నారు. తర్వాత సమాజానికి తమవంతుగా ఏదైనా ఇవ్వాలనే తపన వారందరినీ మరోసారి ఒకచోటుకు చేర్చింది. అలా 2009లో ‘గివ్ ఫర్ సొసైటీ’ అనే స్వచ్ఛంద సంస్థ పురుడు పోసుకుంది. ‘చదువుతోనే ఆకలి, పేదరికం తొలగించాలి. పేద పిల్లలకు నిస్వార్థంగా సాయం చేయాలి’ ఇది గివ్ ఫర్ సొసైటీ సంస్థ నినాదం. వీరి సంకల్పానికి స్నేహబంధం బలమైంది. దాతల మద్దతుతో పల్లెలకు వెలుగులు పంచే పయనం మొదలైంది.
‘గిరిజన కుటుంబాల్లోని బాలికలకు రుతుస్రావం తెచ్చిన కొత్త ఆంక్షల భయం. వాటికి తోడు పేదరికం.. మూఢ నమ్మకాల ముప్పు అమ్మతనానికే శాపంగా మారుతున్నది’ అని గివ్ ఫర్ సొసైటీ గుర్తించింది. అందుకే బాలికలకు, విద్యార్థినులకు, గిరిజన యువతులకు నెలసరి అనేది ఒక సహజమైన శారీరక ప్రక్రియ అని అవగాహన కల్పించారు. ‘రుతుస్రావం.. భయం కాదు – జీవితంలో భాగం’ అని వివరించి చెప్పారు. మూఢ నమ్మకాలు వదలాలని ఆరోగ్యంగా ఉండాలంటే శానిటరీ నాప్కిన్లు వాడటం తప్పనిసరి అని వివరించారు. ఇలా గివ్ ఇప్పటివరకు 230 ప్రభుత్వ బాలికల పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. అందరికీ ఉచితంగా శానిటరీ నాప్కిన్ల పంపిణీ చేపట్టింది. బాలికలు హైజీన్ సమస్యల కారణంగా బడి మానేయకూడదనే లక్ష్యంతో శానిటరీ నాప్కిన్లు అందజేస్తున్నది. అంతేకాదు.. రుతుస్రావంపై అవగాహన కల్పించేందుకు మారథాన్, హాఫ్ మారథాన్ లాంటి కార్యక్రమాలను సైతం వేదికగా చేసుకుంటున్నారు గివ్ నిర్వాహకులు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కారేపల్లి మండలంలో ఊటవాగు అనే మారుమూల ఆదివాసీ గ్రామం ఉంది. పూర్తిగా అడవుల మధ్యలో ఉన్న ఆ పల్లెలో 55 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అకడికి రోడ్డు లేదు, బైక్ కూడా నడవదు. గ్రామంలో కరెంట్ కూడా లేదు. వారికి విద్యుత్ సౌకర్యం కల్పించడానికి గివ్ బృందం సాహస యాత్ర చేసింది. కొత్తగూడెం ప్రధాన రహదారి నుంచి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో, పూర్తిగా అడవుల మధ్య ఉన్న గ్రామానికి గుట్టల మీదుగా, అడవుల మధ్య, వాగులు, కుంటలు దాటి, సోలార్ దీపాలను మోసుకుంటూ వెళ్లారంతా. 55 కుటుంబాలకు సోలార్ దీపాలను పంపిణీ చేశారు. మొత్తం 40 కిలోమీటర్లు సాగిన ఈ ప్రయాణం ఫలితంగా ఆ కుటుంబాల్లో రాత్రిళ్లు వెలుగులు నింపడమే కాదు.. పిల్లలు చదువుకునే అవకాశం కలిగింది. గిరిజన కుటుంబాల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. మహిళలకు భద్రత చేకూరింది. ‘ఇది సేవ మాత్రమే కాదు.. అది మనుషులందరికీ సమానమైన వెలుగు ఇచ్చే హకు ఉందని నమ్మే ఒక గంభీరమైన సంకల్పయాత్ర’ అని గివ్ సభ్యులు గర్వంగా చెబుతారు.
‘ఒక పాఠశాల మారితే.. ఒక గ్రామం మారుతుంది’ అనే సంకల్పంతో గివ్ సభ్యులు మారుమూల ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మౌలిక వసతులు కల్పిస్తున్నారు. చదువుకోవడం ఏమాత్రం కష్టంగా అనిపించవద్దని, పిల్లలు గర్వంగా పాఠశాలకు రావాలని గివ్ గట్టిగా నమ్మింది. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం, బాలికల కోసం ప్రత్యేక టాయిలెట్లు, పాత భవనాలకు రంగులు వేయడం, బెంచులు, డెసులు, ఇతర ఫర్నిచర్ ఏర్పాటు, స్వచ్ఛమైన తాగునీరు అందేలా ఆర్వో ప్లాంట్లు, పట్టణ విద్యార్థులతో పోటీ పడేలా డిజిటల్ క్లాస్ రూమ్‌లు, కంప్యూటర్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నది.
గివ్ సంస్థ ఇప్పటివరకు మొత్తం 12 పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించింది. ‘పెద్దకల్వల ప్రాథమిక పాఠశాల, పెద్దపల్లి జిల్లా కొమ్మిరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాల, మహబూబ్‌నగర్ జిల్లాలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, సిద్దిపేట జిల్లా ముండ్రాయిలోని ప్రాథమికోన్నత పాఠశాల, సింగాయిపల్లి ప్రాథమిక పాఠశాల, దౌల్తాబాద్ హైస్కూల్, ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ హైస్కూల్, జగిత్యాల జిల్లా కోనరావుపేట ప్రాథమిక పాఠశాల, ఖమ్మం జిల్లా మామిళ్లగూడెం జెడ్పీహెచ్ఎస్, నల్గొండ జిల్లా చందుపట్ల జెడ్పీహెచ్ఎస్, చివెంల జెడ్పీహెచ్ఎస్, కరీంనగర్ జిల్లా మొలంగూరు జెడ్పీహెచ్ఎస్ ఇలా పన్నెండు పాఠశాలల్లో మేం చేసిన మౌలిక సదుపాయాల అభివృద్ధితో విద్యార్థుల హాజరు, ప్రభుత్వ విద్యపై తల్లిదండ్రుల నమ్మకం పెరిగింది’ అని గివ్ సభ్యులు చెప్తున్నారు.
‘చదువుతోనే సమాజ మార్పు.. చదువే మనకు భవిష్యత్తు’ అనే సంకల్పంతో గివ్ ఫర్ సొసైటీ తన ఆవిర్భావం నుంచే విద్యాభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నది. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ చేస్తున్నది. ప్రతి బడి పిల్లవాడి చేతిలో 7 నోట్‌బుక్స్ పెట్టాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు గివ్ సభ్యులు. ఇలా ఇప్పటివరకు.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పది లక్షలకుపైగా నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. ‘వేసవి సెలవులు ముగిసి పాఠశాల మొదలైన తర్వాత నెల రోజులపాటు మాకు ఇంకేం పని ఉండదు.. కార్ల నిండా నోట్‌బుక్స్‌తో బయలుదేరి.. ఖాళీగా వెనక్కి వస్తుంటాం’ అని వివరిస్తారు గివ్ సభ్యులు.
తమ ప్రయత్నంతో నిరుపేద విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గడంతోపాటు చదువుపై ఆసక్తి పెరుగుతుందని, ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం బలపడుతుందని వారు విశ్వసిస్తున్నారు. విద్యార్థులకు బూట్లు, నోట్‌బుక్స్, సూల్ బ్యాగ్స్, సైకిళ్లు, హాస్టల్ విద్యార్థులకు మంచాలు, దుప్పట్లు అందించడం ఇవన్నీ వీరి సేవలో భాగంగా కొనసాగుతున్నాయి. ప్రతిభావంతులై ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి స్కాలర్షిప్ అందిస్తున్నారు. ‘మేము పిల్లలకు పుస్తకాలు, బూట్లు మాత్రమే ఇవ్వడం లేదు. భవిష్యత్తుపై నమ్మకాన్ని కలిగిస్తున్నాం.
పాఠశాల అనేది భయపడే చోటు కాదు, ఆశతో వెళ్లే చోటు కావాలి’ అనే లక్ష్యంతో పనిచేస్తున్నామని గివ్ బృందం గర్వంగా చెబుతున్నది. అంతేకాదు.. పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేలా ప్రాథమిక, హైసూల్ విద్యార్థులకు గాలి, నీటి కాలుష్యం గురించి ప్రత్యేక కార్యక్రమాలు, డ్రాయింగ్ పోటీలు, స్టూడెంట్స్ ప్రాజెక్టులు వంటివి నిర్వహిస్తున్నారు. మొక్కలు నాటించే కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతున్నారు.
విద్యావంతులైన గివ్ సభ్యులు వినూత్నంగా ఆలోచించారు. విద్యార్థినులు, మహిళలకు రుతుస్రావం- పరిశుభ్రతపై అవగాహన కల్పించడంతో సరిపోదని, వారికి అందుబాటు ధరల్లో శానిటరీ నాప్కిన్లను అందిస్తేనే ప్రయోజనం కలుగుతుందని భావించారు. ఇందుకోసం ఇన్ఫోసిస్ మమత ట్రస్ట్, గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్ మద్దతుతో నిర్మల్ జిల్లాలోని మామడ, ముధోల్ గ్రామాల్లో శానిటరీ నాప్కిన్ల తయారీ యూనిట్లను ప్రారంభించారు. ఇవి ఇటీవలే ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాయి. వీటిని ఆయా గ్రామాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలే నిర్వహిస్తున్నారు.
ఈ యూనిట్లతో స్థానిక మహిళలకు ఉపాధి కల్పన, తకువ ధరకే హైజీన్ నాప్కిన్లు లభించడం, తద్వారా బాలికలు, మహిళలకు ఆరోగ్య పరిరక్షణ కల్పించడం.. మూడు రకాలుగా ప్రయోజనాలు కలుగుతున్నాయని సభ్యులు చెబుతున్నారు. వీటిని ఇతర ప్రాంతాలకు విస్తరించే యోచనలో ఉన్నారు. అంతేకాదు.. మహిళలకు ఆర్థికంగా సాధికారత సాధించేలా టైలరింగ్, బ్యుటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్ తదితర ఉపాధి మార్గాల్లో శిక్షణ ఇప్పిస్తున్నారు. ఐటీ, డేటా సైన్స్ రంగాల్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ శిక్షణ మూడు నుంచి ఆరు నెలల పాటు జరుగుతున్నది. సంస్థకు చెందిన సభ్యులు ఇప్పటికే వివిధ సంస్థల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. వారు తమ పరిచయాలను ఉపయోగించి ఉద్యోగార్థులకు సరైన అవకాశాలు కల్పిస్తుండటం విశేషం.
రైతులకు సుస్థిర జీవనోపాధి కల్పించడంలో గివ్ కీలకపాత్ర పోషిస్తున్నది. రైతులకు సేంద్రియ సాగుపై అవగాహన, పర్యావరణహిత వ్యవసాయ పద్ధతులపై మార్గనిర్దేశనం చేస్తున్నారు. నీటి కొరతను ఎదురొంటున్న గ్రామాల్లో నీటి ఆదా పద్ధతులు, వర్షపు నీటిని నిల్వ చేసే విధానాలు, జల సంరక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకోవడంతోపాటు వారి పిల్లల విద్యకు ఆటంకం రాకుండా చేయూతను ఇస్తున్నారు.
ఆ రైతు కుటుంబం జీవనోపాధి పునరుద్ధరణకు నగదు సాయం చేయడం, గేదెలు, ఎద్దులు కొనుగోలు ఆర్థిక వనరులు సమకూర్చడం లాంటివి చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్య సేవలు అందించడానికి, ఆరోగ్యంపై అవగాహన కల్పించేలా ఉచిత వైద్య పరీక్షలు, స్రీనింగ్ నిర్వహించడం, రక్తదాన శిబిరాలు, మహిళల ఆరోగ్య శిబిరాలు, ఉచిత ఔషధాల పంపిణీ లాంటివి చేస్తున్నారు. ఇలా ఉద్యమ బాటలో కలిసిన స్నేహితులు.. సేవామార్గంలో పయనిస్తూ, ఎందరో జీవితాల్లో వెలుగులు నింపుతున్న గివ్ సంస్థ సభ్యులకు మనమూ హ్యాట్సాఫ్ చెబుదాం!
– కాసాని నర్సింహా రెడ్డి